శాకారుణ్యాహారం... | October -1 Vegetarian Day | Sakshi
Sakshi News home page

శాకారుణ్యాహారం...

Published Mon, Sep 29 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

శాకారుణ్యాహారం...

శాకారుణ్యాహారం...

అక్టోబర్-1శాకాహార దినోత్సవం
 
ఇటీవల ఆరోగ్యరీత్యా కొందరు... జీవకారుణ్య దృష్టితో చాలా మంది ఇప్పుడు శాకాహారాన్ని స్వీకరించడమే కాదు... దాని ప్రాధాన్యాన్ని ప్రచారం చేస్తున్నారు.
 
 శాకాహారంలోనూ ఎన్నో తేడాలు
 చాలామంది కూరగాయలు, ఆకుకూరలు తినడంతో పాటు జంతువుల నుంచి వచ్చే ఉత్సాదనలైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి వాటిని తీసుకుంటారు. మొదటి నుంచి అమల్లో ఉన్న సాంస్కృతిక ఆహారపు అలవాట్ల కారణంగా వారు తమను తాము శాకాహారులుగానే పరిగణిస్తారు. శాకాహారం తీసుకుంటూ, జంతు ఉత్పాదనలైన పాలు, పెరుగు వాడేవారిని ‘లాక్టో వెజిటేరియన్స్’గా పరిగణిస్తారు.
 
 ఇక మరికొందరు ఇటీవల లభ్యమయ్యే గుడ్లలో పొదిగిస్తే ఎదిగే పిండం ఉండదు కాబట్టి వాటిని శాకాహారంగా పరిగణిస్తారు. వీరిని ‘లాక్టో-ఓవో వెజిటేరియన్స్’గా పిలుస్తారు. అయితే మొదటి నుంచీ ఉన్న సాంస్కృతిక అలవాటు కారణంగా కొందరు పిండం లేని గుడ్డును కూడా మాంసాహారంగానే పరిగణిస్తారు. ఇక మరికొందరు చేపలను పూర్తిగా శాకాహారంగా పరిగణిస్తారుగానీ... మిగతా జీవరాశులను మాంసాహారంగా చూస్తారు. ఇక మరికొందరైతే పాలు, పెరుగు, గుడ్లు... ఇలా జంతుసంబంధమైన ఏ ఉత్పాదననైనా మాంసాహారంగానే పరిగణిస్తారు. వీరు జంతు ఉత్పాదనలు ఏవైనా సరే వాటిని ఆహారంగా తీసుకోరు. ఇలాంటి వారిని ‘వేగన్స్’ అని అంటారు. వీరు తీసుకునే శుద్ధశాకాహారాన్ని వైగన్ డైట్ అంటారు. ఈ వేగన్ డైట్ తీసుకునే వారు ఎంత కఠినంగా ఉంటారంటే... తేనెను తేనెటీగలు తయారు చేస్తాయి కాబట్టి మకరందం వాటి ఆహారం కాబట్టి తేనెను కూడా జంతుసంబంధమైన ఉత్పత్తిగానే పరిగణించి శాకాహారంలో దానికి స్థానమివ్వరు.
 
 ఫ్లెక్సిటేరియన్ డైట్ : పై కారణాల వల్ల ఫలానాదే నిర్దిష్టంగా శాకాహారంగా చెప్పడం కష్టం. దాంతో చాలామంది జీవకారుణ్యంతో జంతువుల ప్రాణాలకు గాని లేదా వాటి ఉనికికి గాని ఎలాంటి హానీ లేకుండా వచ్చే జంతు ఉత్పాదనలను ఆహారంగా స్వీకరిస్తూ, వాటిని చంపి మాంసం తీసుకోవడాన్నే వ్యతిరేకిస్తారు. అందుకే వీళ్లు తీసుకునే ఆహారాన్ని ‘ఫ్లెక్సిటేరియన్ డైట్’గా పేర్కొంటారు. వాదనలు ఎలా ఉన్నాప్పటికీ ఆహారం పట్ల అభిరుచి అన్నది వ్యక్తిగత అంశంగా కొందరు ఇలాంటి వివాదాల జోలికి వెళ్లరు. తేనెను కూడా వ్యతిరేకించేంత వేగనిజమ్‌ను కలిగి ఉండటమూ తప్పేననీ, అలాగే జీవహింసనూ చేయడమూ సరికాదనేది ఫ్లెక్సిటేరియన్స్ దృక్పథం.
 
 మాంసాహారంతో అనర్థాలెన్నో...
 శాకాహారాన్ని నిర్వచించే తీరుతెన్నులు ఎన్ని ఉన్నా... మనం సాధారణంగా శాకాహారంగా పరిగణించే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. మాంసాహారంతో మన శరీరంలోకి కొన్ని అవాంఛిత సూక్ష్మజీవులు చేరే అవకాశాలున్నాయి.  
 
 ఉదాహరణకు సరిగా ఉడకని పోర్క్ తినేవారిలో ‘టేప్ వార్మ్స్’ పెరుగుతాయి.
 
 సీఫుడ్స్‌తో అలర్జీలు ఎక్కువే ఉంటాయి.  
 
 మాంసాహారంలోని అధిక కొవ్వుల వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, హైబీపీ వంటి వాటికి దారితీస్తున్నాయి.  
 
 మాంసాహారం జీర్ణమయ్యేందుకు పట్టే సమయం ఎక్కువ.  
 
 మాంసాహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పాదన పెరగడం వల్ల  అల్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
 శాకాహారంతో చేకూరే ప్రయోజనాలెన్నో ...
 శాకాహారం తీసుకునే వారికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోనాలు చేకూరుతాయి. వాటిలో కొన్ని...
     
 శాకాహారం మన శరీరంలో పేరుకునే చాలా విషపదార్థాలను స్వాభావికంగా బయటకు పంపుతుంది. అందుకే వీటిని ‘డీ-టాక్స్’ డైట్ అని కూడా చెబుతుంటారు.     

 శాకాహారంలో పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) ఎక్కువ. దాంతో అది తేలిగ్గా జీర్ణమవుతుంది. కొలోన్ క్యాన్సరు నివారితమవుతాయి.     
 
 శాకాహారంలోని పీచు వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్దకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ సాధ్యం.
 
 దీంతో లభ్యమయ్యే ఫోలేట్స్, ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి పోషణ, విటమిన్స్ లభిస్తాయి కాబట్టి వాళ్లలో మేని మెరుపు చాలా బాగుంటుంది.
     
 శాకాహారంతో తేలిగ్గా బరువును నియంత్రించుకోవచ్చు. ఫలితంగా బీపీ నియంత్రణలో ఉండటం, గుండెజబ్బులకు ఆస్కారం లేకపోవడం వంటివి ప్రయోజనాలు చేకూరతాయి.
     
 ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి.
 
 అంతా మేలేనా... మరి పరిమితులు లేవా?
 శాకాహారం వల్ల అంతా మేలేననీ, పరిమితులేవీ లేవని చెప్పడం కూడా వైద్యశాస్త్రపరంగా సరికాదు. అయితే వాటిని కొన్ని శాకాహార ప్రత్యామ్నాయాలతో అధిగమించవచ్చు. ఉదా:  
     
 ప్రోటీన్లు : శాకాహారం కంటే మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువ. అయితే మాంసాహారం నుంచి దూరంగా ఉండి కేవలం శాకాహారంతోనే ప్రోటీన్లు పొందడం కూడా సాధ్యమే. అందుకోసం చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలు బాగా ఉపకరిస్తాయి. శాకాహారం ద్వారానే ప్రొటీన్ కోరుకునేవారు తమ ఆహారంలో ఈ కింది పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవి:  
 గుమ్మడి గింజలు
 బ్లాక్ బీన్స్  సోయామిల్క్
 పీనట్ బటర్
 బాదం  
 రాజ్మా
 
 క్యాల్షియమ్ : యుక్తవయసులో ఉన్నవారు మొదలుకొని యాభైలలో పడ్డ వారి వరకూ... ప్రతి ఒక్కరికీ ఎముకల ఆరోగ్యం, పటిష్టత, నిర్వహణ కోసం క్యాల్షియమ్ పుష్కలంగా అందాలి. సాధారణంగా పాల ఉత్పాదనల్లో క్యాల్షియమ్ ఎక్కువ. కానీ వెజిటేరియనిజమ్ కారణాలతో క్యాల్షియమ్‌ను శాకాహారం నుంచి పొందాలనుకుంటే ఆకుకూరలైన పాలకూర వంటివీ, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా మిల్స్ ఉత్పాదనలను రోజూ తీసుకోవాలి.
 
 విటమిన్ డి : మన శరీరంలోకి క్యాల్షియమ్ చక్కగా ఇంకిపోవాలంటే విటమిన్-డి అవసరం. ఇది పాల ఉత్పాదన్లో, సూర్యకాంతిలో లభ్యమవుతుంది. సాధారణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ)ల విటమిన్-డి అవసరం. ఒకవేళ జంతువుల నుంచి కాకుండా కేవలం శాకాహారం నుంచి మాత్రమే లభ్యం కావాలనుకుంటే సోయా మిల్క్ ఉత్పాదనలు వాటిని భర్తీ చేస్తాయి.
 
 ఐరన్ : మనలో రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబిన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది.
 
విటమిన్ బి12 : ఇది మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. ఇక శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామీల్ వంటి వాటిపై ఆధారపడాలి. దీని లోపం వల్ల మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండలో తగినంతగా తిరగకుండా ఇన్‌డోర్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్-డి, విటమిన్-బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు, విటమిన్-డి, విటమిన్-బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి.
 
 ఇలా ప్రత్యామ్నాయ ఆహారం ద్వారా జంతువుల నుంచి లభ్యమయ్యే వాటిని శాకాహారంతోనే పొంది జీవహింసను నివారించడంలోని తృప్తినీ, ఆరోగ్యాన్నీ ఏకకాలంలో పొందవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement