ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి అందరూ యత్నిస్తుంటారు. ప్రస్తుత కాలుష్యాలూ, జీవనశైలితో చేజేతులారా దాన్ని దెబ్బతీసుకునే పరిస్థితి. అయితే రోగనిరోధక శక్తి అనే మనలో అంతర్గతంగా ఉండే అస్త్రశస్త్రాలను పటిష్టం చేసుకుంటే ఆరోగ్యం గురించి దాదాపుగా నిశ్చితంగా ఉండవచ్చు. మరి దాన్ని చాలా తేలిగ్గా, చవగ్గా సాధించడం ఎలా? ఆవు ముర్రుపాలతో స్వాభావికమైన వ్యాధి నిరోధక శక్తిని ఎలా పొందాలో తెలుసుకోండి.
ఒక అంచనా ప్రకారం... మానవ ముర్రుపాల కంటే, ఆవు ముర్రుపాలలో వ్యాధులను ఎదుర్కొనే శక్తి, వ్యాధులను తగ్గించే శక్తి దాదాపు 1000 రెట్లు ఎక్కువ. అంతటి వ్యాధినిరోధక శక్తిని సమకూర్చుకోవడం చాలా తేలిక. ఆవు ముర్రుపాలు తీసుకుంటే చాలు. దూడపుట్టాక దాదాపు కొన్ని వారాల పాటు స్రవించే ముర్రుపాలు (బొవైన్ కొలెస్ట్రమ్)ను ‘ఇమ్యూనో’స్ అంటారు. ఇందులో చాలా వ్యాధులను ఎదుర్కోగల శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. ఇంగ్లిష్‌లో కొలెస్ట్రమ్ అని పిలిచే ఈ ముర్రుపాలు కాస్త పసుపుపచ్చరంగులో ఉంటాయి. బీటా–కెరొటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా ముర్రుపాలకు ఈ రంగు వస్తుంది.ఈ యాంటీ ఆక్సిడెంట్‌లో వ్యాధినిరోధక శక్తిని సమకూర్చే ‘ఇమ్యూనోగ్లోబ్యులిన్’ పుష్కలంగా ఉంటాయి.
ఇందులో ప్రధానమైనది ‘సెక్రటరీ ఐజీఏ‘. దీన్నే ‘సిగా’ అంటారు. తల్లికడుపులో తల్లికి ఉండే రోగ నిరోధక శక్తే బిడ్డనూ సంరక్షిస్తుంది. పుట్టగానే ఈ ‘సిగా’ అదే రోగనిరోధక శక్తిని బిడ్డలో కొనసాగేలా, బిడ్డ తన సొంత రోగనిరోధక శక్తిని సమకూర్చుకునేలా చేస్తుంది. ఈ ‘సిగా’ ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా? ఇది బిడ్డ కడుపులో ఆహారం పీల్చుకునే కడుపు– పేగుల్లో ఒక లైనింగ్‌లాగా ఏర్పడుతుంది. ఈ ‘లైనింగ్’ వ్యాధులను వ్యాపింపజేసే వైరస్‌లనూ, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను ఒక అడ్డుగోడలా ఆపేస్తుంది. అలా రోగనిరోధక శక్తిని బిడ్డకు ఇస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలు లేదా నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించే ‘నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్’ అనే పేగులకు సంబంధించిన రుగ్మతనుంచి ఈ ‘ఇమ్యూనో’ కాపాడుతుంద
రోగనిరోధక సాధనంగా ముర్రుపాలు... దాని చరిత్ర...
అసలు ముర్రుపాలను ఒక రోగనిరోధక సాధనంగా వాడవచ్చని ఎలా, ఎప్పుడు తెలుసుకున్నారో చూద్దాం. పోలియో (పోలియోమైలైటిస్) వ్యాధికి 1950లో వ్యాక్సిన్ కనిపెట్టిన ఆల్బర్ట్ శాటిన్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ ‘‘చిన్నపిల్లలకు ముర్రుపాలు తాపిస్తే ఆ కొలెస్ట్రమ్ కూడా వ్యాక్సిన్‌లాగే పోలియో నుంచి రక్షణ కలిగిస్తుంది’’ అని మొదటిసారి చెప్పారు.
ఇక 1955లో దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్‌ఏ) చికిత్సకు సిఫార్సు చేశారు. దీన్ని ఒక వ్యాధినిరోధక ఔషధంగా ఉపయోగించవచ్చునంటూ... చికిత్సలో దీన్ని ఉపయోగం కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను 1963లో కాంప్‌బెల్, పీటర్‌సన్ అనే వారు రూపొందించారు. ఇక 1992లో కుంబర్ అనే పరిశోధకుడు పిల్లల్లో పొట్ట / పేగులకు సంబంధించినే అనేక సమస్యలను ఇది నివారించగలదంటూ అధ్యయనాలతో నిరూపించి చూపారు.
ఆవు ముర్రుపాలతో కొన్ని ఉపయోగాలివి...
బొవైన్ కొలెస్ట్రమ్ అని పిలిచే ఆవు ముర్రుపాలతో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. వాటిలో కొన్ని ఇవి... ∙అప్పుడే పుట్టిన పిల్లల నుంచి నెలల వయసులో ఉన్న చిన్నారులు, చిన్న పిల్లల్లో తరచూ కనిపించే నీళ్ల విరేచనాలను అరికడుతుంది ∙హెచ్‌ఐవీ రోగులు, ఎముక మూలుగ మార్పిడి చికిత్స తీసుకున్న వారితో పాటు వ్యాధి నిరోధక శక్తి లేని అనేకమందికి వ్యాధి నిరోధక శక్తిని కల్పిస్తుంది.
∙జంపింగ్, సైక్లింగ్, పరుగు వంటి క్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్‌కు అవసరమైన శక్తి కలిగిస్తాయి. క్రీడాకారుల సామర్థ్యాన్ని పెంచుతుంది ∙శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిముల నుంచి (ఉదాహరణకు జలుబుకు కారణమయ్యే ఇన్‌ఫ్లుయెంజా) రక్షణ కల్పించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ∙నాడీవ్యవస్థలో కలిగే లోపాలను నివారిస్తుంది ∙కాలిన గాయాలను త్వరగా మాన్పుతుంది ∙మూడ్స్ బాగుండేలా తోడ్పడుతుంది ∙కొందరికి ప్రయోణాల్లో వచ్చే నీళ్లవిరేచనాలు (ట్రావెల్ డయేరియా)తో పాటు ఏవైనా నొప్పినివారణ మందులు (ఎన్‌ఎస్‌ఏఐడీస్) వాడినప్పుడు పేగుల లైనింగ్ దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది.
ఇలాంటి చిన్న చిన్న అంశాల్లోగానే గాక కాస్త సీరియస్ వ్యాధులుగా పరిగణించే ఆస్టియో ఆర్థరైటిస్, స్పాండిలార్ ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ) వంటి జబ్బుల తీవ్రతను తగ్గించడమే గాక, రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను కొలెస్ట్రమ్ సమర్థంగా తగ్గిస్తుందనీ, ఒంట్లోని హానికారక కీటోన్ బాడీస్‌ను హరిస్తుందని తేలినందువల్ల దీన్ని టైప్–2 డయాబెటిస్‌కూ ఔషధంగా వాడవచ్చని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఆవు ముర్రుపాల (బొవైన్ కొలెస్ట్రమ్) నుంచి అనేక రకాల ఔషధాలను రూపొందించవచ్చని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment