కుంగిపోతున్న శివలింగం
రామప్ప గర్భగుడికి పొంచి ఉన్న ముప్పు
‘సోమసూత్రం’ మూసుకుపోవడమే కారణం
వెంకటాపురం: కాకతీయులు 800 ఏళ్ల క్రితం నిర్మించిన వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయానికి ముంపు పొంచి ఉంది. ఈ ఆలయాన్ని పాలకులు పట్టించుకోకపోవడంతో పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆలయంలోని శివలింగం కుంగిపోతోందని భక్తులు అంటున్నారు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట శివారులో చరిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని 1213 సంవత్సరంలో కాకతీయులు నిర్మించారు. కేవలం ఇసుకనే పునాదిగా చేసుకుని ఈ ఆలయం నిర్మితమైంది. కార్తీక మాసం, శ్రావణ మాసాలతోపాటు శివరాత్రి సందర్భంగా ఇక్కడ వైభవంగా పూజలు జరుగుతారుు.
ఇక్కడ భక్తులు ప్రతిరోజు శివలింగానికి అభిషేకం, అర్చన పూజలు నిర్వహిస్తారు. పంచామృతాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనే, చక్కెరలతో శివలింగానికి అభిషేకం చేసి మొక్కులు చెల్లిస్తారు. అభిషేకం చేసిన తర్వాత నీరు నిలవకుండా గర్భగుడి నుంచి బయటకు నీరు వెళ్లేందుకు కాకతీయులు సోమసూత్రం(ప్రత్యేక రంధ్రం) ఏర్పాటు చేశారు. అరుుతే, ఈ రంధ్రం 30 ఏళ్లుగా మూసుకుపోవడంతో జలాభిషేకం, పాలాభిషేకం సందర్భంగా శివలింగంపై పోసే నీరు, పాలు గర్భగుడిలోనే నిలుస్తోంది. అంతేకాకుండా, ఆలయ పూజారులు రోజూ ఉదయాన్నే శివలింగాన్ని నీటితో శుద్ధి చేసి ముస్తాబు చేస్తారు.
ఈ నీరంతా బయటకు వెళ్లకుండా గర్భగుడిలోనే ఇంకిపోతుండడంతో గర్భగుడి కింద ఉన్న ఇసుక కుంగిపోయి శివలింగం ఓ పక్కకు ఒరుగుతోందని గ్రామస్తులు, భక్తులు, ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. నీరు నిలిచి ఉండడంతో గర్భగుడి దుర్గంధం వెదజల్లుతోందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సోమసూత్రాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర పురావస్తుశాఖ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా శాఖలకు చెందిన స్థానిక సిబ్బందే బాహాటంగా విమర్శిస్తున్నారు.