రామప్పపై ఏఎస్‌ఐ మంట!  | Warning of danger to Ramappa temple with mines | Sakshi
Sakshi News home page

రామప్పపై ఏఎస్‌ఐ మంట! 

Published Thu, May 25 2023 4:20 AM | Last Updated on Thu, May 25 2023 10:32 AM

Warning of danger to Ramappa temple with mines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూపాలపల్లి జిల్లా  వెంక­­టా­పూర్‌ సమీపంలో సింగరేణి సంస్థ ప్రతి­పాదించిన ‘పీవీ నరసింహారావు భూఉపరితల గనుల (ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌)’ అంశం వివాదానికి కారణమైంది. ఇప్పటికే ప్రతిపాదిత గనులతో అక్కడికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ముప్పు వస్తుందన్న అభ్యంతరాలు ఉన్నాయి. అలాంటిది బొగ్గు గనుల ఏర్పాటు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీపై కేంద్ర పురావస్తుశాఖ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం 
రామప్ప దేవాలయం ఇటీవలే యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపద హోదా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా రామప్ప ఆలయం రికార్డు సృష్టించింది. దీనికి సమీపంలోనే సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలకు ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి సంబంధించి బెంగళూరులోని ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) ప్రాంతీయ కార్యాలయం ఎన్‌ఓసీ జారీకి సానుకూలత వ్యక్తం చేసింది.

నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టి­ట్యూట్, ది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మైనింగ్‌ ఇంజనీరింగ్‌లను సంప్రదించి.. సింగరేణి హామీల ఆధారంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కానీ దీనిపై రామప్ప ఆలయ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న ‘ది పాలంపేట ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ’ విస్మయం వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన యునెస్కో గుర్తింపు సాధించిన తరుణంలో, దానికి విఘాతం కలిగించే ఏ చిన్న చర్యను కూడా ఉపేక్షించకుండా అభ్యంతరం చెప్పాల్సిన ఏఎస్‌ఐ.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింది.

ఈ అథారిటీలో కీలక సభ్యత్వమున్న కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు బొగ్గు గనులు ప్రారంభమైతే రామప్ప ఆలయానికి జరిగే నష్టం ఏమిటో తేల్చాలని నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌జీఆర్‌ఐ), జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ)లను పాలంపేట డెవలప్‌మెంట్‌ అథారిటీ కోరింది. దీనితోపాటు బొగ్గు గనులతో జీవావరణం, సామాజిక, ఆర్థిక ప్రభావంపై అధ్యయనం చేయాలని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ను కోరాలని నిర్ణయించింది. ఈ సంస్థలు తేల్చే అంశాల ఆధారంగా బొగ్గు గనుల తవ్వకం ఆధారపడి ఉంది. 

మూడు కీలక అంశాలతో.. 
పాలంపేట డెవలప్‌మెంట్‌ అథారిటీ భేటీలో కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు పక్షాన ప్రొఫెసర్‌ పాండురంగారావు ప్రధానంగా మూడు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బొగ్గు గనుల తవ్వకం వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు. 

శాండ్‌ బాక్స్‌ పునాదుల్లోంచి ఇసుక జారిపోయే ప్రమాదం 
రామప్ప దేవాలయాన్ని నాటి కాకతీయ నిపుణులు శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీతో నిర్మించారు. భూకంపాలు వంటి కుదుపులు ఏర్పడ్డా.. నిర్మాణానికి ఇబ్బంది రాకుండా పునాదుల్లో ఇసుకను నింపారు. ఆలయ ప్రదక్షిణ పథం నుంచి దిగువకు దాదాపు 18 అడుగుల మందంతో ఇసుక ఉంది. ఈ ఇసుక పదిలంగా ఉంటేనే నిర్మాణం స్థిరంగా ఉంటుంది.

రామప్ప ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతు వరకు బొగ్గు గనులను తవి్వతే.. భూమి పొరల్లో నీటి ప్రవాహ దిశను మార్చే కదలికలు (హైడ్రాలిక్‌ గ్రేడియంట్స్‌) ఏర్పడుతాయి. రామప్ప ఆల­యం ఎగువన దాదాపు 3 టీఎంసీల సామర్ధ్యమున్న రామప్ప చెరువు ఉంది. హైడ్రాలిక్‌ గ్రేడియంట్స్‌ వల్ల చెరువు నీళ్లతో ఆలయ పునాదుల్లోని ఇసుకను కోత గురై.. క్రమంగా ఆలయ పునాదులు అస్థిరమయ్యే ప్రమాదం ఉంది. 

గని ఉన్నంత కాలం కంపనాల ప్రభావం 
బొగ్గు గనుల్లో నిరంతరం పేలుళ్లు జరుపుతూ ఉంటారు. 300 మీటర్ల లోతు వరకు తవ్వే క్రమంలో జరిపే పేలుళ్లు భూమి పొరల్లో కంపనాలు సృష్టిస్తాయి. రామప్ప ఆలయ నిర్మాణం నాజూకుగా ఉంటుంది. పేలుళ్ల కంపనాల వల్ల రాళ్లలో కదలికలు ఏర్పడి కట్టడం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుంది. 

బొగ్గు తరలింపు ధూళితో ఆలయ నిర్మాణానికి ప్రమాదం 
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌.. సమీపంలోని నూనె శుద్ధి కర్మాగారాల కాలుష్యం వల్ల దెబ్బతింటున్నట్టు ఇప్పటికే తేలింది. ఇప్పుడు రామప్పకు గనుల తవ్వకం, లారీల్లో బొగ్గు తరలింపుతో.. ధూళి కణాలు రామప్ప ఆలయం మీద పడుతూ.. రసాయనిక చర్యకు కారణమవుతాయి. ఇది నిర్మాణానికి ప్రమాదం తెచ్చి పెడుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement