బ్రిటన్‌లో ఈ తరం విద్యార్థులంతా ఇప్పుడు వెటర్నరీ కోర్సులవైపు పరుగులు తీస్తున్నారు. దీంతో దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులకు భలే గిరాకీ పెరిగిందట. అందుకు కారణం దేశంలోని అన్ని ఉద్యోగాలకన్నా వెటర్నరీ డాక్టర్లకు ఎక్కువ వేతనాలు ఆఫర్ చేయడమే! వెటర్నరీ కోర్సుల ట్రెయినింగ్ ఐదారేళ్లు. ఇతర కోర్సులు అన్నింటికన్నా ఎక్కువ పీరియడ్. అయినప్పటికీ విద్యార్థులు ఈ కోర్సుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వెటర్నరీ డాక్టర్లు ఉద్యోగంలో చేరిన సంవత్సరమే ఏడాదికి 31,636 పౌండ్లు (27,42,145 రూపాయలు) ఇస్తున్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో 31,362 పౌండ్లతో (27,16,116 రూపాయలు) ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, మూడవ స్థానంలో 30, 593 పౌండ్లతో (26.52,445 రూపాయలు) డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్లు ఉన్నారని ‘ఇండీడ్’ అనే ఉద్యోగాల అన్వేషణ సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు డిగ్రీలు చదవిన వారంతా తమ అభిరుచుల మేరకు చదువుతారని, ఇక నుంచి వత్తిపరమైన కోర్సులు చేసే వారంతా కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ వేతనాలవైపు మొగ్గు చూపుతారని ఉద్యోగాల వెబ్‌సైట్ మేనేజింగ్ డైరెక్టర్ బిల్ రిచర్డ్స్ తెలిపారు.
కొన్ని ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్‌తో సంబంధం లేకుండానే ఇంతకన్నా ఎక్కువ వేతనాలు ఉంటాయని, అవి పూర్తిగా అనుభవం మీద ఆధారపడి ఉంటాయని ఆయన చెప్పారు. ఇక బ్రిటన్‌లోని ఉద్యోగాల్లో నాలుగో స్థానంలో సీనియర్ స్ట్రక్చరల్ ఇంజనీర్, ఆ తర్వాతి స్థానాల్లో ఆక్చ్వరి, పైథాన్ (లాంగ్వేజ్) డెవలపర్, రిక్రూటింగ్ కోఆర్డినేటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీప్లస్‌ప్లస్ డెవలపర్, పదవ స్థానంలో సేఫ్టీ కన్సల్టెంట్ ఉద్యోగాలు (ఏడాదికి 24 లక్షల 60 వేల రూపాయలు) అందుబాటులో ఉన్నాయని ‘ఇండీడ్’ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment