సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలో నిర్మించిన, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు పాలమూరు రావాలని సవాల్ విసిరారు. ప్రజాసంగ్రామ యాత్ర–2లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏ గ్రామానికి వెళ్లినా సాగునీటి సమస్యలు, వలసలు, ఉపాధి అంశాలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.
శనివారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సంజయ్ బహిరంగ లేఖ రాశారు. వెనుకబడిన పాలమూరు జిల్లాలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తాము పాదయాత్ర చేపడితే మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ ఉన్నప్పుడు జిల్లాను దత్తత తీసుకొని సాగునీటి సమస్యలేకుండా సస్యశ్యామలం చేస్తానని, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి వలసలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతానన్న హామీలేవీ అమలుకు నోచుకోలేదన్నారు.
‘గత 8 ఏళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. గత ప్రభుత్వాలు పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులను మీ ఖాతాలో వేసుకొని పాలమూరు అంతా సస్యశ్యామలమైందని అసత్యప్రచారం చేస్తున్నారు’అని మండిపడ్డారు. ‘ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలమూరు ప్రజలపట్ల జరుగుతున్న వివక్షపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది’అని అన్నారు.
‘పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు మేం సిద్ధం. మీరు ఓకేనా? ఈ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేసి, వలసలు అరికట్టి ప్రజలకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం స్పందించకుంటే పాలమూరు ప్రజలపట్ల తన వివక్షను, నిర్లక్ష్యాన్ని కొనసాగించేందుకే కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు భావించాల్సి వస్తోంది’అని సంజయ్ ఈ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment