ఊరూరా పశువుల నీటి తొట్టెలు
అనంతపురం టౌన్ : ఈ వేసవిలో పశువుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు రంగంలోకి దిగారు. పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త సహకారంతో చర్యలు ప్రారంభించారు. ‘వారోత్సవం’ పేరుతో ఊరూరా పశువుల నీటి తొట్టెల నిర్మాణాలు చేపడుతున్నారు. సోమవారం 36 మండలాల్లో నిర్మాణాలు మొదలయ్యాయి. ఈ నెల 9లోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,857 పశువుల నీటి తొట్టెలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు కొత్తగా 1,507 నిర్మించనున్నారు. మొదటి రోజు సాయంత్రానికి 101 గ్రౌండింగ్ చేశారు. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.25 వేల ఉపాధి హామీ నిధులను ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.4,250 (17 శాతం) కూలికి, రూ.20,750 (83 శాతం) మెటీరియల్ కోసం వెచ్చిస్తున్నారు.
వారం పాటు పనుల పర్యవేక్షణ బాధ్యతను క్లస్టర్ల ఏపీడీలకు అప్పగించారు. వీరు నిత్యం పర్యవేక్షించి రోజువారీ నివేదికను సాయంత్రం నాలుగు గంటల్లోగా అందజేయాలని డ్వామా అధికారులు ఆదేశించారు. సోమవారం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలను డ్వామా పీడీ నాగభూషణం, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ఠాగూర్ పరిశీలించారు. తొట్టెలకు నీటి సౌకర్యం కోసం కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఎక్కడైతే నీటి సౌకర్యం ఉండి.. కుళాయిలు మరమ్మతు చేయాల్సి ఉందో ఆ పనులన్నీ పంచాయతీ రాజ్ అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే 815 చోట్ల మరమ్మతులు చేశారు. నీటి కనెక‌్షన్ లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నారు.