ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘‘ఈ సీజన్‌లో గొర్రెలు, మేకలకు ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. కీలకమైన ఈ సమయంలో సమైక్యాంధ్ర సాధన కోసం పశువైద్యుల నుంచి పారా మెడికల్ సిబ్బంది వరకు సమ్మెబాట పట్టారు. సమ్మెకు దిగిన కాలంలో రాష్ట్రంలో లక్ష గొర్రెలు మరణించాయి. ఒక్క సీమాంధ్రలోనే 75 శాతం మృత్యువాతకు గురయ్యాయి. గొర్రెలు మరణిస్తుండటంతో వాటిపై ఆధారపడిన పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పశువైద్యులను సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని’ ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జమలయ్య డిమాండ్ చేశారు.
శుక్రవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సీజన్‌లో గొర్రెలు, మేకలకు గాలికుంటు, ఆంత్రాక్స్, నీలినాలుక, గిట్టపుండు వ్యాధులు వస్తాయన్నారు. నీలినాలుక, గిట్టపుండు వ్యాధులకు వ్యాక్సిన్ లేదన్నారు. గాలికుంటు వ్యాధికి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ పై రెండు వ్యాధులను నియంత్రించలేరన్నారు. గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతుండటంతో వాటిపై ఆధారపడిన పెంపకందారులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశువైద్యులు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరారు. నియోజకవర్గానికి ఒక మొబైల్ వ్యాన్ ఏర్పాటుచేసి పశువైద్యం అందించాలని సూచించారు.
ప్రైవేట్ మందులకు రూ. 400 కోట్లు ఖర్చు
గొర్రెలు, మేకలకు సంబంధించి ప్రభుత్వం అందించే మందుల్లో నాణ్యత లోపిస్తోందని జమలయ్య ఆరోపించారు. నాణ్యమైన నట్టల నివారణ మందు అందిస్తే కొన్నిరకాల వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. రాష్ట్రంలో 8 లక్షల మంది పెంపకందారులున్నారని, ఒక్కో పెంపకందారుడు ఏటా 5 నుంచి 10 వేల రూపాయల మందులు కొనుగోలు చేస్తున్నారని, ఏడాదికి దాదాపు రూ. 400 కోట్లు వెచ్చిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే కొన్నిరకాల మందులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారని, వాటిని ఔషధ నియంత్రణ అధికారులు అడ్డుకున్న దాఖలాలు లేవన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు ఈ ఏడాది రూ. 470 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందన్నారు. ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నిధులు ఖర్చు చేయకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆర్థిక శాఖ నిర్ణయించిందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంపకందారుల సమస్యలపై గ్రామ స్థాయి నుంచి వివరాలు సేకరించి వాటిని పరిష్కరించాలని కోరుతూ నవంబర్‌లో అసెంబ్లీని ముట్టడించనున్నట్లు జమలయ్య వెల్లడించారు. విలేకరుల సమావేశంలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి మొనపాటి రామకృష్ణ, సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు, లీగల్ అడ్వయిజర్ కే పిచ్చయ్య పాల్గొన్నారు.
రాష్ట్రంలో లక్ష గొర్రెల మృత్యువాత
Published Sat, Sep 28 2013 6:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement