ఎన్‌ఓసీ ఎప్పటికో? | HMDA Facing Problems With NOC Over Layout Regulation Scheme | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 9:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

HMDA Facing Problems With NOC Over Layout Regulation Scheme - Sakshi

సాక్షి, సిటీబ్యూరో :  హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) లే అవుట్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల క్లియరెన్స్‌ ప్రక్రియ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ దశలో నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్ల (ఎన్‌ఓసీ) కోసం దరఖాస్తుదారులు, హెచ్‌ఎండీఏ అధికారులు నానాపాట్లు పడుతున్నారు. హెచ్‌ఎండీఏనే స్వయంగా చొరవ తీసుకున్నా తొమ్మిది వేల దరఖాస్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్‌ఓసీలు జారీ కాలేదు. ఈ విషయంలో దరఖాస్తుదారులతోపాటు హెచ్‌ఎండీఏ అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు ఎదుర్కొన్న అనుభవాలే హెచ్‌ఎండీఏ అధికారులకు ఎదురవుతుండటంతో ఏమి చేయాలో పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శనంలో తహసీల్దార్లు, రెవెన్యూ విభాగం అధికారుల చుట్టూ తిరుగుతున్నా అనుకున్నంత వేగంగా ఎన్‌వోసీలు హెచ్‌ఎండీఏ చేతికి అందడం లేదు.

హెచ్‌ఎండీఏకు అందిన లక్షా 75 వేలకు పైగా దరఖాస్తుల్లో లక్షా 2,500లకు ఆమోదముద్ర పడింది. సీలింగ్‌ ల్యాండ్‌ అని,  ప్రభుత్వ భూమిలో ఉందంటూ, నాలాలో ప్లాటు వస్తుందంటూ...ఇలా దాదాపు తొమ్మిదివేల దరఖాస్తులకు ఎన్‌ఓసీలు తేవాలంటూ గతంలో షార్ట్‌ఫాల్‌ పంపిన హెచ్‌ఎండీఏ అధికారులు వారి నుంచి వ్యతిరేకత రావడంతో తామే స్వయంగా తెచ్చేందుకు గతనెలలో ప్లాన్‌ చేశారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు లేఖలు కూడా రాశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శనంలో తహసీలార్లు, రెవెన్యూ విభాగ అధికారులతో సమావేశమయ్యారు.

అయినా సామాన్యుడి మాదిరిగానే హెచ్‌ఎండీఏ అధికారులు వారిచుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటివరకు కేవలం మల్కాజ్‌గిరి మేడ్చల్‌ జిల్లా నుంచి 183 ఎన్‌వోసీలు తీసుకురాగలిగారు. మిగతా రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్‌ఓసీ కూడా తేలేకపోయారు. రెవెన్యూ విభాగం అధికారులను తరచూ కలుస్తున్నా ఎన్‌ఓసీలు జారీ చేయడంలో మాత్రం ఆలస్యమవుతోందని హెచ్‌ఎండీఏ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా ఆ విభాగం అధికారులు మేల్కొని ఎన్‌ఓసీలు ఇస్తే సాధ్యమైనంత త్వరగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్లియర్‌ చేస్తామని చెబుతున్నారు.  

ఫీజు సమాచారం అందినా చెల్లించడంలో అనాసక్తి... 
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్‌ స్కుృటినీ, టెక్నికల్‌ స్కుృటినీ పూర్తయిన  తర్వాత సక్రమమని తేలితే క్లియరెన్స్‌ ఇస్తారు. ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దరఖాస్తుదారుడి సెల్‌నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపుతారు. అది చెల్లించగానే ఫైనల్‌ ప్రొసిడింగ్స్‌ జారీ చేస్తారు. ఇలా హెచ్‌ఎండీఏకు వచ్చిన లక్షా 75 వేల దరఖాస్తుల్లో లక్షా 2,500 దరఖాస్తులను క్లియర్‌ చేశారు. దాదాపు తొమ్మిది వేల దరఖాస్తులు ఎన్‌ఓసీల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 63,500 దరఖాస్తులను ఓపెన్‌ స్పేస్,  రిక్రియేషనల్, వాటర్‌ బాడీ, మానుఫ్యాక్చరింగ్, సెంట్రల్‌ స్క్వేర్,  ట్రాన్స్‌పొర్టేషన్, బయో కన్సర్వేషన్, ఫారెస్ట్‌ జోన్, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు, ఓపెన్‌ స్పేస్‌ ఆఫ్‌ లే అవుట్, నది, వాగు, నాలా బఫర్‌జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. 

అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ అయిన ఫీజు సమాచారం అందుకున్న లక్షా 2,500 మంది దరఖాస్తుదారుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి మూడుసార్లు ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు పొడిగించినా వీరి సంఖ్య మాత్రం అలానే ఉంటుందని, ఈసారైనా తప్పక చెల్లించి ఫైనల్‌ ప్రొసిడింగ్స్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరి ద్వారా హెచ్‌ఎండీకు దాదాపు రూ.120 నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement