అర్ధరాత్రి నుంచి జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని బీఎంఎస్ యూనియన్‌కు, అధికారులకు బుధవారం రాత్రి జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు యూని యన్ అధ్యక్షుడు కె. శంకర్ ప్రకటించారు. జీహెచ్‌ఎంసీలోని పారిశుధ్య విభాగంలోని కార్మికులతోపాటు రవాణ, ఎంటమాలజీ, బయోడైవర్సిటీ, వెటర్నరీ సహ మొత్తం 13 కేటగిరీల్లోని కార్మికులకు కూడా 27 శాతం ఇంక్రిమెంట్‌ను ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు ఇతరత్రా డిమాండ్లను యూనియన్ నాయకులు అధికారుల ముందుంచారు.
తమ డిమాండ్లకు అధికారులు అంగీకరించనందున సమ్మె అనివార్యమైందని యూనియన్ నాయకులు శంకర్, శ్యాంబాబు, జి.మల్లికార్జున్,వినయ్‌కపూర్ చెప్పారు. ఆయా విభాగాలకు చెందిన దాదాపు 8 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటార న్నారు.
సమ్మెకు వెళ్లొద్దు: కమిషనర్ విజ్ఞప్తి
రంజాన్ , బోనాల పండుగలు, వర్షాకాలం తరుణంలో బీఎంఎస్ నాయకులు సమ్మె ఆలోచన మానుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ యూనియన్‌కు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల పరిష్కారానికి అన్ని అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. విధులను బహిష్కరించే కార్మికులపై ఎస్మా, ఆర్‌పీ యాక్ట్‌లకు సైతం వెనుకాడేది లేదన్నారు. నగరం పరిశుభ్రంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు.