పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా అమ్మాయికి ఆరేళ్లు. పాపకు మెడలో కాయలా ఒక గడ్డ కనిపిస్తోంది. ఇది కనీసం ఐదారు నెలల నుంచి ఉంది. డాక్టర్‌కు చూపించాం. ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఇటీవల అది కాస్త పెద్దదైందేమోనని అనుమానంగా ఉంది. ఈ గడ్డ ఏమిటి? ఇదేమైనా తీవ్రమైన వ్యాధికి సూచనా?
- జమునారాణి, విజయవాడ
మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి మెడ భాగంలో గడ్డలుగా ఉన్నవి లింఫ్‌నోడ్స్ అయి ఉండవచ్చు. ఈ కండిషన్‌ను సర్వైకల్ లింఫెడినోపతి అంటారు. పిల్లల్లో మెడ భాగంలో లింఫ్ గ్రంథులు పెద్దవిగా (వివిధ సైజుల్లో) ఉండటాన్ని చాలా సాధారణంగా చూస్తుంటాం.
లింఫ్‌నోడ్స్ ఇలా పెద్దవి అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సాధారణ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్తో పాటు తీవ్రమైన క్యాన్సరస్ పెరుగుదల వంటి ప్రమాదకరమైన కండిషన్స్‌కు ఇది సూచన కావచ్చు. ఇక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టీబీ లేదా టీబీ కాని బ్యాక్టీరియాలు, లింఫోమా (క్యాన్సర్) వంటి పెద్ద కారణాలతో పాటు, కొన్నిసార్లు కనెక్టివ్ టిష్యూ డిసీజ్, చెవికి ఏదైనా గాయం కావడం (చెవి కుట్టించినప్పుడు కూడా), రకరకాల గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి అతి మామూలు కారణాల వల్ల కూడా ఈ గ్లాండ్స్ పెద్దవి కావడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్లాండ్స్ ఎంత పరిమాణంలో పెరిగాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఇలా పెరగడం అన్నది చాలా సందర్భాల్లో చాలా సాధారణమైన వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వారం నుంచి రెండు వారాల పాటు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేసి చూస్తాం. అప్పటికీ ఇవి తగ్గకుండా ఉండటంతో పాటు, వీటి పరిమాణం 2.5 సెం.మీ. కంటే పెద్దవిగా ఉంటే తప్పనిసరిగా కొన్ని రక్తపరీక్షలతో పాటు, బయాప్సీ కూడా చేయించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒకే నోడ్ పెద్దగా అయి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు కూడా బయాప్సీ చేయించాల్సిన అవసరం ఉంటుంది.
ఇక మీ పాప విషయంలో ఇతర లక్షణాలూ ఏమీ కనిపించడం లేదు కాబట్టి, ్ట మీరు చింతించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గ్లాండ్ పెరుగుతున్నట్లుగా అనుమానిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా తదుపరి అంశాల నిర్ధారణ కోసం ఒకసారి బయాప్సీ చేయించండి. మీరు మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి.
మా పాపకు ఈ నెలతో ఆర్నెల్లు నిండుతాయి. పిల్లలకు ఆర్నెల్లు దాటాక ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియజేయండి.
-సువర్ణ, హైదరాబాద్
చిన్నపిల్లలకు ఆర్నెల్లు దాటాక తల్లిపాలతో పాటు అన్నం, గోధుమల వంటి గింజధాన్యాలు, ఆపిల్, సపోటా వంటి పళ్లు, పప్పుధాన్యాలు, కూరలలో క్యారట్, బాగా ఉడికించిన దుంపలు వంటివి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చాక మంచినీళ్లు తాగించడం అవసరం. ఈ వయసు పిల్లలకు పళ్లను జ్యూస్ రూపంలో ఇవ్వడం సరికాదు.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్