తెలంగాణకే తలమానికమైన అపురూపమైన వరంగల్ రామప్ప దేవాలయం మళ్లీ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినందుకు ప్రతి తెలుగువాడూ, భారతీయుడూ ఎంతో సంతోషించారు. ఆ సంతోషాన్ని సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టింగ్ పనులు ఆవిరి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆర్కియ లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) పరిరక్షణ, నిర్వహణలో ఈ కట్టడం ఉంది. అది యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందటంలో చూపిస్తున్న శ్రద్ధ కట్టడ పరిరక్షణలో చూపడం లేదు. 2010లో కోస్టల్ కంపెనీ దేవాదుల సొరంగం తవ్వకాలు చేపట్టిన తరుణంలో అది పేల్చిన బాంబుల కారణంగా రామప్ప గుడి విలవిల లాడి గోడలు బీటలు వారిన విషయం సర్వదా విశదమే. ఈ విధ్వంసాన్ని అతి విషాదకరంగా పలు పత్రికలు ప్రపంచానికి వెల్లడి చేసినా ఏఎస్‌ఐ అంతగా ప్రతిస్పందించ లేదనే విమర్శ ఉంది.
దీంతో కళాకారులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, ప్రజాసంఘాల వారు ‘రామప్ప పరిరక్షణ కమిటీ’గా ఏర్పడి ఆందోళనలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ రామప్ప గుడి చుట్టూ ఇరవై కి.మీ.ల దూరంలోని వెంకటాపురం, నల్లగుంట, పెద్దాపురం తదితర గ్రామాల పరిధిలో ఓపెన్ కాస్టు తవ్వకాలు జరుపడానికి సంవత్సరానికి మూడు పంటలు పండే పంట పొలాలను సర్వేచేసి స్వాధీనం చేసుకునే దిశలో సింగరేణి ఉండగా ‘రామప్ప పరిరక్షణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి సింగరేణి కంపెనీ అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సద్దుమణగ చేశారు. ఇదే సమయంలో ఏఎస్‌ఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదన పత్రాలు యునెస్కోకు వెళ్లడం, రెండు సార్లు తిరస్కరణకు గురికావడం... చివరికి ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పకు గుర్తింపు పొందడం తెలిసిందే.
కాగా సంవత్సరం క్రితం ‘మళ్ళీ ఓపెన్ కాస్టు తవ్వకాలు ప్రారంభం’ అనే వార్త వచ్చింది. రామప్ప పరిరక్షణ కమిటీ , ఇతర ప్రజా సంఘాలూ తిరిగి ఆందోళన వ్యక్తం చేయడంతో సింగరేణి కంపెనీ యాజమాన్యం రామప్ప గుడి పరిసరాల్లో ఓపెన్ కాస్టులు తవ్వబోమని మీడియా ద్వారా హామీ ఇచ్చింది. అయితే మళ్ళీ రామప్పగుడికి ఓపెన్ ముప్పు రానున్నదనీ, పరిసర గ్రామాల్లో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్టుకు సంబం ధించిన సర్వేలు చేస్తున్నారనే విషయం వెలుగు చూసింది. అందుకే ఈ ప్రయత్నాలను పత్రికా ముఖంగా కమిటీ ఖండిస్తున్నది. (క్లిక్ చేయండి: వేయి రేఖల వినూత్న సౌందర్యం)
– నల్లెల్ల రాజయ్య తదితర ‘రామప్ప పరిరక్షణ కమిటీ’ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment