సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్‌జీటీ సీరియస్ అయ్యింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్‌జీటీ.. 17 మంది కార్మికుల మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్, ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ పరిశ్రమల శాఖ,సీపీసీబీలతో పాటు కేంద్ర పర్యావరణ శాఖకు కూడా నోటీసులు ఇచ్చింది.
అలాగే, రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
కాగా, చిత్తూరు సమీపంలోని మురకంబట్టు ప్రాంతంలోని అపొలో మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యి 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం, 37మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంపై అసహనం వ్యక్తం చేసింది.
ఈ 3 ఘటనలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆరోపించింది. 2 వారాల్లో ఈ 3 ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.
అచ్యుతాపురం ఘటనలో ఎఫ్‌ఐఆర్ స్టేటస్ రిపోర్ట్, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, నష్టపరిహారం వంటి విషయాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా సాయం అందిందా లేదా అనే సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా తమకు తెలపాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment