పెరుగు మంగ‌మ్మ‌ | Funday story of the world 03-03-2019 | Sakshi
Sakshi News home page

పెరుగు మంగ‌మ్మ‌

Published Sun, Mar 3 2019 12:50 AM | Last Updated on Sun, Mar 3 2019 12:50 AM

Funday story of the world 03-03-2019 - Sakshi

చాలా ఏళ్ళుగా మాకు వాడుకగా పెరుగు పోస్తోంది మంగమ్మ. మాములుగా మా పేట వేపు వచ్చినప్పుడు మా ఇంటికి రావడం, ‘‘పెరుగు తీసుకుంటారా అమ్మా, మంచి పెరుగు తెచ్చాను’’ అనడం మేం అవసరమైతే తీసుకుని, ఆరోజు ధర ఎలా ఉందో తెలుసుకుని అప్పుడే డబ్బులు ఇచ్చేయడం, లేదా మర్నాడివ్వడం, ఇదీ మా వాడుక.వాళ్ళ ఊరు అవలూరు పక్కన ఏదో పల్లెటూరు. వస్తూ మా ఇంటి ముందు నుంచే రావాలి. వెళ్లేటప్పుడు మా ఇంటి మీదుగానే వెళ్ళాలి. వచ్చేటప్పుడొకసారి, వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఇంటికి రావడం అలవాటు. మా లోగిట్లో కాసేపు కూర్చొని, మమ్మల్ని పలకరించి, తమలపాకులు, వక్క నోట్లో వేసుకుని, లేకపోతే మా దగ్గర పుచ్చుకొని తరువాత ఊరికి వెళ్ళేది. నేను కొంచెం తీరిగ్గా ఉంటే తన కష్టసుఖాల్ని చెప్పుకుని, నన్ను కూడా ఏమైనా చెప్పమంటుంటుంది.నాకేమున్నాయి కష్టాలు? దేవుడి దయవల్ల అంతా బాగానే ఉంది.సుమారు నెలాళ్ళ క్రితం మంగమ్మ పొద్దున్నే ‘‘పెరుగు తీసుకుంటారామ్మ?’’ అంటూ వచ్చినప్పుడు మా కుర్రాడు ‘‘ఇయ్యి పెరుగు’’ అంటూచెయ్యి జాపాడు.‘‘బంగారంలాంటి బిడ్డని కన్నావు. కానీ ఇయ్యన్నీ ఎన్నాళ్ళు? కుర్రోడు పెద్దోడయ్యే వరకే. అప్పుడెవతో వస్తుంది. ఇప్పుడు ‘అమ్మ! అమ్మ!’ అని కొంగట్టుకు తిరిగిన కొడుకు అప్పుడు అమ్మ ఉందో సచ్చిందో కూడా అడగడు’’ అంది మంగమ్మ.నేను ‘‘ఏమైంది మంగమ్మా? కొడుకు నువ్వు చెప్పిన మాట విన్లేదా?’’ అన్నాను.‘‘సర్లే తల్లీ, కట్టుకున్న మొగుడిన్లేదు, ఇక కొడుకేటి వినేది? అయ్యో, నాయమ్మ! నేనేనాడూ మంచి కోక్కట్టుకుని ఎరగను. మరెవతో కట్టుకుంది. కోక అందం చూసి అటెల్లాడు. నా ఇల్లు, నా ఆడది అనుంటే చాలు మగాడికి అనూరుకున్నాను. అమురుతం అన్నాను. మొగుణ్ణి పోగొట్టుకున్నాను. ఏదో నాకంతే రాసుంది. నువ్వు మటుకు మొగుడొచ్చే ఏలకు మంచికోక కట్టుకునుండు. మగాళ్ళ మనసు శానా చంచలం. ఇదుగో, ఇప్పుడు కట్టుకున్నావే, ఇలాంటి కోకలు పనీపాటు చేసేటప్పుడు కట్టుకోవాలి తల్లీ’’ నాక్కొద్దిగా నవ్వొచ్చింది. కాని ఆమె అనుభవంలోంచి వచ్చిన మాటల్లోని తెలివి గొప్పగా తోచింది. ఆ మాటల వెనకాల ఆమె స్వానుభవంలో కలిగిన నొప్పి తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి. అది గ్రహించగానే నాకెంతో బాధ కలిగింది.

‘‘చూడు తల్లీ భర్తని సరిగ్గా వుంచుకోవాలంటే నాలుగు చిటకాలు. అప్పుడప్పుడు తింటానికి రుచిగా ఏమన్నా చేసి పెట్టడం, సక్కగా కళ్ళకింపుగా తయారై, కష్టనిష్ఠూరమో ఏదెలా ఉన్నా నవ్వుతూ పలకరించాలి.ఇంటిక్కావల్సినవన్నీ ఒక్కసారే తెప్పించుకొని, మళ్ళీ మళ్ళీ అడక్కుండా ఉండాలి. మూడు పైసలో, ఆరు పైసలో పోగేసి దాచి, అవసరమన్నప్పుడొక రూపాయి చేతిలో పెట్టాలి. ఆడదిట్టా సేస్తే మొగుడన్నోడు ఇంటికుక్కలా పడుంటాడు. లేదనుకో ఈదులెంట తిరుగుతాడు. నాకు మంగమ్మ మాటల చమత్కారం చూసి ఆశ్చర్యమేసింది. మరోరెండు మాటలాడి ఆ వేళటికి ఇంటికి పంపించేశాను.పదిహేను రోజుల క్రితం మంగమ్మ వచ్చినపుడదోలాగ ఉన్నట్టనిపించి ‘‘ఏ మంగమ్మా! అదోలా వున్నావేమిటి? కొడుకేమన్నా అన్నాడా?’’ అనడిగాను.‘‘అన్నాడమ్మా. వాడి పెళ్ళాం ఏ మెరగని పసివాణ్ణి, వాడేదో చేశాడని పట్టుక్కొట్టింది. ఏమే గయ్యాళీ, ఎందుకు రాక్షసిలా ఆ పసివాడిని బాదుతావు?’’ అని అడిగాను. నాకే ఎదురు తిరిగిందది. నోటికొచ్చినట్టంది. ‘‘ఇదేటే నీ మొగుణ్ణి కన్నదాన్ని నేను.నన్నే ఇంతలేసి మాటలంటావా? కానీయ్, ఆణ్ణే రానీ అడుగుతాను’’ అన్నాను. ఆ దొర ఇంటికొచ్చాడు. ‘‘చూడయ్యా, సంటోణ్ణూరికే బాత్తుంటే ‘ ఒద్దే’ అన్నానని నన్ను నానా తిట్లూ తిట్లింది. నీ పెళ్ళానికి కాస్త బుద్ధి చెప్పుకోరాదా’’ అన్నాను. కోడలొచ్చి ‘‘ఏటి నాకు బుద్ధి చెప్పేది? కుర్రోడల్లరి చేస్తే ఒద్దంటానికి నాకధికారం లేదా? నువ్వు నా మొగుణ్ణి కన్నట్టే, నేనూ ఈణ్ణి కనలేదా? నాకేటి బుద్ధి సెప్పేది?’’ అంది. ఎంతైనా అది ఆడి పెళ్ళాం కదా! ఆడన్నాడూ ‘ఔనే అమ్మా! కన్నబిడ్డనది కొట్టుకుంటుంది. నువ్వెందుకు దాని జోలికి పోతావు? నేను నీ కొడుకుని కదా,  నన్నేమన్నా అను, చెల్లు’’ అన్నాడు. ‘‘నాకెవరయ్యా దిక్కు?’’ అన్నాను. ‘‘నీకేమిటమ్మా పాడి, డబ్బు ఉన్నాయి. నిన్ను నేను సాకక్కర్లేదుగా’’ అన్నాడు. ‘‘అంటే నన్ను వేరు పొమ్మంటావేటిరా?’’ అన్నాను. ‘‘నీ ఇష్టం. పోతానంటే వద్దనను. మీ ఇద్దరి గోల పడలేకుండా ఉన్నాను’’ అన్నాడు.

‘‘సరేనయ్యా, మద్దేనం నుంచి నేను వేరే పోతాలే. నువ్వు, నీ పెళ్ళాం సుకంగా ఉండండి అనేసి పెరుగు తీసుకుని సక్కా వచ్చాను తల్లీ’’ అంటూ మంగమ్మ ఏడ్చింది. నేను ఓదార్చాను. ‘‘సర్లే మంగమ్మా ఇవన్నీ ఉట్టి మాటలే. అంత సర్దుకుంటుంది’’ అని ధైర్యం చెప్పి పంపాను.మర్నాడు మంగమ్మొచ్చినప్పుడు నిన్నటంత దిగాలుగా లేదు. కాని ఎప్పటిలా చురుగ్గానూ లేదు. ‘‘గొడవలన్నీ సర్దుకున్నాయా మంగమ్మా?’’ అనడిగాను. ‘‘సర్దుకోడానికిడుస్తుందా అది. నిన్న నేను పెరుగమ్మి  ఇంటికివెళ్లేసరికి, నా కుండలవీ వారగా ఉంచింది. ఓ దాంట్లో బియ్యం, మరోదాంట్లో రాగులు, ఉప్పు, మిరకాయలు అన్నీను.తను, తన మొగుడూ అన్నం తిన్నామన్నట్లుగా కాళ్ళు జాపుక్కూర్చుంది. ఇంకేముంది తల్లీ సర్దుకునేది. నేనూ ఒకింత ముద్ద (సంగటి) కెలుక్కుని తిన్నాను. నేనేదో అన్నాననుకో. అదే చాలన్నట్టు ఊరుకున్నారు వాళ్ళు. రోజూ ఆ పిల్లాడికింత పెరుగు పెట్టిగాని అమ్మకానికొచ్చేదాన్ని కాదు. పోద్దున్నే ఆ వేళకి ఆడ్నెక్కడికో తీసికెళ్ళిపోయింది. ఆ పిల్లాణ్ణి నాకు దూరం చెయ్యాలనే అలా చేసింది’’ అంది. ఒక చిన్నమాట ఎంత దూరం పోయింది అని ఆశ్చర్యమేసింది నాకు.

తరువాత ఒకట్రెండు రోజులు ఆ మాట ఎత్తలేదు. మంగమ్మ వేరుగా ఉంటున్నట్లుగా అనిపించింది. తరువాతొకరోజు మంగమ్మ, ‘‘నువ్వేసుకుంటావే, ఆ మకమల్‌ జాకెట్టు బట్ట గజమెంత?’’ అనడిగింది.‘‘ఎందుకు మంగమ్మా’’ అన్నాను. ‘‘ఇన్ని రోజులు కొడుక్కి, మనవడికి అనుకుంటూ పైసా పైసా కూడ బెట్టాను. ఇంకెందుకు? నేను మకమల్‌ జాకెట్టు కుట్టించుకుని తొడుక్కు తిరుగుతాను’’ అంది.‘‘జాకెట్టుకు  ఏడెనిమిది రూపాయలవుతుంది మంగమ్మా’’ అన్నాను. ఆ వేళే దర్జీ కొట్లో మంగమ్మ మకమల్‌ బట్ట బేరం చెయ్యనూ చేసింది, కుట్టడానికియ్యనూ ఇచ్చింది. మర్నాడు ఊరికెళుతూ దాన్ని తొడుక్కుని వచ్చింది. ‘‘చూశావా అమ్మయ్యా...నా సింగారం. మావోడొచ్చినప్పుడు కూడా మంచి కోక కట్టలేదు నేను. వాడెవతెనో వెంట  పోయాడు. కన్న కొడుకు కోసం పైసా పైసా కూడబెట్టి దాస్తే దాని కథ ఇట్టాగయింది. చూడు నా సింగారం’’ అంది.

కొడుకుని దూరం చేసుకున్న దుఃఖంలో మంగమ్మకు కొంచెం మతిచలించిందేమో అనిపించింది నాకు. కాని ఆ జాకెట్‌ వల్ల ఆమెకి మిగతా వాళ్ళతో గొడవొచ్చింది. వాళ్ళ ఊళ్ళో  కుర్రాడొకడు బెంగుళూర్లో చదువుకుంటున్నాడట. అతను టై, కాలర్‌ వేసుకునే నాజుకు మనిషి. అతను మంగమ్మనిచూసి ‘‘ఏంటవ్వోయ్‌ ఏకంగా మఖమల్‌ జాకెట్టు తొడిగేసావ్‌?’’ అన్నాట్ట. ‘‘నువ్వు గొంతుక్కి ఊరిపోసుకోగా లేంది నేను జాకెట్టు తొడుక్కుంటేనేం?’’ అందంట. మాటా మాటా పెరిగింది. చుట్టూ ఉన్నవాళ్ళు  నవ్వారు.బయటవాళ్ళ సంగతలా ఉంచి, మంగమ్మ కోడలే, ‘‘కోడలికో రవిక కుట్టించలేక అత్త వేరు పోయి, మఖమల్‌ జాకెట్టు తొడిగింది చూడండి’’ అందట పొరుగు వాళ్ళతో మంగమ్మకి వినబడేలా.మంగమ్మ కోడలికి పెళ్ళిలో కమ్మలు, కడియాలు, నాగర, కంటి, ఒడ్డాణం అన్నీ పెట్టింది.తరువాత ఏడాదికొకటి చొప్పున ఏదో ఒక నగ కొంటూనే ఉంది. అవన్నీ గుర్తులేవా కోడలికి? మంగమ్మ రెండుమూడుసార్లు ఊరుకొని ఆఖరికి ఓ రాత్రివేళ కొడుకుతో ‘‘నీ పెళ్ళాం నన్నేదేదో అంటోంది. నేను దానికేమీకొనివ్వలేదా?’’ అందట. కోడలు మొగుణ్ణి మాట్లాడనియ్యకుండా ‘‘మొగుడు లేని ముసల్దానివి నువ్వు. ఇప్పుడు కమ్మలు, ఒడ్డాణం కావల్సొచ్చాయా? తీసుకుపో, ఏస్కో’’ అంది. ఆ మొగుడు, ‘‘ఎందుకే అన్ని మాటలు!’’ అని పెళ్ళాంతో అని, తల్లితో ‘‘అమ్మా! మీ ఇద్దరి తగూల సంగతి నాకెందుకుగానీ, నీ నగలు నీక్కావాలంటే పట్టుకుపో’’ అన్నాడట.

మంగమ్మ ‘‘ఇరుగు పొరుగుతో అలాంటి మాటలెందుకే’’ అని పెళ్ళానికి చెప్పుకోలేడుగానీ, కావాలంటే నగలు తీసుకుపో అని నా మీదే తప్పు మోపాడు’’ అని వాపోయింది. అదంతా విని చాలా బాధపడ్డాను. ఈమె చూస్తే ముసల్ది. అతనా ఒక్కడే కొడుకు. ఆ మనిషి మొగుణ్ణి, మొగుడి తల్లిని కాస్త బాగా చూసుకోకూడదూ. ఇంతకీ ముసల్ది మనవణ్ణి కొట్టొద్దన్నందుకు ఇంత గొడవా? ఎందుకిలా చేస్తారో కదా అనిపించింది. అవును, ఎక్కడచూసినా దెబ్బలాటలకి కారణాలిలాగే ఉంటాయి. ఒకరికి ఒకరంటే పడకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలవుతాయి’’ అనిపించింది.ఇది జరిగిన కొన్నాళ్ళకి మంగమ్మ నాతో, ‘‘అమ్మా మీరు సత్యవంతులు. నాది కొంచెం డబ్బుంది. దాన్ని ఎక్కడైనా బ్యాంకి అంటారు కదా అలాంటి చోట దాచిపెట్టగలరా? దానికి మీ సాయం కావాలి. ఆ డబ్బు మీద వాళ్ళు, వీళ్ళు కన్నేస్తున్నారు...’’ అంది. ఏం జరిగిందని అడిగాను. నిన్నేం జరిగిందంటే. మా  ఊళ్ళో రంగప్పని ఒకడున్నాడు. జూదగాడు, సోకులెక్కువ. నేను పెరుగు తీసుకొస్తుంటే  తోవలో ఎక్కడ్నుంచో ఊడిపడ్డాడు. ‘‘ఏటి మంగమ్మా బాగుండావా?’’ అన్నాడు. ‘‘ఏం బాగులే రంగప్పా, నీకు తెలీందేముంది?’’ అన్నాను. ఆడన్నాడు, ‘‘ఇప్పుడు బాగు సంగతెవడిక్కావాల? ఈ కాలం కుర్రోళ్ళు నీ లెక్కేట్టన్నట్టు మాట్టాడతారు. మాలాంటి వయసు మళ్ళినోళ్ళు ‘అయ్యో ఇలా జరిగిందేటి?’’ అనుకుంటామంతే. ఇంకేటి సేస్తాంలే’’ అన్నాడు. అట్టాగే నడుసుకుంటూ వచ్చాం. దార్లో తోపు, నుయ్యి ఉన్నాయి. అక్కడికొచ్చేసరికి ఆడేటి చేస్తాడోనని భయమేసింది. ఈ సంచిలో డబ్బుందిలే. అందుకే ఆడు కొంచెం సున్నవుంటే ఇస్తావా?’’ అన్నాడు. ఇచ్చాను. తీసుకుపోయాడు. ఈరోజు వస్తుంటే ఆ తావులోనే మళ్ళీ కలిశాడు. ఆమాట, ఈమాట చెప్ని, ‘‘మంగమ్మా! కాస్త డబ్బుతో పనిబడింది. అప్పిస్తావా? ఈసారి రాగులమ్మగానే తీర్చేస్తాను’’ అన్నాడు. ‘‘నా దగ్గర యాడుంది?’’ అన్నాను. ‘‘సర్లే మంగమ్మా, నాకు తెల్దా డబ్బు  ఆడా, ఈడా పూడ్చి పెడితే ఏటొస్తాది? నాకు అప్పిస్తావా, నన్ను సమయానికి  ఆదుకున్నదానివవుతావు. నీకు వడ్డీ వస్తది’’ అన్నాడు. కాసేపాగి, ‘‘నువ్వు కొడుకు కలిసున్నట్టయితే నేనడిగేవాణ్ణే కాదు. ఏదో కోడలికి నగా–నట్రా చేయించుకునేదానివి. ఇప్పుడు అట్టాటిదేవీ లేదు కదా! అందుకే అడిగా’’ అన్నాడు. చూడమ్మయ్యా, ఆడదొంటిగా ఉంటే జనం కళ్ళెట్టా పడతాయ్యో’’ అంది. మా వాళ్లను అడిగి చెబుతాను’’ అన్నాను. నేనింకా వారికి ఈ సంగతింకా చెప్పనేలేదు’’ అంది.

మర్నాడు మంగమ్మ పెరుగుపోసి, రొంటిన ఉన్న సంచీ తీసింది. ‘‘లోపలికి పదండి లెక్కెట్టుకుందురుగాని’’ అంది. ‘‘నేనింకా ఆయనకి చెప్పలేదు, ఇంకో రోజు ఇద్దువుగానిలే’’ అన్నాను. మంగమ్మ, ‘‘నాకు శానా బయంగా ఉందమ్మయ్యా. రంగప్ప ఇయాల కూడా వచ్చాడు. తోపు దగ్గర, ‘‘కూచో మంగమ్మ, తొందరేటి? ఎల్దువుగాన్లే’’ అన్నాడు. మంచి ఒయసులో ఉన్నప్పుడే కట్టుకున్నోడే పట్టుకున్న సెయ్యొదిలేశాడు. మరోడు ముట్టలేదు దాన్ని. ఇయాల ఈడట్టుకున్నాడు. ఇడిపింసుకుని, ‘ఏటి రంగప్పా, సరసం ముదిరిందే. నా అందసందం  ఊసెత్తడానికి నువ్వేమన్నా, నా కట్టుకున్న మొగుడివా? ఇడిసిసెట్టు’’ అని ఇదిలించుకుని వచ్చేసినా.ఇదేమిటి, ఈమె కథ ఏదో ప్రమాదానికి దారి తీసెటట్టుందే అనిపించింది.‘‘ఇదంతా ఎందుకొచ్చిన గొడవగాని మంగమ్మా అయిందేదో అయిందిగాని, వెళ్ళి కొడుకుదగ్గర ఉండరాదా?’’ అన్నాను. ‘‘నేనుంటానంటే ఏంలాబంలే అమ్మాయ్యా, ఆడుండ నియ్యొద్దూ’’  ‘‘కొడుకుతో చెప్పు  ఇదంతా’’ ‘‘అయ్యో నా తల్లి, రచ్చకీడ్చి వెలివేయిస్తుంది నా కోడలు. నాకు పొద్దుపోతుంది. నేనెన్ళొస్తా. అయ్యగార్నడిగి రేపు చెప్పు’’ అంటూ వెళ్ళిపోయింది మంగమ్మ.మళ్ళీ ఒంటిగంటకొచ్చింది ‘‘అమ్మయ్యా, ఇవాళొక పనయింది. పిల్లాడికుంటుందిలే అని కాస్త మిఠాయి కొని తట్టలో పెట్టుకున్నా’’ అంది. ‘‘ఏ పిల్లాడు?’’ అని అడిగాను. ‘‘మా పిల్లాడికే...నా దగ్గరికి వెళ్ళొద్దని  ఆళ్ళమ్మ సెబుతుందిగాని, ఆడుండ గలడా. ఆళ్లు సూడకుండా ఎప్పుడో వచ్చి కాసిన్ని పాలు తాగుతాడు. కూసింత పెరుగు బిళ్ళ పెట్టమంటాడు. ఏదైనా ఇస్తే గంతులేస్తాడు. ఆడి కోసమని మిఠాయి తట్టలో ఎట్టుకుంటే ఈ సంకరపురంలో వచ్చేటప్పుడు కాకి తన్నుకు పోయింది. ఇట్టా జరిగిందెందుకు?’’ అంది. ‘‘ఏమైందిలే, ఓ పొట్లం కాకెత్తుకుపోతే మరోటి కొనుక్కెళ్తే పోలా?’’ అన్నా. ‘‘కాకి మనుషుల్ని ముట్టకూడదంటారు కదా!’’ అంది. ‘‘ముట్టుకుంటే ఏమంటా?’’ అన్నాను. ‘‘పానానికి ముప్పు అంటారు. నాకు కొనకాలం వచ్చిందేమోనని బయం వేసింది ముందు. మళ్ళీ అనుకున్నా, ఇదీ మంచిదే ఎవురికీ పనికిరాని జల్మమెందుకని’’ అంది. ‘‘ఏంమాటలవి? ఏంఫరవాలేదుగాని, ఇంటికెళ్ళిరా’’ అన్నాను. ‘‘అయితే బయం లేదంటావా అమ్మాయ్యా?’’ ‘‘భయం లేదు, గియం లేదు. ఆపదలొచ్చిన కొద్దీ ఆయుస్సు ఎక్కువంటారు. ఆలోచించకుండా హాయిగా ఇంటికెళ్ళు’’మంగమ్మ వెళ్ళిపోయింది. కొడుకు కావాలి, కోడలు కావాలి, మనవడు కావాలి. కాని తన పెద్దరికాన్ని అంతా గౌరవించాలి. మనిషన్నవాడికి ఈ చాపల్యం తప్పనిది. అది లేకపోతే బ్రతుకులో ఏదో బాధ. అయినా చావడానికి ఇష్టం లేదు. మంగమ్మ ఈసారి మరొక సంగతి చెప్పింది. ఆ మనవడు అమ్మని, నాన్నని వదిలి ఈవిడ దగ్గరికే వచ్చేశాడట. ‘‘నిన్న మద్దేన్నం నా కాడికి వచ్చినోడు మళ్లీ అమ్మ దగ్గర కెళ్ళనని మొరాయించాడు. ఇన్నాళ్ళు దొంగచాటుగా వచ్చేవోడు, ఎప్పుడైతే ఇట్టా చేశాడో ఆళ్ళమ్మొచ్చి నానా గోలా చేసింది. ఉహు...ఎల్లనే లేదు. నాకాడే ఉండిపోయాడు తెలుసా తల్లి. పసిపిల్లాడైనా ఈడుతోడుగా ఉంటే ఎంత దయిర్యంగా ఉందో నాకు. ఎంతైనా మగనలుసు కదా!ఒకే ఇంట్లో ఉంటుంటే నా కోడలు ఎంత అందగత్తో నాకు తెలవనే లేదు. ఇప్పుడు దూరం నించి సూత్తానా...మొకం ముడుసుకుంటే ఏదో లాగుంటుందిగానీ, లేకపోతే మంచి అందగత్తెల్లోకే లెక్క. ఆడినీ అంతే, పొలానికెప్పుడొస్తాడో సూసేదాన్ని కాదు. ఇప్పుడు గుమ్మం కాడ కూసుని ఇంకా రాలేదేటి అనో, ఇంత తొరగా ఎల్తున్నాడేటనో సూస్తాను కదా. దానికి అంతే కదా. ఇప్పుడు కొడితే, ఆడు రేపు నాతో బాటు ఇటొచ్చేస్తే ఏటి సేస్తాది? కొడుకునిడిసి పెట్టుకుంటాదా?’’ ‘‘ఈమె ఊహలు ఎంత దూరం పోతున్నాయి కదా’’ అని ఆశ్చర్యం వేసింది నాకు. ఈలోపలే వీళ్ళ మధ్య పొరపొచ్చాలు తొలగిపోయే సూచనలు కనబడుతున్నట్టుగా తోచింది నాకు. అలాగే జరిగింది కూడా. రెండు రోజులాగి తల్లి దగ్గర కెళ్ళిన కుర్రాడు మర్నాడు నాన్నమ్మతో బెంగుళూరొస్తానని పేచీ పెట్టాడు. మంగమ్మకి ఏం చెయ్యాలో తోచలేదు.కొడుకు–కోడలు వచ్చి ‘‘ఏదో మా వల్ల తప్పయిందనుకో, నువ్వు కోపం చేసుకుంటే ఎట్టాగమ్మా?’’ అన్నారు. తన బింకం సడలకుండా మంగమ్మ ఇష్టంగానే కోడలితో కలిసిపోయింది. కాని ఈ మనవడు నానమ్మతో ఉండాలని పట్టుబట్టాడు. దాని వల్ల కొత్త ఏర్పాటే చేసుకున్నారు.

‘‘ఏటి ఎండలో పోడం, రాడం! పెద్దతనం వచ్చాక ఎన్నాళ్ళీ చాకిరీ. ఇంత ముద్ద కెలికి చారుపెట్టి ఇంట్లో ఉండు. నేనెళ్ళి పెరుగమ్ముతాను’’ అంది కోడలు. మంగమ్మ ఒప్పుకుంది. ఓరోజు అత్తాకోడళ్ళిద్దరూ వచ్చారు. ఒకరి చంకలో పిల్లాడు, మరొకరి నెత్తి మీద పెరుగుతట్ట.‘‘ఇదిగో నమ్మయ్యా నా కోడలు. పాపం ముసల్ది, తనే ఉడుకేసుకొని అవస్థ పడుతుందని, మళ్ళీ నన్నింట్లో చేర్చుకుంది. ఉట్టినే ఎండలో పడి తిరగద్దని అంది. ఇక నుంచదే తెస్తుంది పెరుగు. పోయించు కోండమ్మయ్యా’’ అని చెప్పి కోడలికి మా ఇల్లు అప్పజెప్పింది. ఈమధ్య ఆ కోడలే పెరుగుపోస్తోంది.అత్త వేపు నుంచి మాటలు జరిగాయి కదా, ఇక కోడలేమంటుందో విందామనిపించి ఓ రోజు.‘‘సంజమ్మా...అత్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టచ్చా?’’ అని అడిగాను. దానికి సంజమ్మ అందికదా– ‘‘అత్తనెల్లగొట్టడానికి నేనేటి రాచ్చసినా అమ్మగారూ, అత్త అన్న మనిషి అన్నింటికీ నేనే పెద్దనంటూ తయారైతే, ఇక ఆడు మొగుడేటీ, నేను పెళ్ళానేటి, మేం సంసారం చేసేదేటి? నా మొగుణ్ణి కావాలంటే తనకి సొంతం అని అట్టే పెట్టుకోనీ. కాని నా కొడుకుని నేనుకొట్టకూడదని రూలు పెడితే ఇదెక్కడి కోడంట్రికం అమ్మగారు?’’ అంది.‘కొడితేనే కొడుకు నీ సొంతమని లెక్కా?’’ అని అడిగాను.‘‘నా కొడుకంటే, నా కొడుకే. నా మొగుడంటే నా మొగుడే. కోడలంటూ వచ్చాక, అత్త ఒక మాటంటే అనచ్చు. ఇది లేకుండా ఎవరి సంసారం మాత్రముంటుంది?’’ నాకు మంగమ్మ చెప్పినప్పుడు తను చెప్పింది ‘సరి’ అనిపించినట్టుగానే, కోడలు చెబుతుంటే కోడలిదీ సరిగ్గాఉన్నట్టుగానే అనిపించింది. ‘‘అయితే ఇప్పుడు నీకు ఇంట్లో కొంత స్వతంత్రం వచ్చినట్టేనా?’’ అనడిగాను. ‘‘ఇప్పుడు మొదటి కన్నా నయం తల్లీ. ఎట్టాగో సద్దుకుపోవాలి. గొడవ పడితే మాకే నష్టం. మాఅత్త డబ్బు  మీద కన్నేసి ఉన్నారెంతోమంది. కాజేసినా చెయ్యొచ్చు. రంగప్ప అని ఒకడున్నాడు. ఆడు మా అత్త వేరు కాపురం పెట్టినప్పుడు అప్పడిగాడట. ఈమె  ఇస్తానందట. ఆడొచ్చి ఆ మాట చెప్నాడు. మా కుర్రాణ్ణి పిలిచి, ‘‘ఒరేయ్‌ నానమ్మ దగ్గరకెళ్ళి అడుగు, మిఠాయి పెడుతుంది. మళ్లీ పిల్చేదాకా రామాకు’’ అని కట్టడి చేశా. గొడవలెలాగైనా సర్దుకుంటే చాలని అట్టా చేశానమ్మా. కాని అమ్మగారూ, ఇయ్యన్నీ పైకి చెప్పుకోగలమా? మగవాళ్ల  కివన్నీ ఏం తెలుస్తాయి?’’ అంది. మంగమ్మ కంటే సంజమ్మ తెలివితేటల్లో తక్కువదేం కాదు. అతడిని తన పట్టు నుంచి వదులుకోకూడదని తల్లి మనోవాంఛ, అతడిని గుప్పిట బంధించాలని ఈ కోడలి పట్టుదల. ఇదీ ప్రతిచోట జరిగే భాగోతమే. ఇందులో గెలుపు–ఓటమి, ఈవిధంగా ఉంటాయని చెప్పడానికి లేదు. పల్లెలో అయితే పెరుగు మంగమ్మ ఇంట్లో, పట్నంలో అయితే పెరుగుకొనే తంగమ్మ ఇంట్లో ఈ నాటకం జరుగుతూనే ఉంటుంది. ఆఖరి అంకం ఊహించలేని నాటకం.
కన్నడ మూలం : డా.మాస్తి వెంకటేశ అయ్యంగార్
-  అనువాదం: శర్వాణి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement