ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖవిద్యా సంస్థల అధినేత పి.నారాయణకు చెందిన సంస్థలపై సీఐడీ అధికారులు చేసిన దాడులలో సంచలన విషయాలే వెలుగులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. నిజానికి ఎప్పుడో వీరు కనిపెట్టి ఉండాల్సింది. అయినా న్యాయపరమైన చిక్కులు, తెలుగుదేశం పార్టీకి ఉన్న మేనేజ్ మెంట్ స్కిల్స్ నేపథ్యంలో సీఐడీ స్లో గా వెళుతోందనినుకోవాలి. చాలా కాలం క్రితమే రాజధాని భూముల కుంభకోణంపై కేసులు నమోదు అయ్యాయి.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా కేసు పెట్టినా, దానిని ముందుకు తీసుకువెళ్లడానికి పోలీసులు వెనుకాముందాడుతున్నారని చెప్పాలి. ఆయనకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. తాజాగా నారాయణకు చెందిన ఎన్‌స్పైర్ అనే సంస్థలో పోలీసులు సోదాలు జరపగా, ఆయన నడుపుతున్న షెల్ కంపెనీల బాగోతం కూడా బయటపడిందట. రెండు కంపెనీల పేరుతో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎన్ స్పైర్లో పెట్టారట. అక్కడ నుంచి ఆ డబ్బు నారాయణ బంధువుకు చెందిన రామకృష్ణ హౌసింగ్‌కు బదలాయించారు. ఇదంతా అస్సైన్డ్ భూముల కొనుగోలులో వెచ్చించారట.. ఇదంతా బ్లాక్ మనీగా భావిస్తున్నారు.
అస్సైన్డ్ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. ఆ పాయింట్ ఆధారంగా నారాయణ బినామీలు పెద్ద ఎత్తున బలహీనవర్గాలను భయపెట్టి ఉండాలి. ఆ తర్వాత తాము ఇంత మొత్తం ఇస్తామని చెప్పి వారికి ఆశ కల్పించి ఆ భూములను పొందారన్నది సమాచారం. తదుపరి ఆ భూముల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చారు. తద్వారా అస్సైన్డ్ భూములు వారు స్వాధీనం చేసుకోగలిగారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు విచారణ చేపట్టిన సిఐడికి పలు సంచలన విషయాలు తెలిశాయి. ఇందులో పెద్ద ఎత్తున నల్లధనం వెచ్చించారని కనుగొన్నారు. నిజానికి అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్ లోనే ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లింది.
ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎకరా పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఉండేది. పచ్చటి పొలాలు ఉన్న భూములు. ఏడాదికి మూడు పంటలు పండుతాయి. అలాంటి భూములలో రాజధాని పెట్టవద్దని కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటి స్పష్టంగా సూచించినా, చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా భూ సమీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీశారు. అందులో భాగంగా ప్రభుత్వ భూమి ఇరవై ఏకరాలతో పాటు ప్రైవేటు భూములు ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించారు. అందుకు ప్రతిఫలంగా సంబంధిత రైతులకు వారి అర్హతను బట్టి ఎకరాకు యాభై వేల రూపాయల కౌలు, 1450 గజాల వరకు స్థలం కేటాయింపు వంటివి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఒప్పందం ఆధారంగా అనేక మంది రైతులు తమకు వచ్చే ప్లాట్లను ముందుగానే అమ్ముకున్నారు. కొంతమంది తమ పొలాలను అమ్ముకోగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి వారు ప్లాట్లు పొందడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం రోడ్లు,డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చవలసి ఉంటుంది. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలను వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినది కాదు. స్థోమతకు మించిన పని . రాజధాని కి సంబందించిన కార్యాలయాలు అది కూడా అసెంబ్లీ, సచివాలయం వంటివి తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించారు.
ఇదిలా ఉండగా, రాజదాని గ్రామాలలో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ సైడ్ ట్రేడింగ్ తో పలువురు టిడిపి నేతలు ఈ భూములను ముందుగానే కొనుగోలు చేసి లాభాలు పొందడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా వీరిలో అత్యధికులు నల్లధనాన్నే ఎక్కువగా వెచ్చించారు. ఒక పక్క ఎకరా భూమి కోటి రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయలకు పెరిగిందని ఘనంగా చంద్రబాబు, మంత్రి నారాయణ వంటివారు చెబుతుండేవారు. అంటే దాని అర్దం ఏమిటి? ఒకపక్క రాజధాని గ్రామాలలో భూముల రిజిస్ట్రేషన్ విలువ గజం ఐదువేల రూపాయలు కాగా, మార్కెట్ విలువ మాత్రం నలభై,ఏభై వేలకు ఉండేది. దాంతో సుమారు ముప్పైవేల నుంచి ముప్పై ఐదు వేల మేర బ్లాక్ మనీని చెల్లించి భూములు కొన్నారన్నమాట. పైగా భూములు అమ్మిన రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడానికి వీలుగా కేంద్రాన్ని ఒప్పించారు. ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని వేల కోట్ల నల్లధనం చలామణి అయిందని అంచనా. ఆ విషయాలు అన్నీ అప్పుడే అందరికి తెలుసు.
చంద్రబాబు అప్పట్లో మోదీ ప్రభుత్వం నియమించిన నల్లధనం వ్యతిరేక కమిటీకి ఆధ్వర్యం కూడా వహించారు. చిత్రం ఏమిటంటే అమరావతిలో మొత్తం నల్లధనం వ్యాపారాన్ని ఆయనే ప్రోత్సహించారు. ఇప్పుడు సిఐడి విచారణలలో ఆధార సహితంగా బయటకు వస్తున్నాయి. ఒక్క నారాయణకు చెందిన షెల్ కంపెనీలే ఈ అస్సైన్డ్ భూములలో వెయ్యి కోట్ల నల్లధనం ఖర్చు చేసిందని అంచనా.
ఈ లెక్కన మొత్తం జరిగిన లావాదేవీలలో ఎన్నివేల కోట్ల నల్లధనం చలామణి అయి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంతలో ప్రభుత్వం మారడంతో మొత్తం కధ అడ్డం తిరిగింది. వైసిపి ప్రభుత్వం అమరావతి భూ సమీకరణలో , ఇన్ సైడ్ ట్రేడింగ్ లో పెద్ద స్కామ్ లు జరిగాయని కేసులు పెట్టడం, టిడిపి నేతలు కోర్టు నుంచి రక్షణ పొందడం జరిగింది. గత మూడేళ్లుగా ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన టీడీపీ నేతలకు ఇది జీర్ణించుకోలేని విషయంగానే ఉంది. దానికి తోడు ఈ నల్లధనం వ్యవహారం ముందుకు వస్తే అది ఎటువైపు దారితీస్తుందన్న భయం వారిలో ఉంది. దానికి తగ్గట్లే నారాయణ సంస్థల బినామీ బాగోతాన్ని సిఐడి కనుగొంది. ఈ కేసు ముందుకు వెళుతుందా? లేక యధాప్రకారం కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటారా అన్నది చూడాల్సిందే.
- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment