ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..! | diesel vehicles older than 10 years in Delhi to be deregistered | Sakshi
Sakshi News home page

ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..!

Published Thu, Dec 16 2021 7:48 PM | Last Updated on Thu, Dec 16 2021 7:48 PM

diesel vehicles older than 10 years in Delhi to be deregistered - Sakshi

న్యూఢిల్లీ: 2022, జనవరి 1 నాటికి పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లు పైబడిన అన్ని డీజిల్ వాహనాలను డీరిజిస్టర్ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటి) ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ డీరిజిస్టర్డ్ డీజిల్ వాహనాలకు ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) కూడా జారీ చేయము అని పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలు దిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతించొద్దని ఏప్రిల్‌ 7, 2015న ఎన్టీటీ సంబంధిత శాఖను ఆదేశించింది. 

అనంతరం దశలవారీగా ఇలాంటి వాహనాలను డీరిజిస్టర్‌ చేయాలంటూ 2016, జులై 18న ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు తొలుత రిజేస్ట్రేషన్‌ రద్దు చేయాలని స్పష్టం చేసింది. అలాగే దిల్లీ వెలుపల వీటిని నడిపేందుకు నిరభ్యంతర పత్రం కూడా ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. ఎన్‌జీటి ఆదేశాలకు అనుగుణంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను మొదట డీరిజిస్టర్ చేస్తుందని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను దేశంలో ఎక్కడ నడవకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) కూడా జారీ చేయము అని పేర్కొంది.

10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను వినియోగించుకోవాలంటే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అవకాశం ఉంటుందని ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని వారాల క్రితం, ఢిల్లీ ప్రభుత్వం ఈవి కిట్ తో పాత డీజిల్ & పెట్రోల్ వాహనాలను రెట్రోఫిట్ చేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోకపోతే పాత వాహనాలను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది అని తెలిపింది. ఢిల్లీ రవాణా శాఖ, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు బృందాలు ఇప్పటికే అటువంటి పాత వాహనాలను గుర్తించి అధీకృత విక్రేతల ద్వారా స్క్రాపింగ్ కోసం పంపుతున్నాయి.

(చదవండి: ఎంజీ మోటార్స్‌ అరుదైన ఘనత..! భారత్‌లో తొలి కంపెనీగా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement