
మన చుట్టూ ఉన్న వారిలో కనీసం సగం మందికి నడుం నొప్పి సమస్య ఉండే ఉంటుంది. అటు ఇటూ కదల్లేనంత తీవ్రస్థాయిలో కొందరిని బాధిస్తూంటే.. మిగిలిన వారిలో నొప్పి తక్కువగా ఉండవచ్చు. అయితే వీరందరూ పెయిన్ కిల్లర్లను వాడటం కంటే యోగాను నమ్ముకోవడం మేలని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ శాస్త్రవేత్తలు. యోగాతోపాటు కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీలను వాడటం వల్ల నొప్పిని గుర్తించే పరిస్థితి రాదని వీరు అంటున్నారు.
కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలను రెండు గుంపులుగా విడగొట్టి తాము ప్రయోగాలు నిర్వహించామని.. రోజూ రెండు గంటలపాటు మైండ్‌ఫుల్‌నెస్ బేస్డ్ స్ట్రెస్ రిడక్షన్ (ఎంబిఎస్‌ఆర్) అనే పద్ధతిలో భాగంగా యోగా ప్రాక్టీస్, కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చేపట్టామని... 26 వారాల తరువాత రెండు వర్గాల్లోని 60 శాతం మంది తమ నడుం నొప్పి చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గినట్లు చెప్పారని శాస్త్రవేత్తలు తెలిపారు. 1979లో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఎంబిఎస్‌ఆర్ పద్ధతిని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్నారని, ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ పద్ధతి అందుబాటులో ఉందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment