ఫిబ్రవరి 11న సీతారామ ప్రాజెక్టుపై టీఏసీ సమావేశం | TAC meeting on Sitarama project on February 11 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 11న సీతారామ ప్రాజెక్టుపై టీఏసీ సమావేశం

Published Fri, Jan 24 2025 5:06 AM | Last Updated on Fri, Jan 24 2025 5:06 AM

TAC meeting on Sitarama project on February 11

తెలంగాణకు శుభవార్త చెప్పిన సీడబ్ల్యూసీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) శుభవార్త చెప్పింది. సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వరా దన్న ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇచ్చే అంశంపై చర్చించడానికి ఫిబ్రవరి 11న సీడబ్ల్యూసీకి చెందిన టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ(టీఏసీ) సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వినియోగంపై ఒప్పందం కుదిరేదాకా లేదా ట్రిబ్యునల్‌ నీటి పంపకాలు తేల్చేదాకా ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను తదుపరి క్లియరెన్స్‌ కోసం కేంద్ర జల సంఘానికి పంపించరాదని గోదావరి బోర్డును కోరుతూ ఏపీ లేఖ రాసింది. ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా సీతారామకు సాంకేతిక అనుమతులు ఇచ్చే అంశంపై చర్చించడానికి సీడబ్ల్యూసీ ముందుకెళ్లనుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ఎత్తిపో తల పథకాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేసి, 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, 3,45,534 ఎకరాల స్థిరీకరించిన ఆయ కట్టును కలుపుకొని 6.74 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీతారామ ఎత్తిపో తల పథకాన్ని 2016 ఫిబ్రవరి 18వ తేదీన రూ.7,926.14 కోట్ల అంచనాలతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ.13,057 కోట్లకు అంచనాలను సవ రించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రాజెక్టు డీపీఆర్‌కు సీడబ్ల్యూసీలోని డైరెక్టరేట్లన్నీ క్లియరెన్స్‌ ఇచ్చాయి.

ఆ తర్వాత డీపీఆర్‌ల పరిశీలన కోసం కేంద్ర జలశక్తి శాఖ గతంలో జారీ చేసిన ’ఫ్లో చార్జ్‌’ప్రకారం గోదావరి బోర్డుకు పంపించారు. ఆ డీపీఆర్‌ను బోర్డు పరిశీలించి, ఏపీ అభ్యంతరాలు/అభిప్రా యాలు జతచేసి, టీఏసీ క్లియరెన్స్‌ కోసం సీడబ్ల్యూసీకి పంపించింది. ఇటీవల సీడబ్ల్యూసీ కొత్త చైర్మన్‌ ముకేష్‌కుమార్‌ సిన్హా రావడంతో టీఏసీ సమావేశానికి రూట్‌ క్లియర్‌ అయ్యింది. దీంతో ఫిబ్రవరి 11న సీతారామతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో రెండు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతిపై చర్చించడానికి టీఏసీ నిర్వహించనున్నట్టు గురువారం రాత్రి కేంద్ర జలవనరుల సంఘం సమాచారం ఇచ్చింది. టీఏసీ క్లియరెన్స్‌ వచ్చాక, ఇక అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి రావాల్సి ఉంటుంది. అది లభిస్తే... ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు లభించనట్టే అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement