కృష్ణమ్మ వస్తోంది! | Increasing Krishna flow into Almatti | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ వస్తోంది!

Published Mon, Jul 29 2019 3:09 AM | Last Updated on Mon, Jul 29 2019 3:09 AM

Increasing Krishna flow into Almatti - Sakshi

నారాయణపూర్‌ (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి.. ఆల్మట్టి నిండింది. నారాయణపూర్‌ నీటిమట్టం పెరిగింది.. ఇక మన పాలమూరులోని జూరాలకు పారాలా..! వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణానది ప్రవాహం మొదలైంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.  

వచ్చింది వచ్చినట్లు దిగువకే.. 
భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం రాత్రి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండటంతో 18 గేట్లు ఎత్తారు. లక్షా రెండు వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నీటినిల్వలు ఖాళీ చేయాలని కేంద్ర జల సంఘం కర్ణాటకను హెచ్చరించడంతో ఉదయం నుంచే విద్యుదుత్పత్తి ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేయడం మొదలు పెట్టారు. దీన్ని క్రమంగా 40 వేల క్యూసెక్కుల వరకు పెంచుతూ పోయారు.  

నారాయణపూర్‌లో... 
నారాయణపూర్‌కు 30 వేల క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. వరద పోటెత్తే అవకాశాల నేపథ్యంలో నారాయణపూర్‌ నుంచి నీటివిడుదల మొదలు పెట్టారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు 10 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి ద్వారా నదిలోకి వదిలారు. అర్ధరాత్రి వరకు గేట్లెత్తి క్రమంగా లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తూ వెళతామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నారాయణపూర్‌ ఇంజనీర్లు జూరాల ప్రాజెక్టు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37 టీఎంసీలకు గానూ 28 టీఎంసీల నిల్వలున్నాయి.  

జూరాలా.. ఇక పారాలా.. 
ఎగువ నుంచి వరద ఉధృతిని బట్టి సోమవారం రాత్రికి లేక మంగళవారం ఉదయానికి కృష్ణాజలాలు పాలమూరులోని జూరాల ప్రాజెక్టును చేరనున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ఇందులో 100 టీఎంసీలకుగానూ 24 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్రలోని ఉజ్జయినికి వరద ఉధృతి పెరిగింది. నిన్న మొన్నటి వరకు 10 వేల నుంచి 12 వేల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రానికి 60 వేలకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 117 టీఎంసీలకు గానూ 53 టీఎంసీలకు చేరింది.

వరదను ఒడిసిపట్టండి: సీఎం
జూరాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలకు అంతా సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం పాలమూరు జిల్లా ఇంజనీర్లను ఆదేశించారు. పాలమూరు జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ ఖగేందర్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌ పాండేతో ఫోన్‌లో మాట్లాడారు. ఎగువ నుంచి భారీ వరద వచ్చే అవకాశాలుండటంతో జూరా ల కింది ఆయకట్టుకు నీటి విడుదలతోపాటు జూరాలపై ఆధారపడ్డ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల పంపులను తిప్పాలని, మోటార్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వచ్చిన వరదను వచ్చినట్లుగా ఎత్తిపోసి చెరువులకు నీటిని తరలించాలని, ఈ ప్రాజెక్టుల కింద గరిష్టంగా 4.50 లక్షల ఎకరాలకు నీరందించేలా చూడాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement