BRS scheme
-
KCR BRS: కిక్కిరిసిన తుగ్లక్ రోడ్డు.. బిజీబిజీగా కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన ఉద్యమం, ఉత్తరాది రాష్ట్రాల్లో కలిసొచ్చే పార్టీలు, సంఘాలు, పార్టీ ప్రధాన ఎజెండా తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాదికి చెందిన నేతలు, రైతు సంఘాల నాయకులతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు, రైతులే కీలకం కావడంతో.. వారి ఎజెండాతోనే ముందుకు పోవాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమ నిర్మాణం, వ్యవసాయ కేంద్రీకృత అంశాలపై విస్తృత చర్చలు జరుపుతున్నారు. ధాన్యం సేకరణ, గోధుమ సాగుపై చర్చలు రైతు ఎజెండానే తమ తొలి ప్రాధాన్యమని చాటేలా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్ఎస్ కిసాన్ సెల్)ని ఏర్పాటు చేయడంతో పాటు దానికి అధ్యక్షునిగా రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చడూనీని కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. తన నియామకంపై కృతజ్ఞతలు తెలియజేసేందుకు.. గుర్నామ్ సింగ్‌తో పాటు పంజాబ్, హరియాణాకు చెందిన రైతులు గురువారం తుగ్లక్ రోడ్డులోని సీఎం అధికారిక నివా సంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రస్తుత ఖరీఫ్‌లో వరి ధాన్యం సేకరణ, దానికి అనుసరిస్తున్న విధానాలు, గోధుమల సాగు లో తలెత్తే సమస్యలు, పంట వ్యర్ధాల దహనం, ప్రభుత్వ విధానాలు, తదితర అంశాలపై చర్చించారు.పంటల సేకరణలో జాతీయ విధానం, మద్దతు ధరలు, వ్యవసాయంలో సంప్రదాయ దేశీయ పద్ధతులకు ప్రోత్సాహం వంటి అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. సాగు నీటి రంగంలో తెలంగాణ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, విద్యుత్ సంస్కరణలు, వివిధ వృత్తుల వారికి సామాజిక భద్రత వంటి అంశాలపై మాట్లాడినట్లు చెబుతున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులనే జాతీయ స్థాయి లో అమలు చేసేలా ఎజెండాను రూపొందిద్దామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒవైసీ భేటీ.. కుమార్తె వివాహానికి ఆహ్వానం! మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఏర్పాటుపై ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతీయ స్థాయిలో కలిసి ఉద్యమించే అంశాలు, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన విషయాలపై ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. కిక్కిరిసిన తుగ్లక్ రోడ్డు బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రెండోరోజు కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర సందర్శకుల రాకతో ఆయన బిజీబిజీగా గడిపారు. తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు, ఉత్తరాది నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన రైతు సంఘాల నేతలు, ప్రముఖులను పలుకరించిన ముఖ్యమంత్రి వారితో ఫొటోలు దిగారు. సందర్శకుల తాకిడితో తుగ్లక్ రోడ్డు పరిసర ప్రాంతాలు జన సందోహంతో కిక్కిరిశాయి. ఇలావుండగా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి పయనమైన నేతలకు విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపించాయి. గరిష్టంగా రూ.50 వేల వరకు పలకడంతో చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఉద్యమ కార్యాచరణపై త్వరలో ప్రకటన! రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ్ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) నేషనల్ కన్వీనర్, ఎంపీ హనుమాన్ బేనివాల్, ఒడిశాకు చెందిన రైతు సంఘం నేత అక్షయ్ కుమార్, జహీరాబాద్‌కు చెందిన రైతు నేత ఢిల్లీ వసంత్‌లు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల విధానాలు, చేయాల్సిన సంస్కరణలు వంటి అంశాలపై లోతుగా చర్చించారు. రైతు సంబంధిత అంశాలపై వివరాలను సేకరించిన కేసీఆర్.. త్వరలోనే పార్టీ తరఫున జాతీయ స్థాయి సమావేశం నిర్వహణ, తదనంతరం ఢిల్లీ వేదికగా చేసే ఉద్యమ కార్యాచరణపై ప్రకటన చేద్దామని చెప్పినట్లు తెలిసింది. ఇదీ చదవండి: స్పీడ్ పెంచిన గులాబీ బాస్.. ఢిల్లీ వేదికగా త్వరలో కీలక సమావేశం! -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్లపై స్టే యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై బుధవారం హైకోర్టు విచారించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. అక్కడ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటివరకూ అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్ కాపీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీడ్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పరిశీలించింది. సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు బీఆర్ఎస్పై స్టే యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది (ఏజీ) సమాధానం ఇచ్చారు. ఏజీ చెప్పిన స్టేట్మెంట్ను హైకోర్టు నమోదు చేసుకుంది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ప్రభుత్వానికి చివరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలకలం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తును సీబీఐ, ఈడీ, ఎన్సీబీకి అప్పగించాలంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పిటీషన్ దాఖలు చేసి మూడేళ్లు అవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం లేదని రేవంత్ తరఫు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ధరణి పోర్టల్‌పై నేడు విచారణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లపై దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ధరణి పోర్టల్‌లో వ్యవసయేతర ఆస్తుల నమోదుపై హై కోర్టు గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్‌ని నేటి వరకు పొడిగించింది. ఇక నేటి విచారణలో ధరణికి సంబంధించిన జీవోలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. నేడు పిటీషన్ విచారణని కోర్టు మధ్యాహ్న 2.30 గంటలకి వాయిదా వేసింది. (చదవండి: రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు) బీఆర్ఎస్పై ఎందుకు ఇంత జాప్యం బీఆర్ఎస్పై నివేదిక సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం తెలంగాణ హై కోర్టును కోరింది. చివరి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే 2016లో దాఖలైన పిల్లో ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయ్యలేదన్న కోర్టు.. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. భవానాల క్రమబద్ధీకరణపై తదుపరి విచారణను హై కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. -
బీఆర్ఎస్ గుడ్‌న్యూస్
సాక్షి, సిటీబ్యూరో: బీఆర్ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) కింద అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకొని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే శుభవార్త అందనుంది. దాదాపు నాలుగేళ్లుగాఅదిగో.. ఇదిగో.. అంటున్నప్పటికీ ముందుకుసాగని దరఖాస్తుల ప్రాథమిక పరిశీలనను అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇందులో భాగంగా దరఖాస్తులను వివిధ కేటగిరీలుగా వర్గీకరించారు. అందిన దరఖాస్తుల్లో 3వేలు ప్రాథమిక పరిశీలనలోనేబీఆర్ఎస్కు అనర్హమైనవని గుర్తించారు. యూఎల్సీ పరిధి, చెరువులు, నాలాలు, వక్ఫ్ ప్రభుత్వ భూములను ఆక్రమించి వీటిని నిర్మించినట్లు తేల్చారు. అనుమతులు లేకుండా భవనాలు, అదనపు అంతస్తులు వేసిన నిర్మించిన వారిలో ఎక్కువ మంది వ్యక్తిగత ఇళ్లవారే ఉండడం నగరంలో స్థలాల డిమాండ్‌కు అద్దం పడుతోంది. మొత్తం 1.27 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 69 శాతంవీరివే ఉన్నాయని తేలింది. దరఖాస్తుల్లో ఇండిపెండెంట్ ఇళ్లవి 70 వేలు, అపార్ట్మెంట్లలోని వ్యక్తిగత ఫ్లాట్లు 18వేలు, బిల్డర్ల అపార్ట్మెంట్లు 13వేలు, బహుళ అంతస్తుల భవనాలవి 11వేలు, వాణిజ్య భవనాలవి7వేలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతరత్రా కూడా మరికొన్ని ఉన్నాయి. అదే విధంగా బీఆర్ఎస్కు దరఖాస్తుతో పాటు ప్రాథమిక ఫీజు రూ.10వేలు చెల్లించాలనే నిబంధన ఉంది. దరఖాస్తుదారుల్లో దాదాపు 14వేల మంది ఈ ఫీజు చెల్లించలేదని అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు... దరఖాస్తుల ప్రాథమిక పరిశీలనను పూర్తి చేసిన అధికారులు ఈ జాబితాను హైకోర్టుకు అందజేసి బీఆర్ఎస్కు అనుమతించాల్సిందిగా కోరనున్నారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదుతో బీఆర్ఎస్కు బ్రేక్ వేసిన హైకోర్టు... దరఖాస్తుల్ని పరిశీలించవచ్చునని, అయితే తాము అనుమతి ఇచ్చే వరకూ క్రమబద్ధీకరణ మాత్రం చేయరాదని ఆదేశించిన విషయం విదితమే. అధికారులు ఎప్పటి నుంచో దరఖాస్తుల వివరాలను హైకోర్టుకు అందజేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ..పరిశీలన పూర్తికాకపోవడంతో సమర్పించలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వానికి కూడా నిధుల కటకట ఉండటంతో... క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయం సమకూరుతుందనే భావనతో దరఖాస్తులను పరిష్కరించాలని సర్కార్ బల్దియాకు సూచించింది. అందుకనుగుణంగా అధికారులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. యూఎల్సీ, నాలా, చెరువులు, తదితర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి జరిపిననిర్మాణాలు బీఆర్ఎస్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హమైనవి కావని చీఫ్ సిటీ ప్లానర్‌ఎస్.దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ జాబితాను హైకోర్డుకు నివేదించాక, న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
అందుబాటులోకి రాని ‘ఆన్లైన్’
-
అందుబాటులోకి రాని ‘ఆన్లైన్’
సాక్షి, హైదరాబాద్: భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్ఎస్), లేఔట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)లను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియే ప్రారంభం కాలేదు. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్కు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారానే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2007లో బీపీఎస్‌ను అమల్లోకి తెచ్చినప్పుడు కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులను స్వీకరించడంతో పలు అక్రమాలు చోటు చేసుకోవడంతో ఈసారి అవినీతికి తావు లేకుండా చేసేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తుల్ని స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన 60 రోజుల గడువులో ఐదు రోజులు ముగిసిపోతున్నా.. ఇంతవరకు జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులోకి రాలేదు. దీంతో ఆన్లైన్లో దర ఖాస్తులు ఎలా పంపాలో తెలియక అనేక మంది జీహెచ్ఎంసీ ప్రధాన, సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులోకి రాకపోవడంతో అధికారులు పరుగుల మీద సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఆన్లైన్ ద్వారా దర ఖాస్తుల స్వీకరణను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ అందుబాటులోకి రాగానే భవన, లేఔట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్ ద్వారా నమోదులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. దరఖాస్తులో దాదాపు 20 అంశాలను భర్తీ చేయాల్సి ఉంటుందని, వీటిలో చాలా వరకు ఒక్క క్లిక్‌తో పూర్తి చేయగలిగేవే అని చెప్పారు. సులభంగా దరఖాస్తు... జీహెచ్ఎంసీ వెబ్సైట్లో లాగిన్ అయితే యూజర్ ఐడీ వస్తుంది. దాంతో ఆన్లైన్లోని దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి, అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇల్లు/భవనం/ప్లాట్/ఫ్లాట్ ఉన్న ప్రాంతం, మండలం/సర్కిల్, జిల్లా తదితర వివరాలను నమోదు చేయాలి. ఇంటి నంబర్, ఆస్తిపన్ను రశీదు(ఉంటే) నంబర్ తదితర వివరాలను నింపాలి. తర్వాత అనుమతి పొందిన దానికంటే డీవియేషన్లు చేశారా.. లేక అసలు అనుమతే లేకుండా నిర్మించారా అనే వివరాలు పొందుపరచాలి. అవసరమైన ఫొటోలు, సంబంధిత సేల్ డీడ్ తదితర పత్రాలు స్కాన్ చేయాలి. మొత్తం బిల్టప్ ఏరియా, డీవియేషన్ జరిగిన విస్తీర్ణం ఇతరత్రా వివరాలను పొందుపరచాలి. అలాగే నివాస భవనమా, వాణిజ్య భవనమా అనే వివరాలు సైతం ఇవ్వాలి. ఇండెమ్నిటీ బాండ్ పేపర్‌ను కూడా భర్తీ చేయాలి. దరఖాస్తు మొత్తం భర్తీ చేశాక ఎంత విస్తీర్ణంలోని స్థలం/భవనం, ఎంతమేర క్రమబద్ధీకరణ చేసుకునేది.. దానికి సంబంధించి అయ్యే ఫీజులు తదితర వివరాలన్నీ తెలిసేలా వివరాల అక్నాలెడ్జ్మెంట్ అందుతుంది. ఏరియాను బట్టి ఎంత విస్తీర్ణంలో ఉందో పేర్కొంటే.. ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన చార్జీలకు అనుగుణంగా ఎంత ఫీజు అవుతుందో ఆన్లైన్లోనే తెలుస్తుంది. అందులో పది శాతం కానీ, లేదా రూ. 10 వేలు కానీ చెల్లించాలి. ఆన్లైన్లో దరఖాస్తు నమోదుకు సంబంధించిన అక్నాలె డ్జ్మెంట్ ప్రతిని తీసుకుని సీఎస్సీలో అందజేస్తే ఫీజు తీసుకుని రసీదు ఇస్తారు. డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చు. ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే చెల్లింపు కూడా అందుబాటులోకి రానుంది. ఆస్తి పన్నును ఆన్లైన్లో చెల్లిస్తున్న మాదిరిగానే సంబంధిత గేట్వేలను ఏర్పాటు చేస్తారు. లేదా చలాన్‌ను డౌన్లోడ్ చేసుకుని బ్యాంకులో కూడా చెల్లించవచ్చు. -
అడ్డదారిలో పన్ను బాదుడు
విజయవాడ సెంట్రల్ : ఆదాయం సమకూర్చుకునే పేరుతో నగరపాలకులు పన్ను బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు టౌన్‌ప్లానింగ్‌ను ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. ఆస్తిపన్ను పెంచలేమని పైకి చెబుతూనే పక్కదారులు వెతుకుతున్నారు. బీఆర్ఎస్ స్కీము అమలుకు అనుమతి కోరడంతో పాటు ప్లాన్లేని ఇళ్లకు పన్నును పన్ను బాదుడు వందశాతం పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పురపాలక శాఖ మంత్రి నారాయణతో సమావేశం సందర్భంగా ఆర్థిక పరమైన పలు అంశాలపై చర్చ జరిగింది. నిధుల కోసం మా చుట్టూ తిరగడం మాని, ఆదాయ మార్గాలు పెంచుకొనే ఆలోచన చేయమని మంత్రి నగరపాలకులకు హితబోధ చేసినట్లు భోగట్టా. ఈక్రమంలో స్థానిక వనరులపై పాలకులు దృష్టి పెట్టారు. బకాయిలు వసూలు చేయడంతో పాటు అడ్డదారిలో పన్నుల కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటర్, డ్రెయినేజ్ చార్జీలు ఏడు శాతం పెంచితేనే నగర ప్రజలు కన్నెర్ర జేశారు. విపక్షాలు కార్పొరేషన్ టాప్ లేపేశాయి. ఈ నేపథ్యంలోఆస్తిపన్ను పెంచేందుకు పాలకులు జంకుతున్నారు. నొప్పి తెలియకుండా గాయం చేసేందుకు టౌన్‌ప్లానింగ్‌ను వాడుకోవాలని భావిస్తున్నారు. నగరంలో 30 వేల గృహాలు అనధికారికంగా నిర్మించినట్లు లెక్కతేల్చారు. కొండప్రాంతాలపై దృష్టి బిల్డింగ్ రెగ్యులరైజ్ స్కీం(బీఆర్ఎస్) అస్త్రాన్ని వీటిపై ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్లాన్ లేని ఇళ్ల నుంచి వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని 16 డివిజన్లలో కొండప్రాంతాలపై 40 వేల ఇళ్లు ఉన్నాయి. సింగ్‌నగర్, పాయకాపురం, కృష్ణలంక ప్రాంతాల్లో సుమారు 20 వేల ఇళ్లకు ప్లాన్లు లేవని ప్రాథమిక అంచనా. వీటి నుంచి వందశాతం ఆస్తిపన్ను వసూలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒకటో సర్కిల్ పరిధిలోని కొండప్రాంతాల రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం గృహాలు ఎన్ని, ఆస్తిపన్ను ఎంత మంది చెల్లిస్తున్నారనే వివరాలతో కూడిన నివేదికను కమిషనర్‌కు ఇవ్వనున్నారు. త్వరలోనే రెండు, మూడు సర్కిళ్లలో కూడా సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రీసర్వేకు రంగం ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి గృహ సముదాయాల కొలతల్లో భారీ వ్యత్యాసం ఉందని, కాబట్టి నగరంలో రీ సర్వే చేయాలని డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. త్వరలోనే రీ సర్వే చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పైకి ఆస్తిపన్ను పెంచమని చెబుతూనే పాలకులు పక్కదారులు వెతకడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. మొత్తంమీద త్వరలోనే అడ్డదారిలో ఆస్తిపన్ను బాదుడు మొదలు కానున్నట్లు వినికిడి.