water storages
-
నీటి నిల్వలు తగ్గుతున్నాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్న వేళ...ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు పెరిగిన వినియోగం, లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో 146 ప్రధాన జలాశయాలున్నాయి. వీటిల్లో నీటి నిల్వలు గత ఏడాది కన్నా 5శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిజర్వాయర్ల వాస్తవ నిల్వ సామర్ధ్యం 178 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా ప్రస్తుతం 70 బీసీఎంల నిల్వలు ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 74 బీసీఎంలతో పోలిస్తే 5 శాతం తక్కువని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మొత్తం 53 బీసీఎంల నిల్వ సామర్థ్యం కలిగిన 40 రిజర్వాయర్లుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 16.737 బీసీఎంలని వివరించింది. రిజర్వాయర్ల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో ఇది 32 శాతం కాగా, గత ఏడాది కన్నా 7% తక్కువని తెలిపింది. ఇక ఏపీ, తెలంగాణలలోని 11 ప్రధాన రిజర్వాయర్లలో 20 బీసీఎంల నీటి నిల్వలకు గాను కేవలం 5.5 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 8 బీసీఎంలతో పోలిస్తే 11శాతం తక్కువని వెల్లడించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 11.12 బీసీఎంల నిల్వలకు గానూ కేవలం 1.65 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 9% తక్కువని తెలిపింది. -
సమాంతర కాలువే ప్రత్యామ్నాయం
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయంలోకి సోమవారం వరకూ 396.71 టీఎంసీల ప్రవాహం వచ్చింది. పుష్కరకాలం తర్వాత తుంగభద్ర జలాశయంలోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే. ఇప్పటికీ జలాశయంలో 100.855 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసింది కేవలం 20.26 టీఎంసీలే. ఇందులో హెచ్చెల్సీకి(ఎగువ కాలువ) 14.5 టీఎంసీలు, ఎల్లెల్సీకి(దిగువ కాలువ) 5.66 టీఎంసీలు విడుదల చేశారు. కరువు పీడిత ప్రాంతాలకు మేలు బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేసినా.. ఏడాదికి సగటున 150 టీఎంసీలకు మించి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకున్న దాఖలాలు లేవు. కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉండటం.. ఆధునీకరించకపోవడం వల్ల గండ్లు పడటంతో వరద నీటిని ఒడిసిపట్టలేని దుస్థితి నెలకొంది. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను ఆధునీకరించడంతోపాటు హెచ్చెల్సీకి సమాంతరంగా కనీసం 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం గల వరద కాలువ తవ్వితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రయోజనకరంగా ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు దశాబ్దాలుగా సూచిస్తున్నారు. ఈ సమాంతర కాలువ ద్వారా కర్ణాటకలో బళ్లారి జిల్లా, ఏపీలో అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఆధునికీకరణ అసంపూర్ణం పూడిక పేరుకుపోవడం వల్ల తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం క్రమేణ తగ్గుతూ ప్రస్తుతం 100.855 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నుంచి 4,000 క్యూసెక్కులు విడుదల చేసేలా హెచ్చెల్సీ, 1,800 క్యూసెక్కులు విడుదల చేసేలా ఎల్లెల్సీని తవ్వారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు వచ్చేసరికి హెచ్చెల్సీ సామర్థ్యం 1500, ఎల్లెల్సీ సామర్థ్యం 725 క్యూసెక్కులకు పరిమితం చేశారు. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలో మిగిలిన ఆధునీకరణ పనులను గత ఐదేళ్లుగా పూర్తి చేయకపోవడం వల్ల కాలువలకు ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయి. దీనివల్ల సామర్థ్యం మేరకు కూడా నీటిని తరలించలేకపోతున్నారు. ఉభయ రాష్ట్రాలకూ లాభమే.. హెచ్చెల్సీ ప్రధాన కాలువ కర్ణాటకలో 104.587 కిలోమీటర్ల పొడవున ప్రయాణిస్తుంది. ఈ కాలువకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పీఏబీఆర్(పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్), మధ్య పెన్నార్, చాగల్లు, పెండేకళ్లు, వైఎస్సార్ జిల్లాలో చిత్రావతి, మైలవరం రిజర్వాయర్లను నిర్మించారు. ఈ జలాశయాల సామర్థ్యం 38 టీఎంసీలు. తుంగభద్ర జలాశయానికి ఏడాదికి సగటున 70 నుంచి 80 రోజులపాటు వరద ఉంటుంది. హెచ్చెల్సీకి సమాంతరంగా 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ తవ్వి, వరద రోజుల్లో నీటిని తరలిస్తే ఈ జలాశయాలను నింపవచ్చు. వరద ప్రవాహం నిలిచిపోయాక తుంగభద్ర జలాశయం నీటిని పీఏబీఆర్‌కు ఎగువన ఉన్న ఆయకట్టుకు.. ఎల్లెల్సీ, కర్ణాటక పరిధిలోని ఇతర ఆయకట్టుకు అందించవచ్చు. దీనివల్ల కర్ణాటక, ఏపీ, తెలంగాణలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. హెచ్చె ల్సీకి సమాంతరంగా కాలువ తవ్వడంతోపాటు ఎల్లెల్సీని పూర్తిగా ఆధునీకరించి ప్రవాహ సామర్థ్యం పెంచాలంటూ ఏపీ ఇప్పటికే ప్రతిపాదించింది. కర్ణాటక ఆమోదముద్ర వేస్తే.. ఉభయ రాష్ట్రాలకూ ప్రయోజనకరమైన రీతిలో తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోవడా నికి సిద్ధంగా ఉందని అధికారులంటున్నారు. -
కృష్ణమ్మ వస్తోంది!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి.. ఆల్మట్టి నిండింది. నారాయణపూర్ నీటిమట్టం పెరిగింది.. ఇక మన పాలమూరులోని జూరాలకు పారాలా..! వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణానది ప్రవాహం మొదలైంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. వచ్చింది వచ్చినట్లు దిగువకే.. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం రాత్రి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండటంతో 18 గేట్లు ఎత్తారు. లక్షా రెండు వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నీటినిల్వలు ఖాళీ చేయాలని కేంద్ర జల సంఘం కర్ణాటకను హెచ్చరించడంతో ఉదయం నుంచే విద్యుదుత్పత్తి ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేయడం మొదలు పెట్టారు. దీన్ని క్రమంగా 40 వేల క్యూసెక్కుల వరకు పెంచుతూ పోయారు. నారాయణపూర్‌లో... నారాయణపూర్‌కు 30 వేల క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. వరద పోటెత్తే అవకాశాల నేపథ్యంలో నారాయణపూర్ నుంచి నీటివిడుదల మొదలు పెట్టారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు 10 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి ద్వారా నదిలోకి వదిలారు. అర్ధరాత్రి వరకు గేట్లెత్తి క్రమంగా లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తూ వెళతామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నారాయణపూర్ ఇంజనీర్లు జూరాల ప్రాజెక్టు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37 టీఎంసీలకు గానూ 28 టీఎంసీల నిల్వలున్నాయి. జూరాలా.. ఇక పారాలా.. ఎగువ నుంచి వరద ఉధృతిని బట్టి సోమవారం రాత్రికి లేక మంగళవారం ఉదయానికి కృష్ణాజలాలు పాలమూరులోని జూరాల ప్రాజెక్టును చేరనున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ఇందులో 100 టీఎంసీలకుగానూ 24 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్రలోని ఉజ్జయినికి వరద ఉధృతి పెరిగింది. నిన్న మొన్నటి వరకు 10 వేల నుంచి 12 వేల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రానికి 60 వేలకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 117 టీఎంసీలకు గానూ 53 టీఎంసీలకు చేరింది. వరదను ఒడిసిపట్టండి: సీఎం జూరాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలకు అంతా సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లా ఇంజనీర్లను ఆదేశించారు. పాలమూరు జిల్లా చీఫ్ ఇంజనీర్ ఖగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండేతో ఫోన్లో మాట్లాడారు. ఎగువ నుంచి భారీ వరద వచ్చే అవకాశాలుండటంతో జూరా ల కింది ఆయకట్టుకు నీటి విడుదలతోపాటు జూరాలపై ఆధారపడ్డ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పంపులను తిప్పాలని, మోటార్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వచ్చిన వరదను వచ్చినట్లుగా ఎత్తిపోసి చెరువులకు నీటిని తరలించాలని, ఈ ప్రాజెక్టుల కింద గరిష్టంగా 4.50 లక్షల ఎకరాలకు నీరందించేలా చూడాలని సూచించారు. -
47 రిజర్వాయర్లు.. 16 టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: పాత మహబూబ్‌నగర్ జిల్లాలో 4 లక్షలకు పైగా ఎకరాలకు ఆయకట్టునిచ్చే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అదనపు నీటి నిల్వలకు అనుగుణంగా కొత్త రిజర్వాయర్లు నిర్మించనున్నారు. కల్వకుర్తి కింద పెరిగిన నీటి కేటాయింపులకు అనుగుణంగా గరిష్ట నీటి నిల్వలకు వీలుగా 47 రిజర్వాయర్లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 16 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేలా ప్రణాళిక సిద్ధమవ్వగా ఇందుకు రూ.4,175.28 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 4 టీఎంసీల నుంచి 16 టీఎంసీలకు.. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి 25 టీఎంసీల మిగులు జలాల ను తీసుకుంటూ 3.4 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 2005లో చేపట్టారు. ఇం దులో భాగంగానే 4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించారు. ఎల్లూరు రిజర్వాయర్‌లో 0.35 టీఎంసీ, సింగోటం 0.55, జొన్నలబొగుడలో 2.18, గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌లో 0.967 టీఎంసీల నీటి నిల్వ రిజర్వాయర్లున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు నీటి వాటాను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. నీటిని తీసుకునే రోజులను 90 నుంచి 120 రోజులకు పొడగించారు. ఆయకట్టును సైతం 4,23,416 ఎకరాలకు పెంచారు. పెంచిన ఆయకట్టు, పెరిగిన నీటి కేటాయింపులకు అనుగుణంగా రిజర్వాయర్లు పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తొలినుంచీ చెబుతూ వస్తోంది. వరద వచ్చినపుడు లిఫ్టు చేసి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకపోవటంతో కొత్త రిజర్వాయర్లపై సర్వే చేయించింది. మొత్తంగా 20 టీఎంసీలతో 53 రిజర్వాయర్లకు సర్వే నిర్వహించాలని భావించినా, 6 చోట్ల ప్రజా వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఇక మిగతా 47 చోట్ల మాత్రం మొత్తంగా 16.11 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి అనుకూలంగా ఉందని తేల్చింది. ఇందులో 13.064 టీఎంసీల సామర్థ్యమున్న 38 రిజర్వాయర్లను వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డిలో ప్రతిపాదించింది. ఇక ఆయకట్టు లేకున్నా నిల్వల కోసం మరో 9 రిజర్వాయర్లను 3.055 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదిం చింది. గొల్లపల్లి రిజర్వాయర్‌లో గరిష్టంగా 2.81 టీఎం సీలు ప్రతిపాదించగా, మిగతావన్నీ 0.50 టీఎంసీ కన్నా చిన్నవే. భూసేకరణకే రూ.1,276 కోట్లు.. ఇక ఈ 47 రిజర్వాయర్ల నిర్మాణంతో ఏకంగా 22,332 ఎకరాల మేర ముంపు ప్రభావం ఉండనుంది. అలాగే భూసేకరణ అవసరాలకు రూ.1,276 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు లెక్కగట్టారు. రిజర్వాయర్ల మట్టికట్టల నిర్మాణానికి రూ.2,371కోట్లు, సర్ప్లస్ వియర్స్ నిర్మాణానికి మరో రూ.237 కోట్లు, లింకు కాల్వల నిర్మాణానికి మరో రూ.49కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. మొత్తంగా వీటి నిర్మాణానికి రూ.4,175 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు. -
ఊరూరా పశువుల నీటి తొట్టెలు
అనంతపురం టౌన్ : ఈ వేసవిలో పశువుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు రంగంలోకి దిగారు. పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త సహకారంతో చర్యలు ప్రారంభించారు. ‘వారోత్సవం’ పేరుతో ఊరూరా పశువుల నీటి తొట్టెల నిర్మాణాలు చేపడుతున్నారు. సోమవారం 36 మండలాల్లో నిర్మాణాలు మొదలయ్యాయి. ఈ నెల 9లోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,857 పశువుల నీటి తొట్టెలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు కొత్తగా 1,507 నిర్మించనున్నారు. మొదటి రోజు సాయంత్రానికి 101 గ్రౌండింగ్ చేశారు. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.25 వేల ఉపాధి హామీ నిధులను ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.4,250 (17 శాతం) కూలికి, రూ.20,750 (83 శాతం) మెటీరియల్ కోసం వెచ్చిస్తున్నారు. వారం పాటు పనుల పర్యవేక్షణ బాధ్యతను క్లస్టర్ల ఏపీడీలకు అప్పగించారు. వీరు నిత్యం పర్యవేక్షించి రోజువారీ నివేదికను సాయంత్రం నాలుగు గంటల్లోగా అందజేయాలని డ్వామా అధికారులు ఆదేశించారు. సోమవారం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలను డ్వామా పీడీ నాగభూషణం, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ఠాగూర్ పరిశీలించారు. తొట్టెలకు నీటి సౌకర్యం కోసం కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఎక్కడైతే నీటి సౌకర్యం ఉండి.. కుళాయిలు మరమ్మతు చేయాల్సి ఉందో ఆ పనులన్నీ పంచాయతీ రాజ్ అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే 815 చోట్ల మరమ్మతులు చేశారు. నీటి కనెక్షన్ లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నారు. -
ప్రత్యేక బృందాలతో రైళ్లలో దొంగతనాలకు చెక్’
ఒంగోలు క్రైం: రైళ్లలో దొంగతనాలు అరికట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని రైల్వే జీఆర్ పీ అడిషనల్ డీజీపీ కేఆర్ఎం కిషోర్ కుమార్ చెప్పారు. ఆదివారం ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. విజయవాడ నుంచి చెన్నై మార్గంలో తిరుపతి-గుంతకల్లు ప్రాంతాల్లో దొంగతనాలు అదుపులోకి వచ్చాయన్నారు. అయితే విజయవాడ-విశాఖపట్నం రైల్వే మార్గంలో దొంగతనాలు ఇంకా జరుగుతున్నాయని చెప్పారు. సహచర ప్రయాణీకుల్లా నటిస్తూ టీలో మత్తు పదార్థాలు కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న బ్యాచ్‌లను ఇటీవల గుర్తించామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20, 30 గ్యాంగ్‌లు రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ తిరుగుతున్నట్లు వివరించారు. ప్రత్యేక పోలీస్ బందాలతో వీరికి చెక్ పెట్టనున్నట్టు చెప్పారు. -
నీటి కష్టాలు తప్పవా?
సాక్షి, ముంబై: ఈ ఏడాది కూడా నీటి కష్టాలు తప్పేలా లేవు. ఏప్రిల్ నెలాఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు 33 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ నీటితోనే దాదాపు రెండు నెలలపాటు గడపాల్సి ఉంటుంది. అదీ సకాలంలో వర్షాలు కురిస్తేనే. గత ఏడాది ఏప్రిల్ మాసాంతానికి 27 శాతం నిల్వలే ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా సాధారణస్థాయిలో వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు మరింత తక్కువగా కురిసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... రాష్ట్రంలో రోజురోజుకు భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నిన్నమొన్నటిదాకా 40 డిగ్రీల లోపు నమోదైన ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సూర్యతాపం పెరిగితే జలాశయాల్లోని నీరు మరింత వేగంగా ఆవిరవుతుందని, దీంతో అవి వర్షాకాలం రాకముందే అడుగంటే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఈ ఏడాది కూడా కరువు తప్పదంటున్నారు. గత ఏడాదికంటే ఆరుశాతం నీటి నిల్వలు ఎక్కువగానే ఉన్నా ఎల్‌నినో ప్రభావమే ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఆరు రెవెన్యూ విభాగాల్లో 84 భారీ నీటి ప్రాజెక్టులున్నాయి. వీటిలో పుణే, మరాఠ్వాడా విభాగాల్లో అత్యల్పంగా 30 శాతం నీటి నిల్వలుండగా, అత్యధికంగా నాగపూర్ విభాగంలో 53 శాతం నీటి నిల్వలున్నాయి.