
చెక్కుచెదరని వందేళ్ల వైరా జలాశయం
ఖమ్మం జిల్లాలో సాగు, తాగునీటి వనరు
పచ్చని సిరులు పండిస్తూ.. దాహార్తి తీరుస్తూ..
వందలాది మంది మత్స్యకారులకు జీవనోపాధి
1923లో శంకుస్థాపన.. రూ.36 లక్షలతో నిర్మాణం
తడారిన భూములకు ఊపిరి పోస్తోంది. ఎండిన గొంతుల దాహార్తి తీరుస్తోంది. అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది.. లక్షలాది బతుకులకు అన్నం పెడుతోంది. పర్యాటక కేంద్రంగా కూడా వరి్ధల్లుతున్న ఆ జలాశయం వయసు వందేళ్లు.. ఖమ్మం జిల్లాలో అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా పేరొందిన వైరా జలాశయంపై కథనమిది.
వైరా: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటైన వైరా జలాశయం.. సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. కల్పతరువుగా నిలుస్తున్న ఈ జలాశయాన్ని స్వాతంత్య్రానికి ముందు నైజాం నవాబు నిర్మించారు.
వృథా నీటిని అరికట్టేలా..
తొలినాళ్లలో ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి అటవీ ప్రాంతం నుంచి ప్రవహించే నిమ్మవాగు, ఏన్కూరు మండలం నుంచి ప్రవహించే గండివాగు, గిన్నెలవాగు, పెద్దవాగుల నుంచి వచ్చే మరో ఏరు.. వైరా సమీపాన కలిసి అతిపెద్ద ప్రవాహంగా తయారై వృ«థాగా పోయేది. ఈ పరిస్థితుల్లో ప్రవాహానికి అడ్డుకట్ట నిర్మించి వేలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలని.. నాటి పాలకుడైన నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆలోచన చేశారు.
దీంతో సాయిద్ జాదా నవాబ్ అలావత్‌జంగ్ బçహదూర్ 1923వ సంవత్సరంలో శంకుస్థాపన చేయగా అప్పటి నిజాం ప్రభుత్వ కార్యదర్శి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అయిన నవాబ్ అలీ, నవాబ్ జంగ్ బçహదూర్ పర్యవేక్షణలో సుమారు రూ.36 లక్షలతో ఏడేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. డంగు సున్నం, రాయితో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించగా.. 274 చదరపు మైళ్ల భూమి ముంపునకు గురైంది. అలాగే, 130 చదరపు మైళ్ల భూమిని రైతుల నుంచి సేకరించి.. అప్పట్లోనే సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులుగా ఉన్నప్పుడు మొత్తం 60 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు 88 అడుగులు కాగా, పొడవు 5,800 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు 19 మైళ్ల దూరం ప్రవహిస్తూ.. 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాయి.

కుడి కాల్వ 15 మైళ్ల దూరం ప్రవహించి 29 ఉపకాల్వల ద్వారా 16 వేల ఎకరాలు, ఎడమ కాల్వ ఐదు మైళ్ల దూరం ప్రవహిస్తూ 22 ఉప కాల్వల ద్వారా తొమ్మిది వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిoది. 1930లో కేవలం 12 వేల ఎకరాల భూములను సాగులోకి తెచ్చేలా డిజైన్ చేసినా ప్రస్తుతం రెండింతలుగా సాగవుతుండడం విశేషం.
దాహార్తి తీరుస్తూ..
ఖమ్మం జిల్లాలోని వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, వేంసూరు, కొణిజర్ల, చింతకాని, ఏన్కూరు, పెనుబల్లి తదితర 11 మండలాల్లోని 420 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారానే తాగునీరు అందుతోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ రిజర్వాయర్ నుంచి ఫ్లోరైడ్ రహిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

వైఎస్సార్ కృషితో మహర్దశ..
జలయజ్ఞంలో భాగంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక కృషి వల్ల ఈ జలాశయం రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు అప్పట్లో రూ.51 కోట్లు మంజూరు చేయగా మహర్దశ పట్టింది. జలాశయం ఆధునికీకరణలో భాగంగా కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీత, సిమెంట్‌తో లైనింగ్ చేయించి కాల్వలు పటిష్టం చేశారు. దీంతో ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నం ఫలించింది.

పర్యాటకంగానూ అభివృద్ధి
రిజర్వాయర్ కట్టపై పచ్చిక బయళ్లు.. అందమైన పూల తోటలు.. చుట్టూ నీరు.. కొండపై నుంచి చూస్తే రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఇక్కడ మైమరిపింపజేస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూస్తూ.. అందమైన సాయంత్రాలు గడిపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సూర్యోదయం లేదా సాయంసంధ్య వేళల్లో ఇక్కడి దృశ్యాలను తిలకించేందుకు రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి.
ఈమేరకు పర్యాటక అభివృద్ధిలో భాగంగా పిల్లల పార్క్ నిర్మించి.. పూలతోటలు అభివృద్ధి చేయడమే కాక ప్రత్యేక టైటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2006లో పర్యాటక శాఖ రూ.70 లక్షలు వెచ్చిoచింది. ఇక్కడ పలు టీవీ సీరియళ్ల షూటింగ్ కూడా జరగడం విశేషం.
మత్స్యకారులకు జీవనోపాధి
వైరా రిజర్వాయర్‌పై కొణిజర్ల, వైరా, తల్లాడ మండలాలకు చెందిన సుమారు 500 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడానికి.. ముందు నుంచే మత్స్యకారులు చేపలు, రొయ్య పిల్లలు వేసి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేటతో జీవనం సాగిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment