సాక్షి, ముంబై: ఈ ఏడాది కూడా నీటి కష్టాలు తప్పేలా లేవు. ఏప్రిల్ నెలాఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు 33 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ నీటితోనే దాదాపు రెండు నెలలపాటు గడపాల్సి ఉంటుంది. అదీ సకాలంలో వర్షాలు కురిస్తేనే. గత ఏడాది ఏప్రిల్ మాసాంతానికి 27 శాతం నిల్వలే ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా సాధారణస్థాయిలో వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు మరింత తక్కువగా కురిసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఆందోళన వ్యక్తమవుతోంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు...
రాష్ట్రంలో రోజురోజుకు భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నిన్నమొన్నటిదాకా 40 డిగ్రీల లోపు నమోదైన ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సూర్యతాపం పెరిగితే జలాశయాల్లోని నీరు మరింత వేగంగా ఆవిరవుతుందని, దీంతో అవి వర్షాకాలం రాకముందే అడుగంటే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఈ ఏడాది కూడా కరువు తప్పదంటున్నారు. గత ఏడాదికంటే ఆరుశాతం నీటి నిల్వలు ఎక్కువగానే ఉన్నా ఎల్‌నినో ప్రభావమే ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఆరు రెవెన్యూ విభాగాల్లో 84 భారీ నీటి ప్రాజెక్టులున్నాయి. వీటిలో పుణే, మరాఠ్వాడా విభాగాల్లో అత్యల్పంగా 30 శాతం నీటి నిల్వలుండగా, అత్యధికంగా నాగపూర్ విభాగంలో 53 శాతం నీటి నిల్వలున్నాయి.
నీటి కష్టాలు తప్పవా?
Published Wed, Apr 30 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM
Advertisement
Advertisement