గోవుల చట్టం కోసం 8 ఏళ్ల ఉద్యమం | Vote On Dehorning Cows In Switzerland | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 24 2018 3:30 PM | Last Updated on Sat, Nov 24 2018 3:51 PM

Vote On Dehorning Cows In Switzerland - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆవులను ప్రేమించడంలో, గౌరవించడంలో బహూశ భారత్‌ తర్వాత ప్రపంచంలో రెండో దేశం స్విడ్జర్లాండే కావచ్చు. వారి జాతీయ చిహ్నం కూడా ఆవులే. ఆవుల విషయంలో అక్కడి రైతులకు ఓ ఆటవిక ఆనవాయితీ ఉంది. వారు ఓ దశలో ఆవుల కొమ్ములను నాటు పద్ధతిలో కత్తిరించి వేస్తారు. స్విడ్జర్లాండ్‌ మొత్తం మీద 80 శాతం ఆవులకు కొమ్ములుండవు. ఈ అనాచారం ఎందుకొచ్చిందో వారికి కూడా తెలియదుగానీ, కొమ్ములుండడం వల్ల గోశాలలకు స్థలం ఎక్కువ అవసరం పడుతుందని, కొమ్ముల వల్ల ఆవులు కోపతాపాలకు గురవుతాయని, పరస్పరం పొడుచుకుంటాయని, అప్పుడప్పుడు వాటిని సాదుతున్న రైతులనే పొడిచే ప్రమాదం ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు. 

ఆవుల కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే ఆర్మిన్‌ కపాల్‌ అనే రైతు ఈ అనాచారానికి వ్యతిరేకంగా చట్టం తీసుకరావడానికి పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. విజయం సాధించారు. ఫలితంగా ఆయన ప్రతిపాదించిన చట్టంపై రేపు (ఆదివారం) స్విడ్జర్లాండ్‌ ప్రభుత్వం ‘రిఫరెండమ్‌ (ప్రజాభిప్రాయ సేకరణ)’ నిర్వహిస్తోంది. రిఫరెండానికి అనుకూలంగా మెజారిటీ ప్రజలు ఓటేస్తే చట్టం ఖాయమవుతుంది. స్విడ్జర్లాండ్‌ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం అవడం వల్ల ఏ అంశంపైనైనా, ఏ పౌరుడైన చట్టాన్ని ప్రతిపాదించవచ్చు. అయితే అందుకు కనీసం లక్ష మంది ప్రజల సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. మన రైతు ఆర్మిన్‌ కపాల్‌ లక్షా ఇరవై వేల మంది సంతకాలు సేకరించారు. 



అయితే ఆర్మిన్‌ ప్రతిపాదించిన చట్టంలో ఆవుల కొమ్ముల కత్తిరింపుపై నిషేధం కోరలేదు. ఆవుల కొమ్ములను కత్తిరించని రైతులకు, రాయితీగా రోజుకు ఒక్కో ఆవుకు ఒక్క స్విస్‌ ఫ్రాంక్‌ అంటే, దాదాపు 70 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలంటూ చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం కోసం ఆర్మిన్‌ దాదాపు ఎనిమిదేళ్లుగా పౌరుల సంతకాల కోసం కృషి చేస్తున్నారు. చట్టం కోసం చేసే ప్రతిపాదనపై స్విస్‌ పౌరులు గుడ్డిగా సంతకం చేయరు. ప్రతిపాదనతో పూర్తిగా ఏకీభవించినప్పుడే వారు సంతకాలు చేస్తారు. అందుకే లక్షా ఇరవై వేల సంతకాలు సేకరించేందుకు ఆయనకు అంతకాలం పట్టింది. ఆజానుభావుడిలా కనిపించే ఆర్మిన్‌కు ఇప్పుడు 67 ఏళ్లు. బవురు గడ్డంతో కనిపించే ఆర్మిన్‌ రకరకాల దుస్తులు, పలు రకాల టోపీలతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు.

‘మేము ఆవులను ప్రేమిస్తాం, వాటిని తింటాం’
‘ఆవు కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే మీరు, ఆవు మాంసాన్ని ఎలా తింటారు? అది క్రూరత్వం కాదా?’ అని జర్మనీ జర్నలిస్ట్‌ పీటర్‌ జాగ్గి (ఆమె భారత దేశంలో ఆవులను పవిత్రంగా చూడడంపై జర్మనీలో ఇటీవల ఓ పుస్తకం రాశారు) ప్రశ్నించగా ‘మేము ఆవులను ప్రేమించేమాట నిజమే. వాటి మాంసాన్ని ఇష్టంగా తినే మాట కూడా నిజమే. కొన్ని ఆవులను కబేళాలకు పంపించకపోతే నేడు స్విడ్జర్లాండ్‌లో మనుషులకన్నా ఆవులే ఎక్కువగా ఉండేవి. ఆవుల సంరక్షణను మనుషులమైన మనం బాగా చూసుకుంటాం కనుక, అవి ఆహారంగా మారి మన రుణం తీర్చుకుంటాయి. ఆవులను గౌరవించడం వల్లనే మా దేశస్థులు విమానాశ్రయాల్లో అతిథులను రికార్డు చేసిన ఆవు శబ్దాలతో ఆహ్వానిస్తారు’ అని ఆర్మిన్‌ అన్నారు. ఆయన మాటల్లో నిజాయతీ ఉందని, భారత దేశంలో గోమాంసాన్ని నిషేధించడంలో నిజాయితీ లేదని ఆమె ఈ సందర్భంగా ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. 

ప్రపంచమంతా నేరం చేస్తోంది!
‘నా దష్టిలో ఆవులను అవసాన దశలో కబేళాలకు పంపించడం నేరం కాదు. ఆ దశలో అవి బతికి ఉండడం వల్ల ఎక్కువ బాధను అనుభవించాల్సి ఉంటుంది. గోమాంసాన్ని తినడాన్ని నేరంగా పరిగణించేవారు ఆవు పాలను తాగడం కూడా నేరమే అన్న విషయాన్ని గ్రహించాలి! ప్రకృతి సిద్ధంగా ఆవు పాలనిచ్చేది వాటి సంతానం కోసం. మనుషుల కోసం కాదు. ఈ లెక్కన ప్రపంచమంతా నేరం చేస్తోంది’ అని అమె ‘హోలి కౌవ్స్‌ ఇండియా (జర్మనీలో)’ పుస్తకంలో వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement