Ramappa Temple: మైనింగ్‌తో ముప్పు లేదు | Singareni Management Said No Effect On Ramappa Temple With Mining | Sakshi
Sakshi News home page

Ramappa Temple: మైనింగ్‌తో ముప్పు లేదు

Published Sat, Jul 31 2021 7:50 AM | Last Updated on Sat, Jul 31 2021 7:51 AM

Singareni Management Said No Effect On Ramappa Temple With Mining - Sakshi

రామప్ప ఆలయం (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపికైన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని కొన్ని ప్రచార మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని సింగరేణి యాజమాన్యం తెలిపింది. సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో ప్రారంభించాలని భావిస్తున్న ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు.. కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని, తాజాగా యునెస్కో రామప్పను వారసత్వ సంపదగా ప్రకటించిన నేపథ్యంలో వెంకటాపురం ప్రాజెక్టుపై మరింత సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుందని యాజమాన్యం వివరించింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణి.. తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి చిన్న నష్టం కూడా చేకూర్చే ఎటువంటి ప్రతిపాదన చేయబోదని, గుడి పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటుందని తెలిపింది. దీనిపై అవాస్తవాలు నమ్మవద్దని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. 

రామప్ప అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి
అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: రామప్ప ఆలయ సమీపంలో ఉన్న చరిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి, కాకతీయ హెరిటేజ్‌ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని హెరిటేజ్‌ శాఖ అధికారులను పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. శుక్రవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో రామప్ప ఆలయంపై ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, హెరిటేజ్‌ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. యునెస్కో సూచించిన గైడ్‌లైన్స్‌పై, డిసెంబర్‌ 2022లో సమర్పించాల్సిన సమగ్ర నివేదికపై మంత్రి చర్చించి పలు సూచనలులిచ్చారు.

రామప్ప ఆలయంలో కేంద్ర ఆర్కియాలజీ శాఖకు చెందిన స్థలం వాటి సరిహద్దులు గుర్తించాలని, అలాగే ఆలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. రామప్ప ఆలయం, చెరువు, కాలు వలకు చట్టబద్ధత కల్పించే విషయంపై యునెస్కో వారికి డిసెంబర్, 2022 లోపల ప్రణాళికలను సమర్పించాలన్నారు.  సూపరింటెండెంట్‌ ఆర్కియాలజిస్ట్‌ స్మిత ఎస్‌ కుమార్, వైఏటీసీ జాయింట్‌ సెక్రటరీ రమేశ్, హెరిటేజ్‌ ఉన్నతాధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు పాల్గొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement