Jurala Water
-
ప్రాణం తీసిన ఈత సరదా
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వలో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు పిల్లలతో పాటు ఓ వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లారు. ఇందులో ఓ బాలుడు మృతి చెందగా, ముగ్గురిని స్థానిక రైతులు కాపాడారు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని నందిమళ్లలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిమళ్లకు చెందిన మహమూద్ తన కొడుకు మౌలాలి, అదే గ్రామానికి చెందిన సలావుద్దీన్, ఆరిఫ్ (10) అనే పిల్లలను వెంట పెట్టుకుని జూరాల ఎడ మ కాల్వలో స్నానం చేయడానికి వెళ్లాడు. అందరూ కలసి ఈత కొడుతుండగా ఒక్క సారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ప్రవాహ వేగానికి మౌలాలి, సలావుద్దీన్, ఆరిఫ్ కొట్టుకుపోతుండడంతో.. మహమూద్ వెంటనే తన కొడుకు మౌలాలి, సలావుద్దీన్‌లను కాల్వ ఒడ్డువైపు నెట్టేశాడు. అదే సమయంలో మహమూద్ సైతం నీటి ప్రవాహం లో కొట్టుకుని పోతుండగా, చిన్నారుల కేకలకు అక్కడే ఉన్న కురుమూర్తి, లంకాల మల్లేశ్‌లు కాల్వలో దూకి మహమూద్‌ను, ఇద్దరు పిల్లలను కాపాడారు. అప్పటికే నీటి ప్రవాహానికి ఆరిఫ్ కొట్టుకుపోయాడు. 3 గంటల పాటు గాలింపు.. ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆరీఫ్ కోసం నందిమళ్లకు చెందిన జాలర్లు, యువకులు కాల్వలో గాలింపు చేపట్టారు. దాదాపు 3 గంటల పాటు వెతికి నీటిలో విగతజీవిగా పడి ఉన్న ఆరిఫ్ (10) మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. నీటిలో గల్లంతైన తమ కొడుకు ఆరి ఫ్ మృతి చెందాడనే వార్త వినగానే అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారి రోద న పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహేశ్‌గౌడ్ తెలిపారు. -
రేపు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి కృష్ణానది వరద ప్రవాహానికి.. సుంకేశుల నుంచి తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టులో 883.5 అడుగుల్లో నీటి మట్టాన్ని నిర్వహిస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి వరద జలాలను దిగువకు వదిలేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 66 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యుత్ కేంద్రాల నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జున సాగర్‌లోకి 4.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 573.5 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 264 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే ఇంకా 48 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికి సాగర్‌లో నీటి నిల్వ 300 టీఎంసీలకుపైగా చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాగర్ గేట్లను ఎత్తేస్తామని అధికారులు తెలిపారు. సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న జలాల్లో పులిచింతల ప్రాజెక్టులోకి 38,701 క్యూసెక్కులు చేరుతున్నాయి. పులిచింతలలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్ 38,701 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ఇందులో ప్రకాశం బ్యారేజీలోకి 35,346 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 8,634 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 26,712 క్యూసెక్కులను.. 36 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
కృష్ణమ్మ వస్తోంది!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి.. ఆల్మట్టి నిండింది. నారాయణపూర్ నీటిమట్టం పెరిగింది.. ఇక మన పాలమూరులోని జూరాలకు పారాలా..! వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణానది ప్రవాహం మొదలైంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. వచ్చింది వచ్చినట్లు దిగువకే.. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం రాత్రి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండటంతో 18 గేట్లు ఎత్తారు. లక్షా రెండు వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నీటినిల్వలు ఖాళీ చేయాలని కేంద్ర జల సంఘం కర్ణాటకను హెచ్చరించడంతో ఉదయం నుంచే విద్యుదుత్పత్తి ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేయడం మొదలు పెట్టారు. దీన్ని క్రమంగా 40 వేల క్యూసెక్కుల వరకు పెంచుతూ పోయారు. నారాయణపూర్‌లో... నారాయణపూర్‌కు 30 వేల క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. వరద పోటెత్తే అవకాశాల నేపథ్యంలో నారాయణపూర్ నుంచి నీటివిడుదల మొదలు పెట్టారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు 10 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి ద్వారా నదిలోకి వదిలారు. అర్ధరాత్రి వరకు గేట్లెత్తి క్రమంగా లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తూ వెళతామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నారాయణపూర్ ఇంజనీర్లు జూరాల ప్రాజెక్టు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37 టీఎంసీలకు గానూ 28 టీఎంసీల నిల్వలున్నాయి. జూరాలా.. ఇక పారాలా.. ఎగువ నుంచి వరద ఉధృతిని బట్టి సోమవారం రాత్రికి లేక మంగళవారం ఉదయానికి కృష్ణాజలాలు పాలమూరులోని జూరాల ప్రాజెక్టును చేరనున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ఇందులో 100 టీఎంసీలకుగానూ 24 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్రలోని ఉజ్జయినికి వరద ఉధృతి పెరిగింది. నిన్న మొన్నటి వరకు 10 వేల నుంచి 12 వేల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రానికి 60 వేలకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 117 టీఎంసీలకు గానూ 53 టీఎంసీలకు చేరింది. వరదను ఒడిసిపట్టండి: సీఎం జూరాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలకు అంతా సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లా ఇంజనీర్లను ఆదేశించారు. పాలమూరు జిల్లా చీఫ్ ఇంజనీర్ ఖగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండేతో ఫోన్లో మాట్లాడారు. ఎగువ నుంచి భారీ వరద వచ్చే అవకాశాలుండటంతో జూరా ల కింది ఆయకట్టుకు నీటి విడుదలతోపాటు జూరాలపై ఆధారపడ్డ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పంపులను తిప్పాలని, మోటార్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వచ్చిన వరదను వచ్చినట్లుగా ఎత్తిపోసి చెరువులకు నీటిని తరలించాలని, ఈ ప్రాజెక్టుల కింద గరిష్టంగా 4.50 లక్షల ఎకరాలకు నీరందించేలా చూడాలని సూచించారు. -
జూరాల జలజల..రైతు గలగల
నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో చాలా వరకు సమస్యలు గత పాలకుల హయాం నుంచీ తిష్ట వేసుకుని కూర్చున్నాయి. దాదాపు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన హామీలేవీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ఆయా సమస్యలతో ఇప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు సహవాసం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ దాదాపుగా అవే అంశాలు, సమస్యలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి తప్ప సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని జనం అంటున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన హామీలు దశాబ్దాలుగా అమలుకు నోచుకోవడం లేదు. నెరవేరని హామీల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి కావడం గమనార్హం. మరికొన్ని స్థానిక సమస్యలు. అయితే టీఆర్ఎస్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడంతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా ఇదే అంశం త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కలిసి రానుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. సాగు..బాగు గతంలో జలయజ్ఞం పేరుతో వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టులు నేడు సత్పలితాలను ఇస్తున్నాయి. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచడం, ఎత్తిపోతల పథకాలు చేపట్టడం వల్ల నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఆయకట్టు పెరిగింది. మిగతా పెండింగ్ పనులను పూర్తి చేస్తే రైతులకు పూర్తి ప్రయోజనం కలగడంతో పాటు ఆ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి కలుగుతుందని అంటున్నారు. రూపం దాలుస్తున్న ‘కేఎల్ఐ’ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇప్పుడిప్పుడే ఓ రూపం వస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 25 టీఎంసీల నీటిని వినియోగించుకొని నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా నిర్ధేశిత ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రణాళిక ఉంది. ఇటీవల కేఎల్ఐ సామార్థ్యాన్ని 40 టీఎంసీలకు పెంచారు. కాని రిజర్వాయర్లు, కాల్వలు పూర్తికాకపోవడం వల్ల కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల పరిధిలో 70 శాతం వరకు సాగునీరు అందుతుంది. మరోవైపు అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు కేఎల్ఐ సాగునీరు అండటం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు కేంద్రబిందువుగా ఉన్న జూరాల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.1650 కోట్లు ఖర్చు చేశారు. జూరాల ద్వారా సాగుకు నీటి విడుదల ప్రారంభమై 19 ఏళ్లు గడిచాయి. అయితే చివరి ఆయకట్టుకు ఇప్పటికీ నీరు అందని పరిస్థితి.. ఇంకా లైనింగ్ పనులు, ఫీల్డ్ చాన్స్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్డీఎస్ ఆధునీకరణ పనుల్లో ఎదురౌతున్న అడ్డంకులను అధిగమించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు 55 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాజోలి మండలంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు తొలివిడత పూర్తయ్యాయి. మొదటి లిఫ్ట్ ద్వారా సాగునీటిని కూడా విడుదల చేశారు. కాని రెండో విడతలో చేపట్టాల్సిన రిజర్వాయర్లు పూర్తయితేనే పూర్తిస్థాయిలో ప్రయోజనం ఉంటుంది. నడిగడ్డకు అత్యంత కీలకమైన నెట్టెంపాడు ప్రాజెక్ట్ కింద ఏడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా 20 టీఎంసీల నీటిని ఉపయోగించుకొని మొత్తం రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించారు. పనులింకా కొనసాగుతున్నాయి. భూ సేకరణ కూడా పూర్తి కావాల్సి ఉంది. గత బడ్జెట్లో నెట్టెంపాడుకు రూ.200 కోట్లు కేటాయిస్తే రూ.45.92 కోట్లు ఖర్చు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు కూడా పూర్తయ్యాయని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. జాతీయ హోదా కల్పిస్తే మరింత ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయాలని ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులను 18 ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నారు. ♦ గట్టు ఎత్తిపోతల పథకం, చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు చేపడితే గద్వాల నియోజకవర్గంలోని గట్టు,ధరూర్, కేటిదొడ్డి మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల మొదటిదశ పూర్తయినప్పటికి రిజర్వాయర్ల నిర్మాణం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ♦ కొల్లాపూర్ నియోజకవర్గం పరి«ధిలో సోమశీల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణం హామీని నెరవేర్చడంలో గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి ఆనవాళ్లివి.. ♦ నల్లమల అటవీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గంలో కాగితపు పరిశ్రమ ఏర్పాటు చేస్తామనే 40 ఏళ్లుగా కార్యరూపం దాల్చడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా చెంచుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు నిర్మించలేదు. ♦ జడ్చర్ల– నంద్యాల రైల్వేలైన్, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం వంటివీ నెరవేరలేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల వద్ద బ్రిడ్జికి 2008లో వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. శ్రీశైలం ముంపు నిర్వాసితులకు సంబంధించి 98జీఓ అమలు కావడం లేదు. 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, 35 మందికి మాత్రమే ఇచ్చారు. 1983 నుంచి ఈ సమస్య పెండింగ్‌లోనే ఉంది. ♦ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు లేవు. ♦ తుంగభద్ర నదిపై ఏపీకి తెలంగాణకు వారధిగా ఆలంపూర్ వద్ద నిర్మిస్తున్న ర్యాలంపాడు బ్రిడ్జి, అయిజ మండలం నాగులదిన్నెవద్ద నిర్మిస్తున్న వంతెనల నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. ♦ అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ♦ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాల జిల్లాకు చేనేత పార్కు మంజూరైంది. అసెంబ్లీ ఎన్నికల ముందుకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇటిక్యాల వద్ద నేషనల్ ఫుడ్‌పార్కు మంజూరైంది. ఇవి అందుబాటులోకి వస్తే ఎందరికో మేలు జరుగుతుంది. రైలు కూత పెట్టేది ఎప్పుడో.. నాలుగు దశాబ్దాలుగా గద్వాల–మాచర్ల రైల్వేలైన్ నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలను ఇదిగో అదిగో అంటూ ఊరిస్తోంది. ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా మారి, పోటీచేసే ప్రతి నాయకుడు రైల్వేలైన్‌ను సాధిస్తామని చెబుతున్నా.. 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం అయ్యింది. గద్వాల–వనపర్తి– నాగకర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం 1980లో అప్పటి ఎంపి మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డీపీఆర్ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో కేంద్రం గద్వాల– మాచర్ల రైల్వేలైన్ ప్రతి పాదనలు పక్కనబెట్టి, కేవలం నల్లగొండ నుంచి మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. కొన్నేళ్ల అనంతరం గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌కు అవకాశం ఉందని ఇందుకు రూ. 1,160 కోట్లు అంచనా వేశారు. 184 కిలోమీటర్ల మేర లైన్ ఏర్పాటుకు రూ.920 కోట్లు అవసరం అవుతాయని అంచనాకు వచ్చారు. రెండు విడతలుగా ఉన్న ఈ పథకంలో మొదటి విడతగా 2002లో రాయచూర్–గద్వాల రైల్వేలైన్ పనుల పూర్తి అయ్యాయి. రెండో దశలో ఉన్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. రిజర్వాయర్లు నిర్మిస్తే మేలు.. ఆర్డీఎస్ రైతులను ఆదుకోవడానికి రిజర్వాయర్లు నిర్మించాలి. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీళ్లందక బంగారం లాంటి∙పొలాలు బీళ్లు బారుతున్నాయి. ప్రత్యామ్నాయం గా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మించడం మంచిదే. కానీ ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలంటే తప్పకుండా రిజర్వాయర్లు అవసరం. కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టాలి.–శ్యాంసుందర్ రావు, వేముల, ఆలంపూర్ సెగ్మెంట్ అన్ని పార్టీలవి మాటలే.. గద్వాల–మాచర్ల రైల్వేలైన్ సాధిస్తామని ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ అడుగు ముందుకు పడటంలేదు. 1980 నుంచి ఇప్పటి వరకు 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది ఈ లైన్. గద్వాల–వనపర్తి– నాగకర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్ వస్తే 3 రాష్ట్రాలకు రవాణా మెరుగవుతుంది. – సుధాకర్‌రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా అధ్యక్షుడు ఎత్తిపోతలతో తిప్పలు తప్పాయి కేఎల్ఐ ఎత్తిపోతల పథకంతో సాగు కష్టాలు తొలగాయి. కేఎల్ఐ కాల్వ పక్కనే నాకు ఐదెకరాల పొలం ఉంది. అం దులో 2.5 ఎకరాల్లో వేరుశనగ, మిగతా సగం పొలంలో వరిపంట సాగు చేశాను. గతంలో వర్షాలపై ఆధారపడి ఒక్కపంటనే సాగు చేసేవాళ్లం. కాల్వల ద్వారా సాగునీరు రావడంతో రెండు పంటలు సాగు చేస్తున్నాం. దీంతో పాటు నిరంతర విద్యుత్‌తో సమస్యలు తొలగాయి.– పస్పుల నర్సింహ, పాన్‌గల్, వనపర్తి జిల్లా -
జూరాల నుంచే ‘గట్టు’ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఆధారం చేసుకొని గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ ఈ పథకాన్ని చేపట్టాలని మొదట నిర్ణయించగా, ప్రస్తుతం నేరుగా జూరాల నుంచే తీసుకునే దిశగా తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల నేపథ్యంలో జూరాల నుంచి నేరుగా తీసుకునేలా అధికారులు కొత్త ప్రతిపాదన రూపొందించారు. ఈ నేపథ్యంలో అంచనా వ్యయం రూ.553.98 కోట్ల నుంచి రూ.1,597 కోట్లకు చేరుతోంది. 