నడుము అరుస్తోందా?! | special story to back pain | Sakshi
Sakshi News home page

నడుము అరుస్తోందా?!

Published Wed, Aug 2 2017 11:13 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

నడుము అరుస్తోందా?!

నడుము అరుస్తోందా?!

నొప్పి ఒక అరుపు... శరీరం పెడుతున్న కేక. జాగ్రత్త.. జాగ్రత్త అని చేస్తున్న హెచ్చరిక. ‘లిమిట్‌ క్రాస్‌ అవొద్దు.. ప్రాబ్లం పెద్దదౌతుంది..చెప్పిన మాట విను... అది నీ మంచి కోసమే’ అని మైండ్‌.. బాడీకి ఇస్తున్న సిగ్నల్‌. నడుము నొప్పి ప్రాణం తీసేది కాదు... కానీ ప్రాణం తీసేంత నొప్పి. కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. అక్కచెల్లెళ్లూ... మీరెంతో చురుగ్గా, చలాకీగా ఉంటారు.

మహిళల్లో నడుమునొప్పి...
నడుమునొప్పి చాలా సాధారణంగా కనిపించే సమస్య. కానీ మహిళల్లో ఇది మరింత ఎక్కువ. రోజంతా నిలబడి వంట చేసే సమయంలో నడుము ఒంచి ఉండటం నడుమునొప్పి ముప్పును పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా నడుమునొప్పి తీవ్రత విషయంలో పురుషులు, మహిళలల్లో తేడాలు ఉంటాయి. భారత్‌లో పురుషుల్లో 18 శాతం మంది నడుమునొప్పితో బాధపడుతుంటే మహిళల్లో అది 25 శాతం. పైగా మహిళల్లోని రుతుస్రావం నొప్పి వారి నడుమునొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది. అంతేకాదు... వారిలో ప్రత్యేకంగా స్రవించే హార్మోన్లు సైతం నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంటాయి. పురుషుల్లో కంటే మహిళల్లో ఇన్‌ఫ్లమేషన్‌ (నొప్పి, వాపు, మంట)కు స్పందించడం కాస్తంత తీవ్రంగా ఉంటుంది. ఒకేలాంటి నొప్పి అయినా మగవారితో పోలిస్తే మహిళల్లో ఆ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హార్మోన్లు, జన్యువులు, మనస్తత్వం, నొప్పి తెలిసే వ్యవస్థ వంటివి పరిగణనలోకి తీసుకున్నప్పుడు మహిళల్లో నడుము నొప్పి తీవ్రత ఎక్కువే. అందుకే మహిళల్లో వివిధ కారణాల వల్ల కనిపించే నడుము నొప్పులు, వాటి పరిష్కారాలను చూద్దాం.

నడుమునొప్పుల్లో కొన్ని...
టెయిల్‌బోన్‌ పెయిన్‌ : సరిగ్గా మనం కూర్చొనే చోటికి కాస్త పైనా, నడుమునకు కాస్త కింద నొప్పి రావడాన్ని టెయిల్‌బోన్‌ పెయిన్‌గా చెప్పవచ్చు. అంటే సరిగ్గా వెన్ను చివరి ఎముక దగ్గర నొప్పి రావడం. దీన్ని ‘కాక్సిడైనియా’ అంటారు. ఇది పురుషుల్లో కంటే మహిళల్లో ఐదు రెట్లు ఎక్కువ. ఇక మహిళల్లో గర్భధారణ అనే అంశం కాక్సిడైనియా ముప్పును పెంచుతుంది.

కంప్రెషర్‌ ఫ్రాక్చర్‌ : వెన్నెముకల్లో ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పి. వెన్నెముక అనేది వెన్నుపూసలు అనే చిన్న చిన్న ఎముకల సమాహారం. ఇందులో ఆస్టియోపోరోసిస్‌ ఎముక విరిగినప్పుడు తీవ్రమైన నడుమునొప్పి వస్తుంది. ఈ తరహా కంప్రెషన్‌ ఫ్రాక్చర్స్‌ అయ్యేందుకు అవకాశం ఇరువురిలోనూ ఉన్నా... పురుషుల్లో కంటే మహిళల్లో రెండు రెట్లు ఎక్కువ.

ఫైబ్రోమయాల్జియా : ఈ తరహా నొప్పి వెన్నులో కింది భాగంతో పాటు పైన కూడా కనిపించవచ్చు. మహిళల్లో యాంగై్జటీనే ఇందుకు దోహదం చేస్తుంది.

ఆస్టియో ఆర్థరైటిస్‌ : కీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి ఇది. రెండు ఎముకలు కలిసే చోట ఎముక అరిగినప్పుడు వచ్చే నొప్పి ఇది. అయితే మోకాలు, తుంటి భాగంలో లాగే నడుము ప్రాంతంలోని వెన్నులో ఎముకల అరుగుదలతో ఈ నొప్పి వస్తుంది.

శాక్రో ఇలియాక్‌ జాయింట్‌ సమస్యలు : ఈ ఎముకలు వెన్నెముక చివరి భాగంలో ఉంటాయి. శాక్రమ్‌ అనే వెన్నెముక చిట్టచివరి ఎముక (టెయిల్‌బోన్‌)ను తుంటితో కలిపేలా ఈ ఎముకలు పిరుదులకు ఇరువైపులా కాస్త విస్తరించి ఉంటాయి. ఈ భాగంలో ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చినప్పుడు నడుము కింద భాగంతో పాటు కాళ్లలోకి సైతం నొప్పి పాకుతుంది. గర్భధారణ అనే అంశం ఈ నొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది.  

పక్కతేడా : మహిళలు తమ రోజువారీ పనుల్లో భాగంగా బిందెల మోయడం, పిల్లలను చంకలో మోసేటప్పుడు నడుము ఒంపు భాగంలో ఒత్తిడి పడుతుంటుంది. చాలాసేపు అవసవ్య భంగిమలో ఉండటం కూడా నడుము నొప్పికి కారణం. ఇక నడుము వంచి ఇల్లు తుడిచే వాళ్లు నిటారుగా ఉండే లాంగ్‌ హ్యాండిల్‌ మాప్‌లను వాడటం మంచిది.

అకస్మాత్తుగా అసహజ భంగిమల్లోకి వంగడం, పక్కకు తిరగడం, బరువులు ఎత్తే సమయంలో ముందుకు ఒంగడమూ నడుము నొప్పికి కారణం కావచ్చు. బరువును ఎత్తేటప్పుడు కూర్చొని నెమ్మదిగా ఎత్తడం మేలు. ఇక పనిచేసే చోట్ల మహిళల్లో కంప్యూటర్‌లోకి వంగి చూస్తుండటం వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. అందుకే కంప్యూటర్‌ వంటివి చూస్తున్నప్పుడు నడుమును వీలైనంత నిటారుగా ఉంచాలి.

చాలాసేపు నిలబడి ఉండే వాళ్లలో నడుము నొప్పి
కొన్ని వృత్తుల్లో ఐదారు గంటల పాటు  నిలబడాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లలో నడుమునొప్పి రావడంతో పాటు కాళ్లలోని ఎముకలు, కండరాలు దెబ్బతిని ‘మస్క్యులో స్కెలెటల్‌ డిజార్డర్స్‌’ రావచ్చు. స్వల్పకాలిక సమస్యలైన కాళ్లలో తిమ్మిర్లు (క్రాంప్స్‌) వంటివి నడుమునొప్పితో పాటు వచ్చినప్పుడు పరిస్థితి దుర్భరమవుతుంది. అందుకే చాలాసేపు నిలబడే ఉండే వృత్తుల్లో ఉండేవారు తరచూ కాస్తంత బ్రేక్‌ తీసుకోవాలి. నిలబడి ఉన్నప్పుడు కూడా అదేపనిగా నిటారుగా ఉండకుండా తరచూ పోష్చర్‌లో కాస్తంత మార్పులు చేస్తూ ఉండాలి. వంట చేసేటప్పుడు మహిళలు వంట ప్లాట్‌ఫారమ్‌ దగ్గర చాలాసేపు నిలబడి ఉండాల్సి వస్తోంది. ఇలాంటి వారు తమ ఎత్తునకు అనుగుణంగా ప్లాట్‌ఫారమ్‌ అమర్చుకోవడం, తరచూ కూర్చోడానికి ఎల్తైన లాంగ్‌ స్టూల్‌ను వేసుకోవడం మంచిది. దాని కాళ్ల దగ్గర ఫుట్‌రెస్ట్‌ చేసుకోవడానికి అనుగుణంగా అడ్డుపట్టీలు ఉండటం నడుమునొప్పి నివారించడానికి దోహదపడుతుంది.

డైవింగ్‌ సీట్‌... నడుము నొప్పి
వాహనాన్ని నడపడానికీ, నడుమునొప్పికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. వాహనాన్ని నడిపే కొందరిలో నడుము నొప్పి కనిపిస్తుంటుంది. ఆ నొప్పి నివారణకు సూచనలు :
∙ తొడలకు సీట్‌ సపోర్ట్‌ వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే వాటి నిడివిలో అవి ఎక్కువ భాగం సీట్‌పై ఉండాలన్న మాట.
∙ బ్రేక్, క్లచ్‌ వంటి మీ కాళ్లు ఆనే భాగాలకు మరీ దూరంగా కూర్చోవద్దు. ∙కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి ∙ఎత్తునకు అనుగుణంగా సీట్‌ ఎత్తును అడ్జెస్ట్‌ చేసుకోవాలి ∙సీట్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్‌ ఒంచాలి. ఆ సీట్‌ ఒంపు ఎంత అవసరం అని తెలియాలంటే ఒకటే కొండగుర్తు... ఆ ఒంపు నడుము మీదగానీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. ∙నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్‌) భాగంలో ఒక కుషన్‌ ఉంచుకోవాలి. ఆ లంబార్‌ సపోర్ట్‌ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది. ∙మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్‌రెస్ట్‌ ఉండాలి. ∙సీట్‌లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ పొజిషన్‌ కాస్త మారుస్తూ ఉండాలి. ∙అదేపనిగా డ్రైవ్‌ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్‌ తీసుకోవాలి. ∙ఇక డ్రైవ్‌ చేస్తున్నప్పుడు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం మేలు.

చికిత్స
నడుమునొప్పితో బాధపడుతున్న మహిళలు ముందుగా అది ఏ నిర్దిష్టమైన కారణంతో వస్తున్నదో తెలుసుకోవాలి. ఇందుకోసం అనేక మార్గాలు ఉన్నాయి. వీటిల్లో అన్నింటికంటే ప్రధానమైనది... ఫిజియోథెరపిస్ట్‌ సహాయంతో అవసరమైన వ్యాయామాలు లేదా (ఇంటర్‌ఫెరెన్షియల్‌ థెరపీ) ఐఎఫ్‌టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలూ ఉపశమనాన్ని కలిగిస్తాయి. టెన్స్‌ అనే చికిత్స కూడా ఇలాంటిదే. ట్రాన్స్‌క్యుటేనియస్‌ ఎలక్ట్రికల్‌ నర్వ్‌ స్టిమ్యులేషన్‌ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఈ ‘టెన్స్‌’. ఈ చికిత్స ప్రక్రియలో ఎలక్ట్రోడ్‌ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్‌ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. ఫలితంగా ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భవతులు, మూర్ఛతో బాధపడే రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండె సమస్యను చక్కదిద్దడానికి పేస్‌మేకర్‌ అమర్చిన వాళ్లకు టెన్స్‌ చికిత్స సరికాదు. అందుకే ఇలాంటి చికిత్సలు పూర్తిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి. ఇక పై మార్గాలన్నీ విఫలం అయినప్పుడు సమస్యను శాశ్వతంగా చక్కదిద్దడానికి ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్‌ సర్జన్లు అవసరమైన శస్త్రచికిత్సను నిర్వహించి పరిస్థితిని చక్కబరుస్తారు.

తక్షణ నొప్పి నివారణ కోసం : నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం నొప్పి నివారణ మందులు (పెయిన్‌ కిల్లర్స్‌) అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. శాశ్వత నివారణ కోసం నొప్పి నివారణ మందులను వాడకూడదు. నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడటం వల్ల జీర్ణవ్యవస్థతో పాటు మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. అందుకే రెండు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్‌ మెడిసిన్స్‌) వాడటం మంచిది. అయితే ఇందుకోసం కొన్ని ఆయిల్స్‌తో మసాజ్‌ చేస్తుంటారు. తొలుత నొప్పిని ఉపశమింపజేసే నూనెలతో  మసాజ్‌లు చేయడం మంచిదే.

మసాజ్‌లో భాగంగా నిపుణులు రుద్దడం, నొక్కడం, కొన్ని నిర్దిష్టమైన చోట్ల ఒత్తిడి కల్పించడం... అంటే రోలింగ్, నీడింగ్, అప్లయింగ్‌ ప్రెషర్‌ వంటవి చేస్తారు. దాంతో నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ బాగా అయ్యేలా చేస్తారు. ఫలితంగా కండరాల్లో ఒత్తిడి తగ్గడం లేదా పట్టివేసిన కండరం వదులు కావడం వల్ల నొప్పి ఉపశమిస్తుంది. అయితే... ఇలా ఆరు వారాల కంటే ఎక్కువగా చేసినప్పటికీ నొప్పి కొనసాగుతూ ఉంటే పూర్తిస్థాయి చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే 20 ఏళ్ల లోపు వాళ్లలో నడుము నొప్పి కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

పడక కారణంగా వచ్చే నడుమునొప్పి...
మీ పడక కారణంగా నడుమునొప్పి వస్తుందేమో కూడా చూసుకోవాలి. నిద్రలేవగానే అకస్మాత్తుగా నడుమునొప్పి వస్తే అది పక్కసరిగా లేని కారణంగా కావచ్చు. కనీసం 15 –30 నిమిషాల పాటు మెల్లగా స్ట్రెచ్‌ అవుతూ చేసే వ్యాయామాల తర్వాత కూడా నొప్పి తగ్గలేదంటే అది పక్క సరిగా లేకపోవడం వల్ల వచ్చిన నొప్పిగా అనుకోవచ్చు.

ఏది మంచి పడక : మంచి పడక అనేది అందరికీ ఒకేలా ఉండదు. వారి వారి వ్యక్తిగత సౌకర్యాలకు అనుగుణంగా తమ పడకను ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే నడుము నొప్పి రాకుండా ఉండేందుకు పడక విషయంలో తీసుకోవాల్సిన కొన్ని సూచనలు ఇవి... ∙పడుకునే చోటు సమతలంగా ఉండాలి. అయితే కొందరు కఠినమైన తలం (సర్ఫేస్‌) మీద పడుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గుతుందని అపోహ పడుతుంటారు. అది సరికాదు. పడక కూరుకుపోయేంత మెత్తగానూ ఉండకూడదు, పూర్తిగా చెక్కలాగా కఠినంగానూ ఉండకూడదు. మీ మ్యాట్రెస్‌ తగినంత మెత్తగా ఉంటూనే... సమతలంగానూ ఉండాలి. మీ మ్యాట్రెస్‌ చాలా కఠినంగా ఉంటే వెన్నులోని కొన్ని మృదువైన లిగమెంట్లు, కండరాలను మరీ గట్టిగా నొక్కేస్తుంది. అలాగే మరీ మృదువుగానూ, మీరు లోనికి కుంగిపోయేంత మెత్తగా ఉంటే మీ వెన్నెముకను అర్ధచంద్రాకారంలో ఒంగిపోయేలా చేసి నొప్పికి కారణమవుతుంది. వెన్నెముక ఆకృతి ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా మారి సపోర్ట్‌ ఇచ్చేలా మీ పరుపు ఉండాలి.
డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి, లైఫ్‌స్టైల్‌ నిపుణులు, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement