నేడు చాలామంది యువత చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి సొంతంగా వ్యాపారాలను ప్రారరంభిస్తున్నారు. అనుకున్న రంగంలో విజయం సాధించాలని కలలు కంటున్నారు. అయితే తమ కలల లక్ష్య సాధనలో అడుగులువేయడం కోసం ఏదైనా ఒక స్ఫూర్తి ఉండాలి కదా...పుణేలో ఉంటున్న 33 ఏళ్ల అక్షాలీషా సాధిస్తున్న విజయం నవతరానికి స్ఫూర్తి దాయకం. ఎంబీయే చేసి, పద్నాలుగేళ్ల క్రితం తండ్రి ప్రారంభించిన చిన్న డెయిరీ యూనిట్‌లో ట్రైనీగా చేరింది అక్షాలీ షా.
మిల్క్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తూ నేడు కంపెనీ రూ.2,556 కోట్ల మార్కెట్‌ని సాధించేంతగా కృషి చేసింది.బిజినెస్‌లో రాణించాలనుకునేవారికి పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె చేసిన ప్రయాణం ఓ పాఠం అవుతుంది.
‘‘నేను ఎంబీయేలో చేరేనాటికి మా నాన్న దేవేంద్ర షా పుణే సమీపంలోని మంచార్‌లో ఒక చిన్న డెయిరీ యూనిట్‌ను ప్రారంభించాడు. ఎంబీయే పూర్తవుతూనే ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకున్నప్పుడు మా నాన్న తన యూనిట్‌లోనే జాబ్‌లో చేరి, వ్యాపారాన్ని డెవలప్ చేయమన్నాడు. దానిని సవాల్‌గా తీసుకున్నాను.
పరాగ్ పేరుతో రకరకాల పాల ఉత్పత్తులను తయారుచేయడం మొదలుపెట్టాను. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన అధ్యయనంతో మొదలుపెట్టాను. ఏ బిజినెస్ అయినా అంచెలంచెలుగా ఎదగాలంటే ముందు మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి. నాణ్యతపైన దృష్టి పెట్టాలి.
పుణే ప్రాంతంలో సహకార సంఘాల వాళ్లు మిల్క్ లీవ్ ప్రకటించినప్పుడు మా నాన్న రైతుల నుండి పాలను సేకరించి, మిల్క్ ఫుడ్స్ తయారీకి పునాది వేశారు. అక్కణ్ణుంచి కంపెనీ పాడి పరిశ్రమంలో ఇదొక విప్లవాత్మకమైన ప్రయాణానికి నాంది పలికినట్లయింది. ఆ విధంగా నాన్న ఆలోచనలనూ అందుకుంటూ నా ప్రయత్నాలు మొదలుపెట్టాను.
శ్రేష్టమైన ఉత్పత్తులు..
చాలారకాల ఆహారపదార్థాల నుంచి ప్రొటీన్స్ లభిస్తాయన్నది తెలిసిందే. పాలలో ప్రొటీన్ మోతాదు ఎక్కువ. అందుకే వినియోగదారుల అవసరాల మేరకు ప్రొటీన్ మిల్క్ ప్రొడక్ట్‌లను తయారుచేసి విక్రయిస్తున్నాం. ‘పరాగ్’ అని ప్రారంభించిన మా సంస్థ నుంచి నెయ్యి, చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు.. ఈ అన్ని ఉత్పత్తుల్లో మంచి అమ్మకాలు సాధిస్తుంది. ఇప్పుడు చీజ్ తయారీ, అమ్మకంలో దేశంలోనే మా సంస్థ రెండవదిగా నిలిచింది. ఫార్మ్ టు హోమ్ బిజినెస్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ బ్రాండ్, పానీయాల వృద్ధి, ఉత్పత్తిలో నా మార్క్‌ను చూపించగలిగాను.
గడపగడపకూ..
ఆవుపాల శ్రేష్టత గురించి తెలిసిందే. అందుకే, మన దేశంలో వీటి వాడకమూ ఎక్కువే ఉంటుంది. ఖరీదు ఎక్కువైనా శేష్ట్రమైన ఆవుపాల గురించి చాలా మంది అన్వేషిస్తారు. మొదట్లో ఆవుపాలు పితికి, అవి అవసరం ఉన్న కొద్దిమంది ఖాతాదారులకే అందించేవాళ్లం. ఆ తర్వాత ఆవు పాల గురించి దేశీయంగా ఉన్న మార్కెటింగ్ వైపు దృష్టి పెట్టాను. శ్రేష్టమైన ఆవుపాల కోసం కోట్లమంది ఖాతాదారులు ప్రయత్నిస్తున్నారని అర్థంచేసుకున్నాను.
దీంతో ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆవుపాలను కోరుకున్న ఖాతాదారుల గడప దగ్గరకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించాం. ఢిల్లీ, ముంబై, పుణే, సూరత్‌లలో ఆవుపాలు విశేషంగా అమ్ముడుపోతున్నాయి. వ్యాపావేత్తగా ఎన్నో అవార్డులను పొందుతూనే ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ మార్కెట్ పై ఒక అంచనాతో అడుగులు వేస్తున్నాం’’ అని వివరిస్తుంది అక్షాలీ.
Comments
Please login to add a commentAdd a comment