Layouts Regulation Scheme
-
ఎల్ఆర్ఎస్ పేరుతో నయా దోపిడీ
రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయడానికి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది. జీవో 131, జీవో 135. వీటి ప్రకారం 2020 ఆగస్టు 26 వరకూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కల్గి ఉన్న యజమానులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ప్రస్తుతమున్న అనుమతుల్లేని లేఅవుట్ వెంచర్లన్నీ తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్రామకంఠం భూములకు ఇది వర్తించదు. వ్యక్తిగత ప్లాట్ యజమాని వెయ్యి ఫీజుతో, లేఅవుట్ వెంచర్ యజమాని రూ.10 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించి అక్టోబర్ 15లోగా దరఖాస్తు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల అనధికార ప్లాట్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ 16 లక్షల మంది అప్లై చేసుకుంటే వచ్చే ఫీజుతోనే సుమారు రూ.160 కోట్ల ఆదాయం వస్తుంది. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు 2021 జనవరి 31 వరకూ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నట్లయితే 16 లక్షల ప్లాట్లకు గాను ఒక్కో దానికి సుమారు రూ.50 వేల చొప్పున వేసుకున్నా, రూ. 8 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశముంది. (చదవండి: ఎల్ఆర్ఎస్: ‘3 లక్షల కోట్లు దండుకోవాలని చూస్తోంది’) ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది. చిన్న చిన్న ప్లాట్లు కల్గిన వారిలో 80 శాతం మంది పేద, మధ్యతరగతి వారే ఉన్నారు. అసలే కరోనా లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన దయనీయమైన స్థితిలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటు. లాక్డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి కొంత నగదు ఇచ్చి బియ్యం పంపిణీ చేయడంతో పాటు, ఇంటి అద్దెలను సైతం కట్టొద్దని చెప్పిన ముఖ్యమంత్రి నేడు వేల కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య. ప్రస్తుతమున్న ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్ చేయిం చుకోకపోతే వాటిని అమ్మాలన్నా, వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నా అనుమతి ఉండదని; మంచినీటి కనెక్షన్, డ్రైనేజీ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఏ విధమైన రిజిస్ట్రేషన్ జరగవని చెప్పడం– పరోక్షంగా ప్రజలను ప్రభుత్వం బెదిరించి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగానే కన్పిస్తోంది. లేఅవుట్లలో ఎక్కువ వరకూ 200–250 గజాల ప్లాట్లు ఉంటాయి. ఇప్పుడు రోడ్లు విస్తరించే క్రమంలో ఆ ప్లాట్ల విస్తీర్ణం తగ్గిపోతోంది. రెండు వైపులా రోడ్ల ప్లాటు అయితే హక్కుదారులకు ఏమీ మిగలడం లేదు. అయినా వారి నుంచి కూడా మొత్తం ప్లాట్ల విస్తీర్ణానికి చార్జీలు వసూలు చేస్తున్నారు. పోయిన విస్తీర్ణానికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2015లో ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చింది. అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. ఆ సమయంలో దరఖాస్తు రూపంలో రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించకుండానే మూలన పడేశారు. తిరిగి నేడు మళ్లీ ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలంటూ కొత్త జీవో తేవడంతో గతంలో కట్టిన డీడీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: సారూ.. మాకేది మోక్షం!) కేంద్రం నుంచి జీఎస్టీ రాష్ట్ర పన్నుల వాటాగా రూ.8 వేల కోట్లు రావాలని చెబుతున్నారు. పదే పదే అడిగినా ఇవ్వడం లేదని, కరోనా వైరస్ కట్టడి చేయడానికి కూడా ఆర్థిక సాయమందించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దేవుడితో పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రంతో ఎందుకు పోరాడి నిధులు రాబట్టలేకపోతున్నారో ప్రజలకు తెలియజేయాలి. కేంద్రంతో పోరాడే దమ్ము లేకనే పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. వాస్తవంగా రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం నిషేధాస్తులు తప్ప ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడం ఏమాత్రం ఆపకూడదు. కానీ ఆగస్టు నెల చివరి నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయడం చట్టవిరుద్ధం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఆరేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ ఎందుకు అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేయనిచ్చారు? కొన్ని ప్లాట్లు, వెంచర్లలో భవన నిర్మాణాలు సైతం జరిగాయి. ఇన్ని ఏళ్ల కాలంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ గుర్తు రాలేదా? ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఏకపక్షంగా ఆర్థికభారం మోపడం తగదు. తక్షణమే జీవో 131, 135లను రద్దుచేయాలి. వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు రెడీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ మున్సిపల్ శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 31.08.2020 నుంచి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ప్రారంభించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఆగస్టు 26 లోపు చేసిన లే అవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్లకు ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎల్ఆర్ఎస్కు సంబంధించి మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కింది మార్గదర్శకాలకు లోబడే లే అవుట్లను రెగ్యులర్ చేస్తామని అధికారులు తెలిపారు. ⇒ నాలాకు 2 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వాగుకు 9 మీటర్ల దూరం ఉండాలి. ⇒ 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి . ⇒ 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి. ⇒ ఎయిర్‌పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వ్యక్తిగత ప్లాట్ ఓనర్స్ వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, లే అవుట్ ఓనర్స్ 10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ⇒ 100 గజాల లోపు ఉన్న వారు గజానికి 200 రూపాయల చొప్పున చెల్లించాలి. ⇒ 101 నుంచి 300 గజాలు ఉన్నవాళ్లు గజానికి 400 రూపాయలు చెల్లించాలి. ⇒ 301 నుంచి 500 గజాలు ఉన్నవాళ్లు గజానికి 600 రూపాయలు చెల్లించాలి. (చదవండి: ప్రైవేటు జలగలు..! ) -
హెచ్ఎండీఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ లేనట్టే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అవకాశమిచ్చిన లేఔట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపాలిటీ కార్పొరేషన్ల లోని అనధికారి లేఅవుట్ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం లేదు. ప్రభుత్వం తొలుత హెచ్ఎండీఏ పరిధిలోని 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా 73 సంస్థల పరిధిలో అవకాశమివ్వాలని భావించినా ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 2018 మార్చి 30 కటాఫ్‌గా నిర్ణయించడంతో లక్షకుపైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చి కోట్లలో ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు.90 రోజుల్లోపు అంటే 3 నెలల్లోపు ఆయా ప్లాట్ల యజమానులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ప్రారంభ ఫీజుగా రూ.పదివేలు చెల్లించి దరఖాస్తు చేసిన తర్వాత ఆయా డాక్యుమెంట్లు సరిగా ఉంటే సబ్‌రిజిష్టార్ మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా ఎల్ఆర్ఎస్,వ్యవసాయేతర(నాలా) ఫీజును అధికారులు లబ్ధిదారుని సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తారు.అయితే గతంలో లాగే ఈ దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిశీలించనుంది. అవకాశం వీటికే: నర్సాపూర్ మునిసిపాలిటీ, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట, ఖానాపూర్, చొప్పదండి, కొత్తపల్లి, రాయికల్, ధర్మపురి, మంథని, సుల్తానాబాద్, వైరా, వర్ధన్నపేట, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, నడికొండ, చిత్యల్, హాలి యా, చందూర్, నేరేడ్చెర్ల, తిరుమలగిరి, మోత్కు రు, ఆలేర్, యాదగిరిగుట్ట, మత్కల్, భూత్పూర్, కోస్గి, కొత్తకోట, పెబ్బెర్, ఆత్మకూర్, అమరచింత, వడ్డెపల్లి, అలంపూర్, రామాయంపేట, చేర్యాల, నారాయణ్‌ఖేడ్, బాన్సువాడ, భీంగల్, ఎల్లారెడ్డి, పరిగి, కొడంగల్, ఆమన్‌గల్ మునిసిపాలిటీలకు ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు.. -
ఎన్ఓసీ ఎప్పటికో?
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ దశలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల (ఎన్ఓసీ) కోసం దరఖాస్తుదారులు, హెచ్ఎండీఏ అధికారులు నానాపాట్లు పడుతున్నారు. హెచ్ఎండీఏనే స్వయంగా చొరవ తీసుకున్నా తొమ్మిది వేల దరఖాస్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ఓసీలు జారీ కాలేదు. ఈ విషయంలో దరఖాస్తుదారులతోపాటు హెచ్ఎండీఏ అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎదుర్కొన్న అనుభవాలే హెచ్ఎండీఏ అధికారులకు ఎదురవుతుండటంతో ఏమి చేయాలో పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శనంలో తహసీల్దార్లు, రెవెన్యూ విభాగం అధికారుల చుట్టూ తిరుగుతున్నా అనుకున్నంత వేగంగా ఎన్వోసీలు హెచ్ఎండీఏ చేతికి అందడం లేదు. హెచ్ఎండీఏకు అందిన లక్షా 75 వేలకు పైగా దరఖాస్తుల్లో లక్షా 2,500లకు ఆమోదముద్ర పడింది. సీలింగ్ ల్యాండ్ అని, ప్రభుత్వ భూమిలో ఉందంటూ, నాలాలో ప్లాటు వస్తుందంటూ...ఇలా దాదాపు తొమ్మిదివేల దరఖాస్తులకు ఎన్ఓసీలు తేవాలంటూ గతంలో షార్ట్‌ఫాల్ పంపిన హెచ్ఎండీఏ అధికారులు వారి నుంచి వ్యతిరేకత రావడంతో తామే స్వయంగా తెచ్చేందుకు గతనెలలో ప్లాన్ చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు లేఖలు కూడా రాశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శనంలో తహసీలార్లు, రెవెన్యూ విభాగ అధికారులతో సమావేశమయ్యారు. అయినా సామాన్యుడి మాదిరిగానే హెచ్ఎండీఏ అధికారులు వారిచుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటివరకు కేవలం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా నుంచి 183 ఎన్వోసీలు తీసుకురాగలిగారు. మిగతా రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్ఓసీ కూడా తేలేకపోయారు. రెవెన్యూ విభాగం అధికారులను తరచూ కలుస్తున్నా ఎన్ఓసీలు జారీ చేయడంలో మాత్రం ఆలస్యమవుతోందని హెచ్ఎండీఏ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా ఆ విభాగం అధికారులు మేల్కొని ఎన్ఓసీలు ఇస్తే సాధ్యమైనంత త్వరగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేస్తామని చెబుతున్నారు. ఫీజు సమాచారం అందినా చెల్లించడంలో అనాసక్తి... ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్ స్కుృటినీ, టెక్నికల్ స్కుృటినీ పూర్తయిన తర్వాత సక్రమమని తేలితే క్లియరెన్స్ ఇస్తారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దరఖాస్తుదారుడి సెల్‌నంబర్‌కు ఎస్ఎంఎస్లు పంపుతారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసిడింగ్స్ జారీ చేస్తారు. ఇలా హెచ్ఎండీఏకు వచ్చిన లక్షా 75 వేల దరఖాస్తుల్లో లక్షా 2,500 దరఖాస్తులను క్లియర్ చేశారు. దాదాపు తొమ్మిది వేల దరఖాస్తులు ఎన్ఓసీల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 63,500 దరఖాస్తులను ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్ బాడీ, మానుఫ్యాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పొర్టేషన్, బయో కన్సర్వేషన్, ఫారెస్ట్ జోన్, మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఓపెన్ స్పేస్ ఆఫ్ లే అవుట్, నది, వాగు, నాలా బఫర్‌జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్ఆర్ఎస్ క్లియర్ అయిన ఫీజు సమాచారం అందుకున్న లక్షా 2,500 మంది దరఖాస్తుదారుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి మూడుసార్లు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగించినా వీరి సంఖ్య మాత్రం అలానే ఉంటుందని, ఈసారైనా తప్పక చెల్లించి ఫైనల్ ప్రొసిడింగ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరి ద్వారా హెచ్ఎండీకు దాదాపు రూ.120 నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. -
అందుబాటులోకి రాని ‘ఆన్లైన్’
-
అందుబాటులోకి రాని ‘ఆన్లైన్’
సాక్షి, హైదరాబాద్: భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్ఎస్), లేఔట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)లను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియే ప్రారంభం కాలేదు. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్కు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారానే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2007లో బీపీఎస్‌ను అమల్లోకి తెచ్చినప్పుడు కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులను స్వీకరించడంతో పలు అక్రమాలు చోటు చేసుకోవడంతో ఈసారి అవినీతికి తావు లేకుండా చేసేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తుల్ని స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన 60 రోజుల గడువులో ఐదు రోజులు ముగిసిపోతున్నా.. ఇంతవరకు జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులోకి రాలేదు. దీంతో ఆన్లైన్లో దర ఖాస్తులు ఎలా పంపాలో తెలియక అనేక మంది జీహెచ్ఎంసీ ప్రధాన, సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులోకి రాకపోవడంతో అధికారులు పరుగుల మీద సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఆన్లైన్ ద్వారా దర ఖాస్తుల స్వీకరణను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ అందుబాటులోకి రాగానే భవన, లేఔట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్ ద్వారా నమోదులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. దరఖాస్తులో దాదాపు 20 అంశాలను భర్తీ చేయాల్సి ఉంటుందని, వీటిలో చాలా వరకు ఒక్క క్లిక్‌తో పూర్తి చేయగలిగేవే అని చెప్పారు. సులభంగా దరఖాస్తు... జీహెచ్ఎంసీ వెబ్సైట్లో లాగిన్ అయితే యూజర్ ఐడీ వస్తుంది. దాంతో ఆన్లైన్లోని దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి, అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇల్లు/భవనం/ప్లాట్/ఫ్లాట్ ఉన్న ప్రాంతం, మండలం/సర్కిల్, జిల్లా తదితర వివరాలను నమోదు చేయాలి. ఇంటి నంబర్, ఆస్తిపన్ను రశీదు(ఉంటే) నంబర్ తదితర వివరాలను నింపాలి. తర్వాత అనుమతి పొందిన దానికంటే డీవియేషన్లు చేశారా.. లేక అసలు అనుమతే లేకుండా నిర్మించారా అనే వివరాలు పొందుపరచాలి. అవసరమైన ఫొటోలు, సంబంధిత సేల్ డీడ్ తదితర పత్రాలు స్కాన్ చేయాలి. మొత్తం బిల్టప్ ఏరియా, డీవియేషన్ జరిగిన విస్తీర్ణం ఇతరత్రా వివరాలను పొందుపరచాలి. అలాగే నివాస భవనమా, వాణిజ్య భవనమా అనే వివరాలు సైతం ఇవ్వాలి. ఇండెమ్నిటీ బాండ్ పేపర్‌ను కూడా భర్తీ చేయాలి. దరఖాస్తు మొత్తం భర్తీ చేశాక ఎంత విస్తీర్ణంలోని స్థలం/భవనం, ఎంతమేర క్రమబద్ధీకరణ చేసుకునేది.. దానికి సంబంధించి అయ్యే ఫీజులు తదితర వివరాలన్నీ తెలిసేలా వివరాల అక్నాలెడ్జ్మెంట్ అందుతుంది. ఏరియాను బట్టి ఎంత విస్తీర్ణంలో ఉందో పేర్కొంటే.. ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన చార్జీలకు అనుగుణంగా ఎంత ఫీజు అవుతుందో ఆన్లైన్లోనే తెలుస్తుంది. అందులో పది శాతం కానీ, లేదా రూ. 10 వేలు కానీ చెల్లించాలి. ఆన్లైన్లో దరఖాస్తు నమోదుకు సంబంధించిన అక్నాలె డ్జ్మెంట్ ప్రతిని తీసుకుని సీఎస్సీలో అందజేస్తే ఫీజు తీసుకుని రసీదు ఇస్తారు. డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చు. ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే చెల్లింపు కూడా అందుబాటులోకి రానుంది. ఆస్తి పన్నును ఆన్లైన్లో చెల్లిస్తున్న మాదిరిగానే సంబంధిత గేట్వేలను ఏర్పాటు చేస్తారు. లేదా చలాన్‌ను డౌన్లోడ్ చేసుకుని బ్యాంకులో కూడా చెల్లించవచ్చు.