అడ్డదారిలో పన్ను బాదుడు | government effort for implementation of BRS scheme | Sakshi
Sakshi News home page

అడ్డదారిలో పన్ను బాదుడు

Published Wed, Aug 13 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

government effort for implementation of BRS scheme

విజయవాడ సెంట్రల్ : ఆదాయం సమకూర్చుకునే పేరుతో నగరపాలకులు పన్ను బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు టౌన్‌ప్లానింగ్‌ను ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు.  ఆస్తిపన్ను పెంచలేమని పైకి చెబుతూనే పక్కదారులు వెతుకుతున్నారు. బీఆర్‌ఎస్ స్కీము అమలుకు అనుమతి కోరడంతో పాటు ప్లాన్‌లేని ఇళ్లకు పన్నును పన్ను బాదుడు వందశాతం పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

పురపాలక శాఖ మంత్రి నారాయణతో సమావేశం సందర్భంగా ఆర్థిక పరమైన పలు అంశాలపై చర్చ జరిగింది. నిధుల కోసం మా చుట్టూ తిరగడం మాని, ఆదాయ మార్గాలు పెంచుకొనే ఆలోచన చేయమని మంత్రి నగరపాలకులకు హితబోధ చేసినట్లు భోగట్టా. ఈక్రమంలో స్థానిక వనరులపై పాలకులు దృష్టి పెట్టారు. బకాయిలు వసూలు చేయడంతో పాటు అడ్డదారిలో పన్నుల కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  వాటర్, డ్రెయినేజ్ చార్జీలు ఏడు శాతం పెంచితేనే నగర ప్రజలు కన్నెర్ర జేశారు. విపక్షాలు కార్పొరేషన్ టాప్ లేపేశాయి. ఈ నేపథ్యంలోఆస్తిపన్ను పెంచేందుకు పాలకులు జంకుతున్నారు. నొప్పి తెలియకుండా గాయం చేసేందుకు టౌన్‌ప్లానింగ్‌ను వాడుకోవాలని భావిస్తున్నారు. నగరంలో 30 వేల గృహాలు అనధికారికంగా నిర్మించినట్లు లెక్కతేల్చారు.

 కొండప్రాంతాలపై దృష్టి
 బిల్డింగ్ రెగ్యులరైజ్ స్కీం(బీఆర్‌ఎస్) అస్త్రాన్ని వీటిపై ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్లాన్ లేని ఇళ్ల నుంచి వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని 16 డివిజన్లలో కొండప్రాంతాలపై 40 వేల ఇళ్లు ఉన్నాయి. సింగ్‌నగర్, పాయకాపురం, కృష్ణలంక ప్రాంతాల్లో సుమారు 20 వేల ఇళ్లకు ప్లాన్‌లు లేవని ప్రాథమిక అంచనా. వీటి నుంచి వందశాతం ఆస్తిపన్ను వసూలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

  ఒకటో సర్కిల్ పరిధిలోని కొండప్రాంతాల రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం గృహాలు ఎన్ని, ఆస్తిపన్ను ఎంత మంది చెల్లిస్తున్నారనే వివరాలతో కూడిన నివేదికను కమిషనర్‌కు ఇవ్వనున్నారు. త్వరలోనే రెండు, మూడు సర్కిళ్లలో కూడా సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 రీసర్వేకు రంగం ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి గృహ సముదాయాల కొలతల్లో భారీ వ్యత్యాసం ఉందని, కాబట్టి నగరంలో రీ సర్వే చేయాలని డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు.

 త్వరలోనే రీ సర్వే చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పైకి ఆస్తిపన్ను పెంచమని చెబుతూనే పాలకులు పక్కదారులు వెతకడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. మొత్తంమీద త్వరలోనే అడ్డదారిలో  ఆస్తిపన్ను బాదుడు మొదలు కానున్నట్లు వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement