
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో భారీ వర్షాలు కురు స్తుండటంతో నారాయణపూర్, తుంగభద్ర గేట్లు 15 రోజుల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నారాయణపూర్ నీరు గురువారానికి జూరాల చేరనుంది. తుంగభద్ర నుంచి ఒకట్రెండు రోజుల్లో శ్రీశైలానికి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిగా నిండిన ఆల్మట్టికి ప్రస్తుతం 30,900 క్యూసెక్కుల వరద వస్తుండగా ఆ నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో దిగువనున్న నారాయణపూర్‌లోకి 30 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అక్కడి నుంచి 7 గేట్లు ఎత్తి 22,240 క్యూసెక్కుల నీరు దిగువ జూరాలకు వదులుతున్నారు. జూరాలలో 9.66 టీఎంసీలకుగానూ 7.89 టీఎంసీల నీరుంది. 16 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 5,860 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల పథకాల అవసరాలకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్రకూ స్థిరంగా వరద
తుంగభద్రకూ వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం 21,483 క్యూసెక్కుల ప్రవాహం రాగా 3 గేట్లు ఎత్తి 18,452 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్రలో 100 టీఎంసీల నిల్వకుగానూ 98.20 టీఎంసీల నీరుంది. శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగానూ 144.11 టీఎంసీలున్నాయి. సాగర్‌కు శ్రీశైలం నుంచి 23,768 క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. దీంతో సాగర్‌లోకి 17,643 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్‌లో 144.04 టీఎంసీల నీరుంది. గోదావరి పరీవాహకంలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టుల్లో ఎక్కడా ప్రవాహాల జాడ కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment