సాక్షి, ముంబై: నిత్యావసర సరుకుల ధరలు వింటేనే నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. మూడు నెలల నుంచి కంటతడి పెట్టిస్తున్న ఉల్లితో ధరలో పోటీపడుతున్న టమాటా వరుస జాబితాలో తాజాగా పాలు, కోడిగుడ్లు కూడా వచ్చి చేరాయి. పౌష్టికాహారం కోసం పిల్లలు తప్పక తీసుకోవాల్సిన పాలు, కోడిగుడ్లు కొనాలంటే పేదలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఇంట్లో ఏమి వంటకాలు చేయాలో పాలుపోవడం లేదని నగరవాసి ఒకరు అన్నారు. మార్కెట్‌కు వెళితేనే కూరగాయల ధరలు భయపెడుతున్నాయని వాపోయారు. చికెన్, మాంసం ధరలు కూడా అమాంతం పెరిగాయని తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో రూ.మూడులు ఉన్న కోడి గుడ్డు తాజాగా రూ.ఐదులకు దుకాణదారులు విక్రయిస్తున్నారని చెప్పారు. ఉదయాన్నే లేవగానే పాల ప్యాకెట్ కొనాలన్నా రేటు వింటే ఇబ్బందిగా అనిపిస్తోందని తెలిపారు. ఇటీవల కాలంలోనే పాల ధరలు పెంచిన ప్రభుత్వం మళ్లీ లీటర్‌కు రూ.రెండులను పెంచేందుకు సిద్ధమవుతోంది. త్వరలో అమల్లోకి రానున్న ఈ ధరల వల్ల సామాన్యులపై మరింత అదనపు భారం పడే అవకాశముంది. పాల ఉత్పత్తి వ్యాపారులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ధరలు పెంచ క తప్పడం లేదని పేర్కొంటున్న ప్రభుత్వం ఆ భారం పేదలపై పడుతుందన్న విషయాన్ని మాత్రం మరుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
దీనికి తోడు ఇటీవల బెస్టు బస్సు, ఆటోలు, ట్యాక్సీల చార్జీలు పెరగడం ముంబైకర్లపై మరింత భారం పడేలా చేసింది. అలాగే లోకల్ రైలు సీజన్ పాస్‌ల చార్జీలు పెంచే ప్రతిపాదనను ఇటీవల రూపొందించిన రైల్వే పరిపాలన విభాగం త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలా వరుసగా కూరగాయల నుంచి రవాణా వ్యవస్థ వరకు సామాన్యుడికి అవసరమైన అన్నింటి ధరలు పెరగడంతో వచ్చే జీతం సరిపోక ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.