రాజధాని ప్రతిపాదనలతో హస్తినకు నారాయణ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్‌తో భేటీ కానున్నారు. నారాయణ ఈ సందర్భంగా రాజధానిపై ప్రభుత్వ ప్రతిపాదనలు అందచేయనున్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలి, చేపట్టాల్సిన నిర్మాణాలు, ఇతరత్రా సదుపాయాలు, ఇందుకయ్యే వ్యయం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నివేదికను ఆయన కేంద్ర కమిటీకి అందించనున్నారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని రూపురేఖలు, నిర్మాణానికి సలహాల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ‘రాజకీయ’ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడుకు సన్నిహితులైన మంత్రి నారాయణ నేతృత్వంలోని ఈ కమిటీలో రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), గల్లా జయదేవ్‌లిద్దరూ పారిశ్రామికవేత్తలే. టీడీపీ ఎంపీలైన వీరిద్దరూ చంద్రబాబుకు సన్నిహితులే. ఈ కమిటీలో ఇతర రంగాల నిపుణులకు చోటు కల్పించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మరో పక్క విజయవాడ - గుంటూరు మధ్యనే రాజధాని అంటూ ముఖ్యమంత్రితోసహా మంత్రులంతా ఇప్పటికే పలుమార్లు ప్రకటించి గందరగోళం సృష్టిస్తున్నారు.