కేసీఆర్‌ రాజీనామా పత్రం తీస్కొని రా.. నిధులపై చర్చిద్దాం! | Bandi Sanjay Dares KTR To Debate On Diversion Of Central Funds | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ రాజీనామా పత్రం తీస్కొని రా.. నిధులపై చర్చిద్దాం!

Jan 8 2023 1:46 AM | Updated on Jan 8 2023 1:46 AM

Bandi Sanjay Dares KTR To Debate On Diversion Of Central Funds - Sakshi

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ప్రారంభమైన పోలింగ్‌ బూత్‌ కమిటీ సమ్మేళనంలో ‘‘సరళ్‌’’ యాప్‌ను ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌    

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై చర్చకు తాము సిద్ధమని, సీఎం కేసీఆర్‌ రాజీనామా పత్రం తీసుకొని వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. కేంద్ర నిధుల విషయంలో మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌కు తాము సిద్ధమని.. అయితే కేటీఆర్‌తో కాకుండా నేరుగా సీఎంతో చర్చిస్తామని, రాష్ట్రానికి కేంద్రం ఏయే రూపాల్లో ఎన్ని నిధులిచ్చిందో చూపుతామని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ నేతలు అభివృద్ధి గురించి మాట్లాడాలని, ప్రతి దానిని రాజకీయం చేయడంపై సరికాదని పేర్కొన్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల సమ్మేళనం జరిగింది. సంజయ్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘సరళ్‌ (సంఘటన్‌ రిపోర్టింగ్‌ అండ్‌ అనాలిసిస్‌)’ యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.  

బీఆర్‌ఎస్‌వి కొత్త డ్రామాలు 
రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు కేంద్ర నిధులపై డ్రామా చేస్తున్నారని సంజయ్‌ మండిపడ్డారు. ఉపాధి హామీ, కంపా, గ్రామపంచాయతీలకు ఇచ్చిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 22 నోటిఫికేషన్లు ఇచ్చిందే తప్ప ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు.

కొందరితో కోర్టుల్లో పిటిషన్లు వేయించి ఉద్యోగాలు భర్తీ కాకుండా బీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరి ఏళుŠల్‌ గడుస్తున్నా ఇప్పటివరకు నోరు మెదపని కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని సంజయ్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతల వ్యవహారం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని.. ఇది చూసి జనం నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. 

ఓటర్ల జాబితాపై దృష్టిపెట్టాలి 
సరళ్‌ యాప్‌ ద్వారా కేంద్ర నిధులు, పథకాల గురించి ప్రజలకు వివరించవచ్చని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓటర్ల జాబితా నుంచి బీజేపీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు అధికార బీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందని ఆరోపించారు. వెంటనే బీజేపీ కార్యకర్తలంతా పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటర్ల జాబితాను పరిశీలించాలని.. బోగస్‌ ఓట్లను తొలగించేలా చూడటంతోపాటు బీజేపీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లను చేర్పించాలని సూచించారు. వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

బీఆర్‌ఎస్‌ నేతల జీతగాళ్లలా పోలీసులు: డీకే అరుణ 
ఇటీవల కామారెడ్డి, గద్వాలలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ పోలీసుల తీరుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘పోలీసులను ముందుపెట్టి బీఆర్‌ఎస్‌ నేతలు డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు చేతకాని దద్దమ్మలు. పోలీసులు బీఆర్‌ఎస్‌ నేతల జీతగాళ్లలా వ్యవహరిస్తున్నారు. జీతాలిచ్చేది కేసీఆర్‌ కాదు. ప్రజల సొమ్ము అది. యూనిఫాం వేసుకుని బెదిరిస్తే భయపడేది లేదు. యూనిఫాం తీసేస్తే మీరు మాములు మనుషులేనని గుర్తుపెట్టుకోండి’’ అని అరుణ వ్యాఖ్యానించారు. 

నడ్డా ప్రసంగం వీలవకపోవడంతో.. 
పార్టీ సమ్మేళనంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆయన పశ్చిమబెంగాల్‌ పర్యటనలో ఉండటంతో ఇందుకు వీలుకాలేదు. దీనితో గతంలో రాష్ట్రంలో బూత్‌ కమిటీలను ఉద్దేశించి నడ్డా చేసిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు. తర్వాత సంజయ్‌ వర్చువల్‌గా అన్ని నియోజకవర్గాల్లోని బూత్‌ కమిటీలను ఉద్దేశించి ప్రసంగించారు.

అయితే ఆన్‌లైన్‌లో కార్యక్రమం నిర్వహణలో సమన్వయలోపం ఏర్పడింది. సంజయ్‌ మాట్లాడుతున్నపుడే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఇతర ముఖ్య నేతలు తమకు కేటాయించిన అసెంబ్లీ కేంద్రాల్లో ప్రసంగించారు. వర్చువల్‌ సమ్మేళనం కావడంతో ఆ ప్రసంగాలు ఇతర నియోజకవర్గాల్లోనూ వినిపించి.. అందరి గొంతులు కలిసిపోయి కాస్త గందరగోళానికి దారితీసింది. 

ఉత్సాహంగా బూత్‌ కమిటీ సమ్మేళనాలు 
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ఒకేరోజు ఒకే సమయంలో బూత్‌ కమిటీ సమావేశాలు, సమ్మేళనాన్ని నిర్వహించడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా బీజేపీ సంస్థాగతంగా ఎన్నికల సంసిద్ధతను చాటిందని, పోలింగ్‌ బూత్‌ కమిటీలను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేసే ప్రక్రియకు శ్రీకారం పడిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

సగానికిపైగా నియోజకవర్గాల్లో వెయ్యి నుంచి 2 వేల మందికిపైగా పాల్గొన్నారని.. హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీతోపాటు ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లోని కొన్నిచోట్ల మాత్రం ఐదు వందల లోపు కార్యకర్తలు హాజరయ్యారని చెప్తున్నాయి. పార్టీ సంస్థాగత బలోపేతం కోసం ఏర్పాటు చేసిన విస్తారక్, ప్రభారీ, కన్వీనర్, పాలక్‌ల వ్యవస్థ బాగా పనిచేస్తున్నట్టు వెల్లడైందని పేర్కొంటున్నాయి.

స్థానికేతరులకు అసెంబ్లీ ప్రభారీలుగా (ఇన్‌చార్జులుగా) పంపగా.. దాదాపు 80 శాతానికి పైగా ప్రభారీలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమానికి హాజరైనట్టు రాష్ట్రపార్టీ కార్యాలయానికి నివేదిక అందింది. శాసనసభ ఎన్నికల సన్నద్ధత కోసం ప్రారంభించిన ‘సరళ్‌’ యాప్‌కు బూత్‌ కమిటీల నుంచి మంచి స్పందన కనిపించింది. పార్టీ సమ్మేళనంలో బూత్‌ కమిటీల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారని ఈ కార్యక్రమ సమన్వయకర్త, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి చెప్పారు. మెజారిటీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్‌ బూత్‌ నుంచి సగటున 20 మంది వరకు హాజరయ్యారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement