పెరుగు తినండీ... రక్తపోటును తగ్గించుకోండి
ప్రోబయాటిక్ ఫుడ్ - లోవర్స్ ద హై బీపీ
మనం తోడేసిన పాలు పెరుగుగా మారడానికి కారణం... మనకు మేలు చేసే బ్యాక్టీరియానే అన్న సంగతి తెలిసిందే. ఇదొక్కటే కాదు... కాస్తంత అట్ల పిండిని కాస్త పులిసేలా చేసి అట్లు వేసుకుని తింటుండే సంగతీ తెలిసిందే. ఇలా పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పుష్కలంగా ఉన్న పదార్థాలను ‘ప్రోబయాటిక్’ ఉత్పాదనలుగా మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు 543 మందిపై చేసిన అధ్యయనంలో తెలుసుకున్న కొత్తసంగతి ఏమిటంటే... ప్రోబయాటిక్స్ ఉన్న ఆహారాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయి.
ఈ సంగతి ఆస్ట్రేలియా నుంచి వెలువడే హెల్త్ జర్నల్ ‘హైపర్‌టెన్షన్’లోనూ ప్రచురితమైంది. ఒకవేళ మీకు హైబీపీ లేకపోయినా పరవాలేదు. పెరుగూ, అట్ల వంటి టిఫిన్లు తింటూ ఉండండి. ఇందులోని ప్రోబయాటిక్ బ్యాక్టీరియా రక్తపోటును చాలావరకు నివారిస్తుంది. దాంతో గుండెజబ్బులూ, పక్షవాతం ప్రమాదాలూ నివారితమవుతాయని తెలుసుకోండి.