జూరాల జలజల..రైతు గలగల | Lift Irrigation Project Help to Jurala Farmers | Sakshi
Sakshi News home page

జూరాల జలజల..రైతు గలగల

Published Sat, Mar 16 2019 9:44 AM | Last Updated on Sat, Mar 16 2019 9:44 AM

Lift Irrigation Project Help to Jurala Farmers - Sakshi

నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో చాలా వరకు సమస్యలు గత పాలకుల హయాం నుంచీ తిష్ట వేసుకుని కూర్చున్నాయి. దాదాపు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన హామీలేవీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ఆయా సమస్యలతో ఇప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు సహవాసం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ దాదాపుగా అవే అంశాలు, సమస్యలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి తప్ప సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని జనం అంటున్నారు. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇచ్చిన హామీలు దశాబ్దాలుగా అమలుకు నోచుకోవడం లేదు. నెరవేరని హామీల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి కావడం గమనార్హం. మరికొన్ని స్థానిక సమస్యలు. అయితే టీఆర్‌ఎస్‌ సర్కారు యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడంతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా ఇదే అంశం త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కలిసి రానుందని ఆ పార్టీ నాయకులు అంచనా   వేసుకుంటున్నారు.  

సాగు..బాగు
గతంలో జలయజ్ఞం పేరుతో వైఎస్సార్‌ చేపట్టిన ప్రాజెక్టులు నేడు సత్పలితాలను ఇస్తున్నాయి. తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచడం, ఎత్తిపోతల పథకాలు చేపట్టడం వల్ల నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఆయకట్టు పెరిగింది. మిగతా పెండింగ్‌ పనులను పూర్తి చేస్తే రైతులకు పూర్తి ప్రయోజనం కలగడంతో పాటు ఆ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి కలుగుతుందని అంటున్నారు.

రూపం దాలుస్తున్న ‘కేఎల్‌ఐ’
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇప్పుడిప్పుడే ఓ రూపం వస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 25 టీఎంసీల నీటిని వినియోగించుకొని నాలుగు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల ద్వారా నిర్ధేశిత ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రణాళిక ఉంది. ఇటీవల కేఎల్‌ఐ సామార్థ్యాన్ని 40 టీఎంసీలకు పెంచారు. కాని రిజర్వాయర్లు, కాల్వలు పూర్తికాకపోవడం వల్ల కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల పరిధిలో 70 శాతం వరకు సాగునీరు అందుతుంది. మరోవైపు అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు కేఎల్‌ఐ సాగునీరు అండటం లేదు.

ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు కేంద్రబిందువుగా ఉన్న జూరాల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.1650 కోట్లు ఖర్చు చేశారు. జూరాల ద్వారా సాగుకు నీటి విడుదల ప్రారంభమై 19 ఏళ్లు గడిచాయి. అయితే చివరి ఆయకట్టుకు ఇప్పటికీ నీరు అందని పరిస్థితి.. ఇంకా లైనింగ్‌ పనులు, ఫీల్డ్‌ చాన్స్‌ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనుల్లో ఎదురౌతున్న అడ్డంకులను అధిగమించి ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు రైతులకు 55 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాజోలి మండలంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు తొలివిడత పూర్తయ్యాయి. మొదటి లిఫ్ట్‌ ద్వారా సాగునీటిని కూడా విడుదల చేశారు. కాని రెండో విడతలో చేపట్టాల్సిన రిజర్వాయర్లు పూర్తయితేనే పూర్తిస్థాయిలో ప్రయోజనం ఉంటుంది. నడిగడ్డకు అత్యంత కీలకమైన నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ కింద ఏడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల ద్వారా 20 టీఎంసీల నీటిని ఉపయోగించుకొని మొత్తం రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించారు. పనులింకా కొనసాగుతున్నాయి. భూ సేకరణ కూడా పూర్తి కావాల్సి ఉంది. గత బడ్జెట్‌లో నెట్టెంపాడుకు రూ.200 కోట్లు కేటాయిస్తే రూ.45.92 కోట్లు ఖర్చు  చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు కూడా పూర్తయ్యాయని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించారు. జాతీయ హోదా కల్పిస్తే మరింత ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయాలని ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులను 18 ప్యాకేజీలుగా విభజించి  చేపడుతున్నారు.

గట్టు ఎత్తిపోతల పథకం, చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ పనులు చేపడితే గద్వాల నియోజకవర్గంలోని గట్టు,ధరూర్, కేటిదొడ్డి మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల మొదటిదశ పూర్తయినప్పటికి రిజర్వాయర్ల నిర్మాణం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.
కొల్లాపూర్‌ నియోజకవర్గం పరి«ధిలో సోమశీల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణం హామీని నెరవేర్చడంలో గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

గత పాలకుల నిర్లక్ష్యానికి ఆనవాళ్లివి..
నల్లమల అటవీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గంలో కాగితపు పరిశ్రమ ఏర్పాటు చేస్తామనే 40 ఏళ్లుగా కార్యరూపం దాల్చడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా చెంచుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు.  వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు నిర్మించలేదు.
జడ్చర్ల– నంద్యాల రైల్వేలైన్, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం వంటివీ నెరవేరలేదు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని సోమశిల వద్ద బ్రిడ్జికి  2008లో వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు.  శ్రీశైలం ముంపు నిర్వాసితులకు సంబంధించి 98జీఓ అమలు కావడం లేదు. 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, 35 మందికి మాత్రమే ఇచ్చారు. 1983 నుంచి ఈ సమస్య పెండింగ్‌లోనే ఉంది.
పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగ్‌ కళాశాలలు లేవు.
తుంగభద్ర నదిపై ఏపీకి తెలంగాణకు వారధిగా ఆలంపూర్‌ వద్ద నిర్మిస్తున్న ర్యాలంపాడు బ్రిడ్జి, అయిజ మండలం నాగులదిన్నెవద్ద నిర్మిస్తున్న వంతెనల నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి.
అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.
చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాల జిల్లాకు చేనేత పార్కు మంజూరైంది. అసెంబ్లీ ఎన్నికల ముందుకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇటిక్యాల వద్ద నేషనల్‌ ఫుడ్‌పార్కు మంజూరైంది. ఇవి అందుబాటులోకి వస్తే ఎందరికో మేలు జరుగుతుంది.

రైలు కూత పెట్టేది ఎప్పుడో..
నాలుగు దశాబ్దాలుగా గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌ నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలను ఇదిగో అదిగో అంటూ ఊరిస్తోంది. ప్రతి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా మారి, పోటీచేసే ప్రతి నాయకుడు రైల్వేలైన్‌ను సాధిస్తామని చెబుతున్నా.. 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం అయ్యింది. గద్వాల–వనపర్తి– నాగకర్‌కర్నూల్‌ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ కోసం 1980లో అప్పటి ఎంపి మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత 2007లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి డీపీఆర్‌ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో కేంద్రం గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ ప్రతి పాదనలు పక్కనబెట్టి, కేవలం నల్లగొండ నుంచి మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. కొన్నేళ్ల అనంతరం గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌కు అవకాశం ఉందని ఇందుకు రూ. 1,160 కోట్లు అంచనా వేశారు. 184 కిలోమీటర్ల మేర లైన్‌ ఏర్పాటుకు రూ.920 కోట్లు అవసరం అవుతాయని అంచనాకు వచ్చారు. రెండు విడతలుగా ఉన్న ఈ పథకంలో మొదటి విడతగా 2002లో రాయచూర్‌–గద్వాల రైల్వేలైన్‌ పనుల పూర్తి అయ్యాయి. రెండో దశలో ఉన్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉంది.    

రిజర్వాయర్లు నిర్మిస్తే మేలు..
ఆర్డీఎస్‌ రైతులను ఆదుకోవడానికి రిజర్వాయర్లు నిర్మించాలి. ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టుకు నీళ్లందక బంగారం లాంటి∙పొలాలు బీళ్లు బారుతున్నాయి. ప్రత్యామ్నాయం గా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మించడం మంచిదే. కానీ ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలంటే తప్పకుండా రిజర్వాయర్లు అవసరం. కాబట్టి  ఆ దిశగా చర్యలు చేపట్టాలి.–శ్యాంసుందర్‌ రావు, వేముల, ఆలంపూర్‌ సెగ్మెంట్‌

అన్ని పార్టీలవి మాటలే..
గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌ సాధిస్తామని ప్రతి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ అడుగు ముందుకు పడటంలేదు. 1980 నుంచి ఇప్పటి వరకు 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది ఈ లైన్‌. గద్వాల–వనపర్తి– నాగకర్‌కర్నూల్‌ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ వస్తే 3 రాష్ట్రాలకు రవాణా మెరుగవుతుంది.  
– సుధాకర్‌రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా అధ్యక్షుడు

ఎత్తిపోతలతో తిప్పలు తప్పాయి
కేఎల్‌ఐ ఎత్తిపోతల పథకంతో సాగు కష్టాలు తొలగాయి. కేఎల్‌ఐ కాల్వ పక్కనే నాకు ఐదెకరాల పొలం ఉంది. అం దులో 2.5 ఎకరాల్లో వేరుశనగ, మిగతా సగం పొలంలో వరిపంట సాగు చేశాను. గతంలో వర్షాలపై ఆధారపడి ఒక్కపంటనే సాగు చేసేవాళ్లం. కాల్వల ద్వారా సాగునీరు రావడంతో రెండు పంటలు సాగు చేస్తున్నాం. దీంతో పాటు నిరంతర విద్యుత్‌తో సమస్యలు తొలగాయి.– పస్పుల నర్సింహ, పాన్‌గల్, వనపర్తి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement