తాగునీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఈ కాలంలో అక్కడ ఉచితంగా పాలు పోస్తున్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వస్తే తీసుకోరు. పాలు అమ్మరు. గర్భిణులు, బాలింతలున్న ఇళ్లకు వారే అడిగి మరీ పంపిస్తారు. ఇలా చేసేది ఒకరో ఇద్దరో కాదు. ఆ ఊరంతా ఇదే సంప్రదాయం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పిన్నాపురం గ్రామం ప్రత్యేకత ఇదీ..
కర్నూలు: నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని పిన్నాపురం ఓ మారుమూల గ్రామం. 421 ఇళ్లు 1800 జనాభా కలిగిన ఈ ఊరిలో 344 బర్రెలు, 815 ఆవులు, 2444 మేకలు ఉన్నాయి. ఇక్కడ తాతల కాలం నుంచి పశు పోషణ సంప్రదాయంగా వస్తోంది. గ్రామ జనాభాలో దాదాపు 80 శాతం మంది పాడిపెంపకందారులే. సమీపంలోని కొండ ప్రాంతాల్లో వాటిని పెంచుకుంటూ తమకున్న కొద్దిపాటి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో ఎవ్వరూ పాలు విక్రయించరు. పశుపోషకులు తమ కుటుంబ అవసరాలకు పోనూ మిగిలిన వాటిని గ్రామస్తులకు ఉచితంగా ఇస్తారు.
ముఖ్యంగా గర్భి ణులు, బాలింతలు ఉన్న ఇళ్లకు వారే స్వయంగా పాలు పంపిస్తుంటారు. ఎవరైనా వారి ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే సమీపంలోని పట్టణం నుంచి పాల ప్యాకెట్లు కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. ఇక్కడి గ్రామ ప్రజలు పొద్దున్నే గ్లాసుడు కాఫీ లేదా టీ తాగడంతో దిన చర్య మొదలు పెడతారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ వాడుతారు. ఇందుకు అవసరమైన పాలు గ్రామంలోనే ఉచితంగా లభిస్తుండటం విశేషం. అవసరాల్లో ఒకరికొకరు సహాయపడాలన్నదే ఈ సంప్రదాయం ప్రధాన ఉద్దేశమని గ్రామస్తులు తెలిపారు.
ఉచితంగా పాలు పోస్తే మంచిదని..
మా గ్రామంలో పాలు ఉచితంగా పోసే ఆచారం మా తాతల కాలం నుంచి ఉంది. అలా మా పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. చాలా కుటుంబాల్లో ఇంటి అవసరాలకు మించే పాలు ఉంటాయి. గ్రామంలో పాడిలేని వారు ఎవరైనా ఉన్నారని తెలిస్తే వారు అడగకుండానే పాలు పంపిస్తాం. దీని వల్ల మాకు మంచి జరుగుతుందని నమ్మకం. –మిద్దె నాగమ్మ, పిన్నాపురం
పెద్దల నుంచి వస్తున్న ఆచారం
మా పెద్దలు మాకు పాలను ఉచితంగా ఇచ్చే పద్ధతిని నేర్పారు. అందుకే పాడి ఉన్నంత వరకు పాలు, మజ్జిగ చుట్టు పక్కల వారి అవసరాలకు ఉచితంగానే పోస్తుంటాం. నెయ్యి మాత్రం పాణ్యం వెళ్లి అమ్ముకుంటాం. అది కూడా పండగ వచ్చే ముందు ఏడాదికి ఒకసారి మాత్రమే.
–గని ఈశ్వరమ్మ, పిన్నాపురం
ఒకరికొకరం సహాయపడతాం
మాకు రెండు బర్రెలు ఉన్నాయి. ఇప్పటికీ చుట్టుపక్కల వారికి అడిగి పాలు పోస్తాం. అదే బాలింతలు, గర్భిణులుంటే వారి ఇళ్లకు వెళ్లి ఇస్తాం. ఎందుకంటే వారికి పాల అవసరం ఎక్కువగా ఉంటుంది. మాకు అవసరమైనప్పుడు కూడా గ్రామంలోని వారు ఇలాగే పంపిస్తారు.
– మీదివేముల రామకృష్ణ, పిన్నాపురం
Comments
Please login to add a commentAdd a comment