Best Foods Increase Breast Milk Production: పిల్లలకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుందని పెద్దలు, పరిశోధకులు ఎప్పటినుంచో చెబుతున్న విషయమే. అయితే కొందరు తల్లులకు పాలు పడవు. అలాంటివారు కొన్ని సూచనలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గర్భిణులకు బొప్పాయి ఇవ్వకూడదని అందరికీ తెలుసు. అదే బొప్పాయి బాలింతలకు కల్పతరువులా పనిచేస్తుంది. దోరగా ఉన్న బొప్పాయికాయను కొబ్బరి కోరులా చేసి కూర వండుకుని తింటే స్తన్యవృద్ధి కలుగుతుంది.
పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి!
►ఆవుపాలు, కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, మునగాకు కూరలు చాలా మేలు చేస్తాయి.
►పట్టణ ప్రాంతాలలోని వారికి పిల్లిపెసర దొరకపోవచ్చు. కాని దాని వేళ్ళను దంచిన రసం తీయాలి. దీనిని ఎండించి దంచిన చూర్ణం రోజూ తేనెలో తీసుకుంటే పాలు పెరుగుతాయి. ఆయుర్వేద దుకాణాల్లో శతావరి పేరిట చూర్ణం దొరుకుతుంది. ఇది కూడా బాగానే పని చేస్తుంది.
►రెండు గ్లాసుల నీళ్ళలో రెండు టీస్పూన్ల పత్తిగింజల పొడి పోసి నీళ్ళు అరగ్లాసు అయ్యేంతవరకు మరిగించాలి. చల్లారిన తర్వాత దీనిని వడగట్టి తేనె కలుపుకుని తాగితే పాలవెల్లువ కల్గుతుంది.
►తామర కాడను ఎండించిన చెంచాడు చూర్ణాన్ని తేనెతో కలిపి రోజుకు మూడుసార్లు తింటే పాలు పెరుగుతాయి.
►ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వెచ్చ చేసి రొమ్ములకు కడితే పాలచేపు వస్తుంది.
►బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి.
►శనగలను మొలకలొచ్చేదాకా నాన బెట్టాలి. ఎండించి, పొట్టు తీసి, దోరగా వేయించి, కట్టులా కాచుకుని తాగితే బలాన్నిచ్చి మంచి ఔషధంగా పనిచేస్తాయి. మంచి రక్తాన్ని పుట్టిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పెరుగుతాయి.
►బాలింతలకు జలుబు చేస్తుందని మంచినీళ్లు ఎక్కువ తాగనివ్వరు పెద్దలు. అలా కాకుండా తగినన్ని మంచి నీళ్లు తాగుతుండాలి. కాకపోతే చల్లటి నీళ్లు కాకుండా గోరు వెచ్చటి నీళ్లు తాగడం మంచిది.
►మజ్జిగ, పెరుగు, పాలు పుష్కలంగా తీసుకోవాలి.
►ఇవన్నీ అంతో ఇంతో పాలు పడే తల్లులకు పని చేస్తాయి. అయితే కొందరు తల్లులకు కొన్ని కారణాల వల్ల పాలు అసలు పడవు. అటువంటప్పుడు ప్రయోజనం ఏముందని పిల్లలను రొమ్ముకు దూరం పెడతారు తల్లులు. అలా చేయకూడదు. పిల్లలు రొమ్మును చప్పరించడం వల్ల తల్లిలో మాతృత్వ భావన ఉప్పొంగి హార్మోన్ల ప్రేరణతో పాలు స్రవించేందుకు అవకాశం ఉంటుందని పెద్దలతోబాటు వైద్యులు కూడా చెబుతున్నారు.
చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల...
Comments
Please login to add a commentAdd a comment