అందుబాటులోకి రాని ‘ఆన్‌లైన్’
సాక్షి, హైదరాబాద్: భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్‌ఎస్), లేఔట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)లను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియే ప్రారంభం కాలేదు. బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2007లో బీపీఎస్‌ను అమల్లోకి తెచ్చినప్పుడు కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులను స్వీకరించడంతో పలు అక్రమాలు చోటు చేసుకోవడంతో ఈసారి అవినీతికి తావు లేకుండా చేసేందుకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల్ని స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది.
అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన 60 రోజుల గడువులో ఐదు రోజులు ముగిసిపోతున్నా.. ఇంతవరకు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ప్రక్రియ అందుబాటులోకి రాలేదు. దీంతో ఆన్‌లైన్‌లో దర ఖాస్తులు ఎలా పంపాలో తెలియక అనేక మంది జీహెచ్‌ఎంసీ ప్రధాన, సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆన్‌లైన్ ప్రక్రియ అందుబాటులోకి రాకపోవడంతో అధికారులు పరుగుల మీద సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు.
శుక్రవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తుల స్వీకరణను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ అందుబాటులోకి రాగానే భవన, లేఔట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్‌లైన్ ద్వారా నమోదులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. దరఖాస్తులో దాదాపు 20 అంశాలను భర్తీ చేయాల్సి ఉంటుందని, వీటిలో చాలా వరకు ఒక్క క్లిక్‌తో పూర్తి చేయగలిగేవే అని చెప్పారు.
సులభంగా దరఖాస్తు...
జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే యూజర్ ఐడీ వస్తుంది. దాంతో ఆన్‌లైన్‌లోని దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి, అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఇల్లు/భవనం/ప్లాట్/ఫ్లాట్ ఉన్న ప్రాంతం, మండలం/సర్కిల్, జిల్లా తదితర వివరాలను నమోదు చేయాలి. ఇంటి నంబర్, ఆస్తిపన్ను రశీదు(ఉంటే) నంబర్ తదితర వివరాలను నింపాలి. తర్వాత అనుమతి పొందిన దానికంటే డీవియేషన్లు చేశారా.. లేక అసలు అనుమతే లేకుండా నిర్మించారా అనే వివరాలు పొందుపరచాలి.
అవసరమైన ఫొటోలు, సంబంధిత సేల్ డీడ్ తదితర పత్రాలు స్కాన్ చేయాలి. మొత్తం బిల్టప్ ఏరియా, డీవియేషన్ జరిగిన విస్తీర్ణం ఇతరత్రా వివరాలను పొందుపరచాలి. అలాగే నివాస భవనమా, వాణిజ్య భవనమా అనే వివరాలు సైతం ఇవ్వాలి. ఇండెమ్నిటీ బాండ్ పేపర్‌ను కూడా భర్తీ చేయాలి. దరఖాస్తు మొత్తం భర్తీ చేశాక ఎంత విస్తీర్ణంలోని స్థలం/భవనం, ఎంతమేర క్రమబద్ధీకరణ చేసుకునేది.. దానికి సంబంధించి అయ్యే ఫీజులు తదితర వివరాలన్నీ తెలిసేలా వివరాల అక్‌నాలెడ్జ్‌మెంట్ అందుతుంది.
ఏరియాను బట్టి ఎంత విస్తీర్ణంలో ఉందో పేర్కొంటే.. ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన చార్జీలకు అనుగుణంగా ఎంత ఫీజు అవుతుందో ఆన్‌లైన్‌లోనే తెలుస్తుంది. అందులో పది శాతం కానీ, లేదా రూ. 10 వేలు కానీ చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదుకు సంబంధించిన అక్‌నాలె డ్జ్‌మెంట్ ప్రతిని తీసుకుని సీఎస్‌సీలో అందజేస్తే ఫీజు తీసుకుని రసీదు ఇస్తారు. డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే చెల్లింపు కూడా అందుబాటులోకి రానుంది. ఆస్తి పన్నును ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్న మాదిరిగానే సంబంధిత గేట్‌వేలను ఏర్పాటు చేస్తారు. లేదా చలాన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని బ్యాంకులో కూడా చెల్లించవచ్చు.