- ప్రాజెక్టు పూర్తికాకపోవడంపై కేంద్రమంత్రి వెంకయ్య అసహనం
- గృహ నిర్మాణ శాఖకు బదిలీ చేయాలని రాష్ర్ట మంత్రి నారాయణ సూచన
సాక్షి, విజయవాడ : గుదిబండగా మారిన హౌసింగ్ ప్రాజెక్టును వదిలించుకునేందుకు విజయవాడ నగరపాలక సంస్థ సిద్ధంగా ఉన్నా, దాన్ని గృహ నిర్మాణ శాఖ తీసుకుంటుందా.. లేదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకంలో భాగంగా నగరంలోని పేదలకు ఇళ్లు కట్టించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.
ఈ బాధ్యత గృహ నిర్మాణ శాఖది అయినప్పటికీ ఆ బాధ్యతను కార్పొరేషన్ తలకెత్తుకుని ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది. నాలుగు దశల్లో సుమారు 28,156 ఇళ్లను నిర్మించే లక్ష్యంతో జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకం కింద ఈ ప్రాజెక్టును కార్పొరేషన్ ప్రారంభించింది. ఇప్పటివరకు 13,162 ఇళ్లు పూర్తయ్యాయి. ఇందులో 8,767 ఇళ్లు పేదలకు కేటాయించారు. రూ.872 కోట్ల వ్యయంతో నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా రూ.560 కోట్లకు కుదించుకున్నారు.
అయినప్పటికీ నిధులు తగినంత అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఇళ్లు నిర్మించకుండానే ఆపేశారు. ఈ పథకం కాలపరిమితి ముగిసినప్పటికీ ఇక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడం, నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించకపోవడంపై కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ప్రాజెక్టు చేతులు మారుతుందా?
ఈ ప్రాజెక్టును కార్పొరేషన్ నుంచి గృహ నిర్మాణశాఖకు బదిలీచేయాలని మున్సిపల్ మంత్రి నారాయణ సూచించారు. దీనికి కార్పొరేషన్ అధికారులు సుముఖంగానే ఉన్నారు. ఈ ప్రాజెక్టును హౌసింగ్ శాఖ తీసుకుంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి కార్పొరేషన్‌కు ఆదాయం రాకపోయినా ప్రతి నెల సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేస్తూ జక్కంపూడి హౌసింగ్‌లో పేదలకు మంచీనీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పిస్తోంది. పేదల బస్తీ కావడంతో శానిటేషన్ సమస్యల కూడా ఉంటోంది. వీధి దీపాలు, మౌలిక సదుపాయాల కల్పన, పేదలకు వైద్యసేవలు తదితర ఖర్చులతో తడిసి మోపుడవుతున్నా ఆదాయం మాత్రం దానికి తగినట్లు రావడం లేదు. నివసించే వారంతా పేదలు కావడంతో పన్నులు చెల్లించడం లేదు.
కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు పైన బకాయి....
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకం కింద లబ్ధిదారుడికి రూ.30 వేలకు ఇళ్లు కేటాయిస్తారు. ఇందులో రూ.10 వేలు లబ్ధిదారులు చెల్లిస్తే రూ.20 వేలు బ్యాంకు లోను ఇప్పించేవారు. బ్యాంకు రుణం తీసుకుని చెల్లించకపోవడంతో పేదలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకురావడం లేదు. దీనికితోడు ఖర్చులు పెరగడంతో ప్రస్తుతం లబ్ధిదారుడు రూ.66 వేలు చెల్లిస్తేనే ఇళ్లు కేటాయిస్తారు. ఇప్పటివరకు కేటాయించిన ఇళ్లు, మిగిలిన ఇళ్లకు కలిపి నగరపాలక సంస్థకు రూ.92 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.24.5 కోట్లు మాత్రమే వచ్చినట్లు కార్పొరేషన్ అధికారులు లెక్కలు చెబుతున్నారు.