ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్‌  | Britain At Risk Of Supermarket Shortages With Supply Of Eggs And Vegetables | Sakshi
Sakshi News home page

ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్‌ 

Published Wed, Dec 7 2022 12:51 AM | Last Updated on Wed, Dec 7 2022 8:06 AM

Britain At Risk Of Supermarket Shortages With Supply Of Eggs And Vegetables - Sakshi

గుడ్లు, మాంసానికి కటకట ఏర్పడింది. పాల ఉత్పత్తుల సరఫరా భారీగా పడిపోయింది. కూరగాయలు, పండ్ల సంగతి వేరేగా చెప్పనక్కర్లేదు. దుంపలు పండడమే లేదు. డిమాండ్‌కు సరిపడా పంటల ఉత్పత్తిలేక బ్రిటన్‌లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోంది. ధరాభారంతో రైతులు, సామాన్యులు కుదేలైపోతున్నారు. కొన్ని సూపర్‌ మార్కెట్లలో గుడ్లకి రేషన్‌ పెట్టేశారు. ఇదే పరిమితి ఇతర ఆహార పదార్థాలపై విధించే పరిస్థితులొస్తాయన్న ఆందోళన ఎక్కువ అవుతోంది.  

బ్రిటన్‌ ఆహార సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. బ్రెగ్జిట్‌ నుంచి దేశానికి మొదలైన ఆర్థిక కష్టాల పరంపర కొనసాగుతోంది. కోవిడ్, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి పంట దిగుబడులు,  నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా దేశాన్ని ఊపేసిన ఏవియాన్‌ ఫ్లూతో గుడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని సూపర్‌ మార్కెట్లలో గుడ్లు అమ్మకంపై పరిమితులు విధించారు. బంగాళదుంపలు దొరకడం లేదు. టమాట దిగుబడులు కనీవినీ ఎరుగని రీతిలో పడిపోయాయి. బ్రాసిల్, యాపిల్స్, దోసకాయలు, ఇతర కూరగాయల దిగుబడి భారీగా తగ్గిపోయాయి. గత 45 ఏళ్లలో ఈ స్థాయిలో పంట దిగుబడులు తగ్గిపోవడం ఈ ఏడాదే జరిగింది.  

27% పెరిగిపోయిన పంట ఉత్పత్తి వ్యయం 
ఏడాది వ్యవధిలో పంటల ఉత్పత్తికయ్యే ఖర్చు 27 శాతం పెరిగింది. చమురు, ఎరువులు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి ఖర్చులు తడిసిమోపెడు కావడంతో రైతన్నలు పంటల్ని పండించే పరిస్థితులు లేవని చేతులెత్తేస్తున్నారు. డీజిల్‌ ధరలు 2019తో పోలిస్తే 75 శాతం పెరిగిపోవడం రైతన్నలపై పెనుభారం మోపింది.  ప్రభుత్వం జోక్యం కల్పించుకొని రైతులను ఆదుకోకపోతే బ్రిటన్‌లో కనీవినీ ఎరుగని ఆహార సంక్షోభం ఏర్పడుతుందని జాతీయ రైతు యూనియన్‌ (ఎన్‌ఎఫ్‌యూ) హెచ్చరించింది.

2019తో పోల్చి చూస్తే రిజిస్టర్డ్‌ వ్యవసాయ కంపెనీల సంఖ్య 7 వేలు తగ్గిపోయిందని వెల్లడించింది. పనివాళ్ల కొరత సైతం రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు కుదేలైపోయాయి. ఎన్నో సూపర్‌ మార్కెట్లలో ర్యాక్‌లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.  బ్రిటన్‌లో పాలు, వెన్న సరఫరా చేసే అతి పెద్ద సంస్థ ఆర్లా ఫుడ్స్‌ డిమాండ్‌కు సరిపడా సరఫరా ఇక చేయడం కష్టమని తేల్చి చెప్పింది.

పశుపోషణకయ్యే వ్యయం భారీగా పెరగడంతో రైతులు పాలు సరఫరా చేయడం లేదని తెలిపింది. వాతావరణ మార్పుల ప్రభావం పంటలపై పడుతోంది. బంగాళదుంపలు, ఇతర దుంప కూరలు సరిగా పండడం లేదని జేమ్స్‌ హట్టన్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ లెస్లీ వెల్లడించారు. బంగాళదుంపల ధరలు రెట్టింపయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అంచనా వేశారు. వాతావరణ మార్పులు, ఇంధనం ధరల ప్రభావంతో ఈ ఏడాది ఆహార ఉత్పత్తులు 11% శాతం మేరకు తగ్గిపోయాయని ఇంధన, పర్యావరణ నిఘా విభాగం నివేదిక వెల్లడించింది.  

బ్రిటిష్‌ రిటైల్‌ కన్సోర్టియమ్‌లో ఫుడ్‌ అండ్‌ సస్టయినబులిటీ డైరెక్టర్‌ ఆండ్రూ ఒపె రిటైల్‌ మార్కెట్లు నిత్యావసరల కొరతతో కళ తప్పినప్పటికీ సంక్షోభం వచ్చే పరిస్థితులు వచ్చే అవకాశం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ ప్రభుత్వం రైతులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితుల్ని అంచనా వేస్తోందని, ఆహార భద్రతకు రిషి సునాక్‌ సర్కార్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నవంబర్‌లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 14.6 శాతానికి చేరుకున్నప్పటికీ అక్టోబర్‌తో పోలిస్తే 0.1 శాతం తగ్గిందని, గత రెండేళ్లలో ధరలు తగ్గడం ఇదే తొలిసారని ఆయన వివరించారు.     
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

కళ తప్పిన క్రిస్మస్‌  
క్రిస్మస్‌ పండుగ దగ్గరకొస్తుంటే సామాన్యుల్లో ఈ సారి ఆ హుషారు కనిపించడం లేదు. సాధారణంగా క్రిస్మస్‌కు నెల  రోజుల ముందు నుంచే మార్కెట్లు జనంతో కళకళలాడుతుంటాయి. కానీ ఈ సారి మార్కెట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యుత్‌ బిల్లుల భారం భరించలేక ఎందరో చిరు వ్యాపారులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.  ధరలు ఆకాశాన్నంటడం, కావల్సిన వస్తువులకి కొరత ఏర్పడడంతో ప్రజలు ఉన్నంతలో బతుకుని నెట్టుకొస్తున్నారు. ఒక కుటుంబంపై నెలవారి నిత్యావసరాల ధరల భారం 34 పౌండ్లు. అంటే 3,400 రూపాయల వరకు పడుతోంది. దీంతో సామాన్య ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement