జూరాల నుంచే ‘గట్టు’ ఎత్తిపోతలు! | Gattu Lift Irrigation Project May Get Water From Jurala | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 9 2018 3:03 AM | Last Updated on Sun, Sep 9 2018 3:03 AM

Gattu Lift Irrigation Project May Get Water From Jurala - Sakshi

జూరాల ప్రాజెక్టు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలను ఆధారం చేసుకొని గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్‌ నీటిని తీసుకుంటూ ఈ పథకాన్ని చేపట్టాలని మొదట నిర్ణయించగా, ప్రస్తుతం నేరుగా జూరాల నుంచే తీసుకునే దిశగా తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల నేపథ్యంలో జూరాల నుంచి నేరుగా తీసుకునేలా అధికారులు కొత్త ప్రతిపాదన రూపొందించారు. ఈ నేపథ్యంలో అంచనా వ్యయం రూ.553.98 కోట్ల నుంచి రూ.1,597 కోట్లకు చేరుతోంది.  

4 టీఎంసీలతో రిజర్వాయర్‌.. 
గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్‌ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు ఈ ఏడాది జూన్‌ 29న సీఎం ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. దీన్ని రెండు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడత రూ.459.05 కోట్లు, రెండో విడతను రూ.94.93 కోట్లకు ప్రతిపాదించారు. అయితే, గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్‌ రిజర్వాయర్‌ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాన్ని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే, 4 టీఎంసీల మేర నీటిని రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్‌ నుంచి తీసుకుంటేనే ప్రయోజనం ఎక్కువని శంకుస్థాపన సమయంలోనే ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం జూరాల నుంచే నేరుగా నీటిని తీసుకునేలా ప్రతిపాదించారు. దీనికోసం కొత్తగా 4 టీఎంసీల సామర్థ్యంతో గట్టు రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు.  

జూరాల నుంచి నేరుగా 50 రోజులపాటు 926 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా పథకాన్ని రూపొందించారు. కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌ పొడవు 8 కిలోమీటర్లు ఉండనుంది.ఈ మట్టికట్ట నిర్మాణానికి రూ.396.60 కోట్లు ఖర్చు కానుంది. రెండు పంపులను ఉపయోగించి జూరాల నుంచి గట్టు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. పంప్‌హౌస్‌ల నిర్మాణానికి మరో రూ.90 కోట్లు అవసరమవుతుంది. ఈ రిజర్వాయర్‌ నిర్మాణంతో మొత్తం 3,825 ఎకరాల మేర ముంపునకు గురికానుంది. ఎకరాకు రూ.6 లక్షల పరిహారం చొప్పున లెక్కగట్టగా భూసేకరణకే రూ.231 కోట్లు అవసరమవుతున్నాయి. ఈ పథకానికి రూ.1,597 కోట్లతో తుది అంచనాలు సిద్ధమయ్యాయి. ఇక టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement