ఆవు రక్తం తాగే ఆచారం వారిది
ఆవు రక్తం తాగే ఆచారం వారిది
Published Thu, Mar 30 2017 4:36 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
ఆడిస్ అబాబా: ఇథియోపియాలోని బోడి తెగకు చెందిన ఆదివాసీల్లో ఓ విచిత్ర ఆచారం ఇప్పటీకి అమల్లో ఉంది. వారు కొత్త సంవత్సరంగా పిలిచే 'కాయెల్' వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పెళ్లికాని యువకులకు ఓ పోటీని నిర్వహిస్తారు. ఆ యువకులు ఆరు నెలలపాటు ప్రతి రోజు సూర్యోదయం నుంచి లీటర్ల కొద్ది ఆవు పాలు, ఆవు రక్తం తాగుతూ బరువు పెంచుకోవాలి. ఒక ఆరు నెలలపాటు ఇలా చేసిన తర్వాత వారి తెగలో ఎవరు ఎక్కువ బరువు పెరుగుతారో, ఎవరి నడుము చుట్టు కొలత ఎక్కువగా ఉంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు.
ప్రతి ఏటా ఒక్క పెళ్లి కాని యువకుడిగా ఎంపిక చేస్తారు. ఆ విజేతకు ఎలాంటి బహుమతులు ఇవ్వరు. వారిని తెగవారంతా ఎంతో మర్యాదగా గౌరవిస్తారు. ఆరాధ్య భావంతో చూస్తారు. ఆ యువకుడితో లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు మహిళలు తహతహలాడుతారు. జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని ఆరు నెలల ముందుగా ఈ విచిత్ర పోటీని మొదలు పెడతారు. ఈ పోటీకి ప్రతి ఇంటి నుంచి ఓ పెళ్లికాని యువకుడిని పంపించవచ్చు. పోటీలో పాల్గొనే ప్రతి యువకుడు ఆరు నెలలపాటు సెక్స్‌కు దూరంగా ఉండాలి. గుడిసె పరిసరాలను వదిలి బయటకు వెళ్లడానికి వీల్లేదు. ఆవు పాలు, రక్తం తాగడమే పనిగా పెట్టుకోవాలి.
కొందరు పచ్చిపాలు, రక్తం మోతాదుకు మించి తాగలేక వాంతులు చేసుకుంటారు. అర్ధంతరంగా పోటీల నుంచి కూడా నిష్క్రమిస్తారు. పోటీలో కొనసాగిన వారికి ఆరు నెలలపాటు కావాల్సిన పచ్చి ఆవు పాలను పెద్ద పాత్రల్లో సొంతింటి వాళ్లు, పక్కింటివాళ్లు తెచ్చి పోస్తారు. పోటీలో పాల్గొనే యువకులు ఆవు పచ్చి రక్తాన్ని తాగుతారు తప్ప వాటిని చంపరు. ఎంతో గౌరవంగా ఆవులను చూస్తారు. తాగే రక్తం కోసం మాత్రం వాటి నరాలకు రంధ్రంచేసి రక్తం పడతారు. తర్వాత బంక మన్నుతో ఆ రంధ్రాన్ని పూడ్చేస్తారు. బోడి తెగలో యుగ యుగాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం మరెంతో కాలం మనుగడలో ఉండకపోవచ్చని సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇథియోపిలో నివసిస్తున్న ఈ తెగకు చెందిన దాదాపు మూడు లక్షల మందికి పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయించింది.
Advertisement
Advertisement