సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమగ్ర పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరులో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడం రామప్ప దేవాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన చార్మినార్, గోల్కొండ, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క–సారలమ్మ, ప్రకృతి పండుగ బతుకమ్మ మొదలైన అరుదైన ప్రత్యేకతలు తెలంగాణ సొంతమని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు టెంపుల్ టూరిజంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా రూ. 14 వందల కోట్లతో నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు తగిన ప్రోత్సాహకాలను అందించాలని కేంద్రాన్ని కోరారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, అభివృద్ధి చేయటానికి తగిన సహకారాన్ని అందించాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment