ఇన్వెస్టిగేషన్లు, అధ్యయనాలు లేకుండానే భూకంపాల జోన్‌లో ప్రాజెక్టు నిర్మించినట్టు గతంలో కాగ్ నివేదిక
దీని ఆధారంగా సుమోటోగా విచారణ చేపట్టిన ఢిల్లీలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం
కేసు చెన్నై ధర్మాసనానికి బదిలీ.. ఈ నెల 11న తదుపరి విచారణ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ప్రధాన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏ అధ్యయనమూ చేయలేదు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరపలేదు. తొందరపాటుతో డ్రాయింగ్స్‌ను ఆమోదించి భూకంప జోన్‌లో మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించారంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) నివేదిక సమర్పించింది’అంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను ఎన్జీటీ సుమోటోగా పరిగణించింది.
నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, జిల్లా డిప్యూటీ కలెక్టర్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) కార్యద ర్శిని ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. అనంతరం చెన్నైలోని ఎన్జీటీ సదరన్ జోన్ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది.
గత నెల 7న విచారణ నిర్వహించిన చెన్నై ఎన్జీటీ ధర్మాసనం.. ‘మల్లన్నసాగర్’ను సందర్శించి నివేదిక సమర్పించాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్, నీటిపారుదల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 11న నిర్వహించనుంది.
‘సిక్కిం’ డ్యామ్ విషయాన్ని ప్రస్తావిస్తూ..
గతేడాది సిక్కింలోని లోహ్నాక్ వాగుకు గండి పడడంతో తీస్తా నదికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. దీంతో చుంగ్తాంగ్ వద్ద తీస్తాపై నిర్మించిన 1,200 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు కమ్ డ్యామ్ కొట్టుకుపోగా, పలు మరణాలతోపాటు భారీనష్టం వాటిల్లింది. దీనిపై గతంలో ఎన్జీటీ–ఢిల్లీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. మల్లన్నసాగర్ సైతం ఇదే తరహా అంశమని భావిస్తూ దానిపై సైతం విచారణ నిర్వహిస్తామని ఎన్జీటీ–ఢిల్లీ స్పష్టం చేసింది.
భూకంపాల సంభావ్యతకు సంబంధించిన అధ్యయనాల్లేకుండా మల్లన్నసాగర్ నిర్మాణంతో ఏదైనా విపత్తు జరిగితే అమలు చేయాల్సిన అత్యవసర కార్యాచరణ ప్రణాళిక సైతం రూపొందించకపోవడం ద్వారా ప్రభుత్వం రిజర్వాయర్‌తోపాటు దిగువ ప్రాంతాల ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా ఎన్జీటీ గుర్తు చేసింది.
మల్లన్నసాగర్ గర్భంలో 3 జతల పగుళ్లు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడానికి ముందే సైట్‌లో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై ఎన్జీఆర్‌ఐతో అధ్య యనం జరిపించాలని షరతు విధిస్తూ ప్రాజెక్టు ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు.
ఈ అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదలశాఖ 2016 డిసెంబర్, ఆగస్టు 2017, అక్టోబర్ 2017లో హైదరాబాద్‌లోని ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే, 2017లో నీటిపారుదలశాఖ మల్లన్నసాగర్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది.
మరోవైపు మల్లన్నసాగర్‌ను ప్రతిపాదించిన ప్రాంత భూగర్భంలో అత్యంత లోతు వరకు నిలువునా 3 జతల పగుళ్లు, వాటిలో కదలికలూ ఉన్నట్టు ఎన్‌జీఆర్‌ఐ 2017 మార్చిలో సమర్పించిన ప్రాథమిక నివేదికలో తేల్చి చెప్పిందని కాగ్ బయటపెట్టింది. వీటి ద్వారా ఉండనున్న ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయా లని సిఫారసులు చేసింది. ఈ ప్రాంతానికి ఉన్న భూకంపాల చరిత్రను ఉటంకిస్తూ సమగ్ర అధ్యయనం జరిపించాలని కోరింది. ఈ సిఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ విస్మరించిందని కాగ్ ఆక్షేపణలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment