సాక్షి, హైదరాబాద్: రామప్ప దేవాలయం ప్రపంచవారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొంది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ, కాకతీయుల హయాంలోనే నిర్మితమై, ‘ఇంత మంచి నిర్మాణం ఉండగా రామప్పనే ఎందుకు ఎంచుకున్నారు’అని యునెస్కో ప్రతినిధితోనే అనిపించుకున్న వరంగల్ నగరంలోని వేయిస్తంభాల దేవాలయం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. శిథిలమై పడిపోయే స్థితికి చేరిందన్న ఉద్దేశంతో వేయిస్తంభాల రుద్రేశ్వరాలయానికి దక్షిణం వైపు ఉన్న నాట్యమండపాన్ని పునర్నిర్మించేందుకు విప్పదీసి దశాబ్దన్నర గడుస్తున్నా తిరిగి నిర్మించలేక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) విభాగం చతికిలబడింది. కేవలం 18 నెలల్లో నిర్మిస్తానని చెప్పి, 16 ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయలేక అభాసుపాలవుతోంది.
ఇదీ సంగతి..
కాకతీయుల నిర్మాణాల్లో వేయిస్తంభాల గుడి అగ్రపథాన ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణశైలి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 800 ఏళ్ల క్రితమే ఆ నిర్మాణంలో శిల్పులు చూపిన ప్రతిభ అబ్బురపరుస్తోంది. శివాలయం, దాని పక్కనే నాట్యమండపం ఉన్నాయి. రెండింటిలో కలిపి వేయిస్తంభాలు ఉండటం విశేషం. కానీ, కాలక్రమంలో నాట్యమండపం శిథిలమవుతూ వస్తుండటంతో దాన్ని తిరిగి పూర్వవైభవం తెస్తామంటూ ఏఎస్‌ఐ 2005లో విప్పదీసింది. వెంటనే పనులు మొదలుపెట్టి 18 నెలల్లో పూర్తిచేస్తామని పేర్కొని కసరత్తు ప్రారంభించింది. రెండుమూడేళ్ల విరామంతో ఎట్టకేలకు పనులు ప్రారంభించింది. నాలుగేళ్లపాటు నిపుణుల ఆధ్వర్యంలో శ్రమించి 80 శాతం పనులు పూర్తి చేశాక అర్ధంతరంగా ఆగిపోయాయి.
క్రేన్ తెచ్చిన తంటా..
అలనాటి నిర్మాణంలో వాడిన రాళ్లనే యథావిధిగా తిరిగి వినియోగించేందుకు వాటిపై నంబర్లు వేసి పెట్టారు. ఆ రాళ్లనే తిరిగి పాత నిర్మాణశైలిలో క్రమపద్ధతిలో పేర్చి, డంగు సున్నం మిశ్రమాన్ని బైండింగ్‌కు వాడి పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ 50 టన్నులు, 12 టన్నుల సామర్థ్యం ఉన్న రెండు క్రేన్లను అద్దెకు తెచ్చి పనులు చేపట్టగా, ఏఎస్‌ఐకి సొంత క్రేన్ ఉండగా అద్దె క్రేన్లు ఎందుకు వాడారంటూ అధికారులు అభ్యంతరం చెప్పి బిల్లులు నిలిపివేశారు. అయితే అప్పటికే దాదాపు రూ.ఏడు కోట్ల వ్యయంతో 80 శాతం పనులు పూర్తిచేయడం, క్రేన్లకు సంబంధించిన రూ.కోటిన్నర బిల్లులు రాకపోవటంతో కాంట్రాక్టర్ పనులు నిలిపేశారు. దాన్ని కొలిక్కి తెచ్చే బాధ్యతను ఉమ్మడి ఏపీ సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు కృష్ణయ్యకు అప్పగించారు. అయితే కొద్దిరోజులకే ఆయ న మృతి చెందటంతో ఇక ఆ కసరత్తు కంచికి చేరింది. కాగా, తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి ఇప్పుడు కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉండటంతో వేయిస్తంభాల దేవాలయ మండప పునర్నిర్మాణం కొలిక్కి వస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
భారీగా పెరిగిన ఖర్చు..
క్రేన్‌ల వినియోగానికి అనుమతుల విషయంలో ఏర్పడ్డ గందరగోళం ఇప్పుడు ఖర్చును భారీగా పెంచేందుకు కారణమవుతోంది. కేవలం రూ.కోటి వ్యయంతో మిగతా పనులు పూర్తిచేయాల్సిన తరుణంలో, ఇప్పుడు దాని ఖర్చు ఏకంగా రూ.6 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రూఫ్ బీమ్‌లు ఏర్పాటు చేసి పైకప్పు నిర్మించాల్సి ఉంది. దీనికి రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
13 స్తంభాలు గల్లంతు
నాట్యమండపంలోని పైకప్పునకు ఆధారంగా 132 స్తంభాలున్నాయి. విప్పదీసినప్పుడు వాటికి నంబర్లు వేసి పెట్టారు. కానీ, ఇప్పుడు 119 స్తంభాలే లెక్కతేలాయి. మిగతా 13 గల్లంతు కావటంతో కొత్తగా వాటిని తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment