చర్మకాంతికి పాలు పెరుగు...
రోజూ తినే కాయగూరలు, పాలు, పెరుగు... వంటి పదార్థాలన్నీ ముఖకాంతిని పెంచేవే. ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్మానికి సహజకాంతిని అందించే ప్యాక్‌లివి...
టొమాటో
చర్మకాంతిని పెంచుతుంది. ఎండకు కమిలిన చర్మానికి సహజకాంతిని తీసుకువస్తుంది. టొమాటో-దోస కలిపిన గుజ్జును వాడితే, వాటిలో ఉండే మెలనిన్ పిగ్మేంటేషన్ స్థాయిని తగ్గిస్తుంది.
రెండు టేబుల్‌స్పూన్ల టొమాటో జ్యూస్, 50 గ్రా.ల ఓట్స్, 25 గ్రా.ల పెరుగులో కప్పు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
తేనె
కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేస్తే పెద వులు పొడిబారడం, పగుళ్ల సమస్య లు తగ్గి, మృదువుగా అవుతాయి.
రెండు టీ స్పూన్ల క్యారెట్ తురుములో టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ జత చేర్చి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి, శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల నిస్తేజంగా మారిన చర్మానికి జీవకాంతి లభిస్తుంది.
పాలు
చర్మానికి పాలు మంచి క్లెన్సర్‌లా పనిచేస్తాయి. పాలలోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలతో ఉన్న చర్మపు పై పొరను తొలగిస్తుంది.
టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్ మంచి కాంతి లభిస్తుంది.
పసుపు
చర్మకాంతిని పెంచుతుంది. పసుపులో ఉండే సహజసిద్ధమైన రసాయనాలు చర్మంపై మలినాలనూ తొలగిస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల గంధం పొడి, టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకొని అందులో కొన్ని పాలు, రోజ్ వాటర్, కొద్దిగా పసుపు, నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. మచ్చలు తగ్గిపోయి చర్మం కాంతిమంతం అవుతుంది.
స్క్రబ్: ఓట్స్‌కు తగినన్ని నీళ్ళు చేర్చి మెత్తగా ఉడికించి చల్లారిన తర్వాత అందులో పెరుగు, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్ల తో అద్దుకుంటూ, ముఖ చర్మాన్ని మృదువుగా రుద్దాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి.
మసాజ్: టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతివంతం అవుతుంది.
ఫేస్‌మాస్క్: టీ స్పూన్ శనగపిండి, రెండు టీ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పూయాలి. పది నిమిషాల తర్వా త శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ఎండవల్ల నల్లబడిన చర్మానికి సహజమైన రంగు తీసుకువస్తుంది. నిమ్మ, శనగపిండి చర్మాన్ని కాంతిమంతంగా మారిస్తే, పెరుగు మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది.
బాడీ వాష్: తేనె, పెరుగు కలిపి శరీరానికి పట్టించి, పది నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి.
కండిషనర్: పెరుగు జుట్టుకు గొప్ప కండిషనర్‌గా పనిచేస్తుంది. పెరుగులో నిమ్మరసం లేదా మెంతిపిండి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే తలకు పట్టించి, గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.