4 టీఎంసీలతో రిజర్వాయర్.. గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు ఈ ఏడాది జూన్ 29న సీఎం ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. దీన్ని రెండు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడత రూ.459.05 కోట్లు, రెండో విడతను రూ.94.93 కోట్లకు ప్రతిపాదించారు. అయితే, గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాన్ని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే, 4 టీఎంసీల మేర నీటిని రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్ నుంచి తీసుకుంటేనే ప్రయోజనం ఎక్కువని శంకుస్థాపన సమయంలోనే ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం జూరాల నుంచే నేరుగా నీటిని తీసుకునేలా ప్రతిపాదించారు. దీనికోసం కొత్తగా 4 టీఎంసీల సామర్థ్యంతో గట్టు రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. జూరాల నుంచి నేరుగా 50 రోజులపాటు 926 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా పథకాన్ని రూపొందించారు. కొత్తగా నిర్మించే రిజర్వాయర్ పొడవు 8 కిలోమీటర్లు ఉండనుంది.ఈ మట్టికట్ట నిర్మాణానికి రూ.396.60 కోట్లు ఖర్చు కానుంది. రెండు పంపులను ఉపయోగించి జూరాల నుంచి గట్టు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. పంప్‌హౌస్‌ల నిర్మాణానికి మరో రూ.90 కోట్లు అవసరమవుతుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో మొత్తం 3,825 ఎకరాల మేర ముంపునకు గురికానుంది. ఎకరాకు రూ.6 లక్షల పరిహారం చొప్పున లెక్కగట్టగా భూసేకరణకే రూ.231 కోట్లు అవసరమవుతున్నాయి. ఈ పథకానికి రూ.1,597 కోట్లతో తుది అంచనాలు సిద్ధమయ్యాయి. ఇక టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. -
జూరాలకు మళ్లీ వరద
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో భారీ వర్షాలు కురు స్తుండటంతో నారాయణపూర్, తుంగభద్ర గేట్లు 15 రోజుల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నారాయణపూర్ నీరు గురువారానికి జూరాల చేరనుంది. తుంగభద్ర నుంచి ఒకట్రెండు రోజుల్లో శ్రీశైలానికి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిగా నిండిన ఆల్మట్టికి ప్రస్తుతం 30,900 క్యూసెక్కుల వరద వస్తుండగా ఆ నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో దిగువనున్న నారాయణపూర్‌లోకి 30 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అక్కడి నుంచి 7 గేట్లు ఎత్తి 22,240 క్యూసెక్కుల నీరు దిగువ జూరాలకు వదులుతున్నారు. జూరాలలో 9.66 టీఎంసీలకుగానూ 7.89 టీఎంసీల నీరుంది. 16 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 5,860 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల పథకాల అవసరాలకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకూ స్థిరంగా వరద తుంగభద్రకూ వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం 21,483 క్యూసెక్కుల ప్రవాహం రాగా 3 గేట్లు ఎత్తి 18,452 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్రలో 100 టీఎంసీల నిల్వకుగానూ 98.20 టీఎంసీల నీరుంది. శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగానూ 144.11 టీఎంసీలున్నాయి. సాగర్‌కు శ్రీశైలం నుంచి 23,768 క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. దీంతో సాగర్‌లోకి 17,643 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్‌లో 144.04 టీఎంసీల నీరుంది. గోదావరి పరీవాహకంలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టుల్లో ఎక్కడా ప్రవాహాల జాడ కనిపించడం లేదు. -
జూరాలకు కొనసాగుతున్న వరద
– మూడు టర్బైన్లలో విద్యుదుత్పత్తి జూరాల : కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం ఇన్‌ఫ్లో వరద కొనసాగుతుంది. 23వేల క్యూసెక్కుల వరద వస్తుండగా జలవిద్యుత్ కేంద్రంలో మూడు టర్బైన్లలో 110 మెగావాట్ల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ దిగువ నదిలోకి 24వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.33 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. జూరాల రిజర్వాయర్ ద్వారా నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 123.08 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి రిజర్వాయర్‌కు 17,980 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 20వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు. ప్రస్తుతం 32.37 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టాన్ని పూర్తిస్థాయికి పెంచుతున్నందున విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా కేవలం 6వేల క్యూసెక్కుల వరదను జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు.