గాలివాన, గాడ్పు ఎల్ నినో ముఖాలే | Expect below-normal monsoon; El Nino to be weak: Met Dept | Sakshi
Sakshi News home page

గాలివాన, గాడ్పు ఎల్ నినో ముఖాలే

Published Wed, Jun 11 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

గాలివాన, గాడ్పు ఎల్ నినో ముఖాలే

గాలివాన, గాడ్పు ఎల్ నినో ముఖాలే

వాతావరణాన్ని పద్ధతి ప్రకారం రికార్డులలో నమోదు చేయడం మొదలైన తరువాత భారతదేశంలో నాలుగు నుంచి ఐదేళ్లకు ఒకసారి ఎల్ నినో పరిస్థితులు నెలకొంటున్న సంగతిని గమనించారు. అధికశాతం ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కూడా.
 
 చెట్టు కాయకూ సముద్రంలో ఉప్పుకూ లంకె కుదిరితే నోరూరించే ఆవకాయ అవుతుందేమోగానీ ఎక్కడో పసిఫిక్ మహా సముద్రంలో నీరు వెచ్చబడి, దానికి వాతావరణ మార్పు తోడైతే మాత్రం మన దేశంతోపాటు, చాలా ఆసి యా దేశాల్లో కరువు భయాలు కమ్ముకుంటాయి. అప్పుడ ప్పుడూ వచ్చి... కొందరికి ఖేదం మరికొందరికి మోదం కలి గించిపోయే వాతావరణ వ్యవస్థ ఎల్ నినో దుష్పరిణామం ఇది. దురదృష్టవశాత్తూ ఈ ఏడాది కూడా ఎల్ నినో దాపురిం చడానికి అవకాశాలు ఉన్నాయని అనవచ్చు. ఆ అవకాశాలు 70 - 80 శాతమని అనవచ్చు కూడా.
 
 దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? వాన కురుస్తుందా? కరువు కాటేస్తుందా? గత అనుభవాలను చూస్తే రెండో ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. రికార్డు లను బట్టి చూస్తే ముంచెత్తే వానలకూ అవకాశం లేకపో లేదు. పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికా దగ్గర భూ మధ్య రేఖకు ఇరువైపులా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు పెరిగి పోవడమనే దృగ్విషయాన్ని ఎల్ నినోగా వ్యవహరిస్తామ న్నది తెలిసినదే. ఇలా అక్కడ నీరు వెచ్చబడినప్పుడు సము ద్రపు అట్టడుగు భాగాల్లో ప్రవహించే అంతర్వాహినుల్లోనూ తేడాలొస్తాయి.
 
 ఇంతకీ, ఎల్ నినో వచ్చిందనగానే.. ఈ మార్పులన్నీ జరిగిపోతాయని అర్థం కాదు. ఎల్ నినోలు రెండు రకాలు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు డిసెంబరి సమయం నుంచి కొంచెం కొంచెంగా పెరుగుతూ మే నెల నాటికి అకస్మాత్తుగా పెరిగితే దాన్ని బలమైన ఎల్ నినోగా పిలుస్తారు. మే నెలలో ఉష్ణోగ్రతల పెరుగుదల చెప్పుకోదగ్గ స్థాయిలో లేకుండా ఉన్నప్పుడు దాన్ని బలహీనమైందని అంచనా వేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత వాతావరణ విభాగంతోపాటు, కొన్ని ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థలు ఈసారి బలహీనమైన ఎల్ నినో రానున్నదని అంచనాకు వచ్చాయి. దాని ఆధారంగానే ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటాయని ప్రకటించారు. అయితే అప్పటికి మే నెల ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకోలేదు. వాటిని కూడా లెక్కించి చూసిన తరువాత తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షాభావం, కరువు వచ్చేందుకు 23 శాతం అవకాశముందని లెక్కకట్టారు. ఎల్ నినో రాకకు ఉన్న అవకాశాలు 60 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయి.
 
 వాతావరణాన్ని పద్ధతి ప్రకారం రికార్డులలో నమోదు చేయడం మొదలైన తరువాత భారతదేశంలో నాలుగు నుంచి ఐదేళ్లకు ఒకసారి ఎల్ నినో పరిస్థితులు నెలకొంటున్న సంగతిని గమనించారు. అధికశాతం ఎల్ నినో సంవత్స రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కూడా. 1871 నుంచి 1978 మధ్యకాలంలో దాదాపు 22 సార్లు ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే ఐదుసార్లు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఏర్పడగా... బలహీన ఎల్ నినో పరిస్థితు లున్న నాలుగేళ్లు వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. 2009 నాటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఆ ఏడాది రుతు పవనాల రాక ఆలస్యం కాగా.. ఆ తరువాత కూడా దేశ వ్యాప్తంగా వానలు పలు అంతరాయాల మధ్య కురిశాయి. అదే సమయంలో ఆ ఏడాది అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి లో నిండింది. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుంది?
 
 ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక వారం రోజులు ఆలస్యమైంది. జూన్ 8వ తేదీ నాటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించాల్సిన మేఘాలు దక్షిణం కొస వద్ద తారాడుతున్నాయి. బంగాళాఖాతం నుంచి తగు మోతాదులో తేమ అందకపోవడం వల్ల రుతుపవన మేఘా ల విస్తరణ, విస్తృతిల్లో తేడాలు ఉంటాయని, అడపాదడపా కొంత స్తబ్దత నెలకొనే అవకాశముందని ఇప్పటికే కొన్ని వాతావరణ సంస్థలు హెచ్చరించాయి. జూన్ నుంచి సెప్టెం బర్ వరకు, ఒక్క ఆగస్టులోనే సాధారణం కంటే కొంచెం ఎక్కువగా వానలు కురిసే అవకాశముందని కూడా ఈ సం స్థలు అంచనా వేశాయి. అయితే బంగాళాఖాతంలో తీవ్ర స్థాయి అల్పపీడనమేదైనా ఏర్పడి రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు సహకరిస్తే పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశముంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు హెచ్చ రికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తాగునీరు, పశుగ్రాసం కొరతలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలి.
 - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement