సాక్షి, న్యూఢిల్లీ : నేడు భారత్‌లోని 42 శాతం భూభాగంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (డీఈడబ్ల్యూఎస్)’ వెల్లడించింది. మొత్తం దేశ జనాభాలో 40 శాతం జనాభా అంటే, దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ రాష్ట్రాల్లో, ఈ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించకపోవడం శోచనీయం.
అయితే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలోని అనేక జిల్లాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించాయి. వర్షాలు పడాలంటే మరో రెండు, మూడు నెలలు పడుతుంది కనుక కరవు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ డెవలపర్, గాంధీనగర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విమల్ మిశ్రా తెలిపారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు, రెండూ వైఫల్యం చెందడం వల్ల ఈ కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని మిశ్రా తెలిపారు.
దేశంలో ఏడాదిలో కురిసే వర్షపాతంలో నైరుతి రుతుపవాల వల్ల 80 శాతం, ఈశాన్య రుతు పవనాల వల్ల 20 శాతం వర్షాలు కురుస్తాయి. 2018, జూన్–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కురవాల్సిన వర్షపాతంలో 9.4 శాతం తగ్గినట్లు, అదే ఈశాన్య రుతుపవాల వల్ల అక్టోబర్–డిసెంబర్ మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతంలో 44 శాతం తగ్గినట్లు భారత వాతావరణ పరిశోధన కేంద్రం లెక్కలే తెలియజేస్తున్నాయని మిశ్రా వివరించారు. రుతుపవనాల కన్నా ముందు అంటే, మార్చి–మే నెలల మధ్య కురవాల్సిన వర్షపాతం కూడా ఈ సారి బాగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య కురిసే వర్షపాతంలో కూడా 36 శాతం తగ్గింది. ఫలితంగా దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం 32 శాతం పడిపోయింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోని 31 రిజర్వాయర్లలో నీటి మట్టం 36 శాతం పడిపోయింది.
మున్ముందు కరవు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, పర్యవసానంగా గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయని మిశ్రా హెచ్చరించారు. ఎల్‌నైనో పరిస్థితుల కారణంగా 2015 నుంచి (2017 మినహా) వరుసగా దేశంలో వర్షపాతం తగ్గుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment