రికార్డు ‘కబ్జా’ | categories changes in the without information | Sakshi
Sakshi News home page

రికార్డు ‘కబ్జా’

Published Thu, Oct 2 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

రికార్డు ‘కబ్జా’

రికార్డు ‘కబ్జా’

రఘునాథపాలెం మండలంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు హాంఫట్
ఖమ్మం మున్సిపాలిటీకి చెందిన 100 ఎకరాల భూమి హుష్‌కాకి
ఎన్నెస్పీ భూమి కనిపిస్తే కబ్జానే..
చెరువు శిఖం, సీలింగ్, ఇనాం భూముల్లోనూ ఉల్లంఘనలు
లక్ష్మీనర్సింహస్వామి,ఆంజనేయస్వామి గుడి భూములూ స్వాహా
అనుమతుల్లేకుండానే కేటగిరీల మార్పు
ఏకంగా ఇంటి నంబర్లే ఇచ్చేసిన మున్సిపల్ అధికారులు
రిజిస్ట్రేషన్ల కోసం చేతులు మారిన కోట్ల రూపాయలు
‘ఆపరేషన్ భూరైడింగ్’లో వెల్లడయిన ప్రాథమిక సమాచారం
  సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అది గుడి భూమి అయినా.. బడి భూమి అయినా.. ఇనాం భూమి అయినా.. సీలింగ్ భూమి అయినా... చెరువు శిఖమయినా... మున్సిపాలిటీదైనా, నాగార్జునసాగర్ కాల్వదైనా... కబ్జాకు కాదేదీ అనర్హం అనుకున్నారో ఏమో... జిల్లా కేంద్రానికి ఆనుకుని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా భాగమై ఉన్న రఘునాథపాలెం మండలంలో భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేశారు. ప్రభుత్వ భూములంటే మరీ అలుసన్నట్టు ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ఉల్లంఘనలు జరిగాయి. ఇదేదో సాదాసీదాగా చెపుతున్నది కాదు...

జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ నేతృత్వంలో గత నెల 26, 27 తేదీల్లో రెవెన్యూ సిబ్బంది మూకుమ్మడిగా నిర్వహించిన సర్వేలో ప్రాథమికంగా వెల్లడయిన వాస్తవమిది. ఈ సర్వేలో వెల్లడయిన అంశాల్లోని విశ్వసనీయ వివరాల ప్రకారం ఒక్క రఘునాథపాలెం మండలంలోనే దాదాపు 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. ఇందులో పేదలకు అసైన్ చేసిన భూముల నుంచి ఇనాం భూముల వరకు ఉన్నాయి. ఎలాంటి ఎన్‌వోసీలు, ఓఆర్‌సీలు లేకుండా ఏకంగా పట్టాదారుల పేర్లు మారిపోవడం, ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరికి భూ మార్పిడి చేయడం.. చెరువు భూముల్లో ఇళ్లు కట్టుకున్నా మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు ఇవ్వడం బట్టి చూస్తే ఇక్కడ జరుగుతున్న భూదందా ఏపాటిదో అర్థమవుతోంది.

అసలు ప్రభుత్వ రికార్డుల్లో ఒకటి ఉంటే వాస్తవంగా ఆ భూమిలో మరో రకమైన కార్యకలాపాలు జరుగుతుండడం గమనార్హం. మిగితా భూములను రిజిస్టర్ చేసిన దాని కన్నా ఇలాంటి స్థలాలను రిజిస్టర్ చేసుకోవడం మామూలు విషయం కాదని, ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. మొత్తం మీద కేవలం రెండు రోజుల పాటు కొందరు సిబ్బంది కలిసి ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలోనే పెద్ద ఎత్తున ఉల్లంఘనలు వెలుగులోకి వస్తే, ఈ వివరాల సేకరణను ఒక ప్రాజెక్టుగా తీసుకుని సర్వే చేస్తే ఇంకా ఎంత భూమి బయటకు వస్తుందో, ఎంతమంది కబ్జాసురులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల లీలలు వెలుగులోనికి వస్తాయోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
త్వరలోనే నోటీసులు...
ఆపరేషన్ భూరైడింగ్ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ఉల్లంఘనలుగా తేలిన భూముల్లో ఉన్న వారికి త్వరలోనే నోటీసులు అందజేస్తామని రెవెన్యూ వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి. ఇది కేవలం ప్రాథమికంగా తెప్పించిన సర్వేనేనని, దీనిలో చాలా భూములపై మరోసారి తనిఖీ ఉంటుందని, ఇందుకోసం త్వరలోనే డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించాయి. ఈ భూముల సర్వేకు సంబంధించి వచ్చిన సమాచారాన్నంతటినీ క్రోఢీకరించి విభాగాలు, కేటగిరీల ద్వారా విభజించి అసలు వాస్తవమేంటనే దాన్ని మరోసారి నిర్ధారించుకుంటామని తెలిపాయి.

ఉల్లంఘన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయిన తర్వాతే నోటీసులిస్తామని,  ఈ సర్వేలో వెల్లడైన ఉల్లంఘనకు సంబంధించిన భూములను అనుభవిస్తున్న సంస్థలు, వ్యక్తులు భయపడవద్దని, పూర్తిస్థాయిలో నిర్ధారణ అయిన తర్వాతే చర్యలు తీసుకుంటామని, ఇప్పటివరకు నిర్వహించింది ప్రాథమిక విచారణ మాత్రమేనని రెవెన్యూ అధికారులంటున్నారు.రెవెన్యూ రికార్డుల ప్రకారం నిర్వహించిన సర్వేకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం గ్రామాల వారీగా ఉల్లంఘనలు ఇలా ఉన్నాయి....
 
రఘునాథపాలెం:
సర్వే నెంబర్ 11లో నర్సింహులకుంట చెరువులోని 2 ఎకరాలను కబ్జా చేసి రోడ్డు వేశారు. 218లో ఉన్న 2 ఎకరాల కుంట భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారు. 407లో ఉన్న ఏడెకరాల శిఖం భూమిలో ఏకంగా కాలనీ ఏర్పాటయింది. దాని వివరాలు లభించడం లేదు. 351లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఏడెకరాల భూమిని కబ్జా చేసి వ్యవసా యం చేస్తున్నారు. 355లో శారదా కళాశాల సమీపం లో ఉన్న సీలింగ్ ల్యాండ్‌లో 8 మందికి 2 ఎకరాల భూమిని వ్యవసాయం కోసం అసైన్ చేశారు. దానిలో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయేతర కార్యకలాపాలు సాగుతున్నాయి. 30లో ఎకరం అసైన్డ్ భూమిని కబ్జా చేశారు. 93లో ఎస్సీ కాలనీకి అసైన్ చేసిన 8ఎకరాల 33గుంటల భూమిని వే రే వ్యక్తి అనుభవిస్తున్నారు. 111,112లోని మూడెకరాల గుడి భూమికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద పాస్‌పుస్తకాలున్నాయి. 371 సర్వే నంబర్‌లోని 10 ఎకరాల 35 గుంటల ఇనాం భూములను ప్లాట్లు చేశారు.
 
బల్లేపల్లి:
 సర్వే నెంబర్ 41లో ఉన్న శ్మశానవాటికలో అర ఎకరం కబ్జాకు గురయింది.
 
పాపటపల్లి:
సర్వే నెంబర్ 149లోని 110 ఎకరాల అసైన్డ్ భూమి సేల్‌డీడ్ చేసి వేరే వ్యక్తులు కొనుక్కున్నారు. వారు పేదలయితే అసైన్డ్ కమిటీ ద్వారా నిర్ధారించి వారికే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది. 118లో ఉండాల్సిన చెరువులో 12 ఎకరాల భూమి కనిపించడం లేదు. 89 లో ఉండాల్సిన ఏడెకరాల చెరువు ప్రభుత్వ రికార్డుల్లో ఓ రకంగా ఉంటే వాస్తవంగా వేరే రూపంలో ఉంది.
 
ధంసలాపురం:
సర్వే నెంబర్ 178లో 128 ఎకరాల్లోని చెరువులో 40 ఎకరాల భూమి కబ్జాకు గురయింది. శ్రీరాంహిల్స్‌లోని సర్వే నెంబర్ 49లో హౌసింగ్‌బోర్డుకిచ్చిన స్థలాన్ని బహిరంగ వేలం ద్వారానే విక్రయించినా అందులో 10 శాతం భూమిని పేద వర్గాలకు ఇవ్వాలన్న నిబంధన ను పాటించలేదు.

కోయచెలక:
సర్వే నెంబర్ 192లో 119 ఎకరాల 20 గుంటల భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం అసైన్‌చేశారు. కానీ ఆ భూమిలో ఎలాంటి ఇళ్లు నిర్మించలేదు. అందులో 4ఎకరాల భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారు. ఆరు ప్లాట్లను కబ్జా చేసి పత్తి పండిస్తున్నారు. 149లో ఉన్న 80 ఎకరాల పెద్ద చెరువు శిఖం భూమిలో 7.5 ఎకరాలు కబ్జాకు గురయింది. 150,151, 229 సర్వే నెంబర్లలోని 5ఎకరాల 31 కుంటల ఇనాం భూమిని ఓఆర్‌సీలు లేకుండా అమ్ముకున్నారు.

చిమ్మపూడి:
సర్వే నెంబర్ 48లోఉన్న 195 ఎకరాల అసైన్ భూమిలో 80 శాతం అమ్ముకున్నారు. 20 ఎకరాలు కబ్జా అయింది. 512లోని మూడెకరాలు ఖాళీ జాగా ఉంది. 163లోని 71 ఎకరాల చెరువులో 2 ఎకరాలు కబ్జాకు గురయింది.

మంచుకొండ:
సర్వే నెంబర్ 338లో ఉన్న 211 ఎకరాల ప్రభుత్వ భూమిలో 168 ఎకరాలు అసైన్ చేశారు. దీనిలో 73 ఎకరాల్లో ఉల్లంఘనలున్నాయి. సర్వే నెంబర్ 37లోని 37 ఎకరాల సీలింగ్ భూమి అన్యాక్రాంతమైంది. 282లోని ఎర్రచెరువులో 16 ఎకరాల 60 గుంటల భూమిని 18 మంది కబ్జా చేశారు. 354లో ఉన్న భూమిని ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాల కోసం సేకరించినా.. ఇప్పటికీ ఆ భూమిని అసలు పట్టాదారుడే అనుభవిస్తున్నాడు.

వెలుగుమట్ల:
సర్వే నెంబర్ 548 లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయింది. దీనిపై సమగ్ర సర్వే జరపనున్నారు. 564లో ఉన్న 22 కుంటల కారిజ్‌ఖాతా ఇనాం భూమిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. 565లోని శిఖం భూమిలో 8 ఎకరాలు కబ్జాకు గురయింది. 396 లో ఉన్న రెండెకరాల ఎన్నెస్పీ స్థలంలో రోడ్డు వేసి వెం చర్లు చేస్తున్నారు. 138, 140లో ఉన్న దాదాపు 5 ఎకరాల ఎన్నెస్పీ భూమి కూడా కబ్జాకు గురయింది. దీని ని జాయింట్ సర్వే చేయనున్నారు. 135, 137లో ఉన్న మూడెకరాల ఎన్నెస్పీ భూమిని ఎవరో అమ్ముకున్నారు.

ఖమ్మం రెవెన్యూ:
సర్వే నెంబర్ 123లో ఉన్న 189.33 కుంటల భూమిలో 100 ఎకరాలు మున్సిపాలిటీకి కేటాయిం చారు. అందులో అన్నీ ప్రైవేటు సముదాయాలు వెలి శాయి. థియేటర్లు, కల్యాణమండపాలు నిర్మించారు.

పాకబండ:
సర్వే నెంబర్ 66లోని 34 ఎకరాల 11 కుంటల భూమిని 144 మంది కబ్జా చేశారు. సర్వే నెంబర్ 4లోని 4,500 గ జాల భూమిని దాసాంజనేయస్వామి గుడి కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. అందులో ప్రైవేటు వ్యక్తులు ఇళ్లు కట్టుకున్నారు. మున్సిపాలిటీ వారు ఇంటి నెంబర్లు కూడా ఇచ్చారు.

బుర్హాన్‌పురం:
సర్వే నెంబర్ 105లో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి గుడి భూమిలో 23 ఎకరాలను 400 మంది కబ్జా చేశారు. అందులో ఉన్న ఐదెకరాల ఎన్నెస్పీ భూమి కూడా కబ్జాకు గురయింది. 292,293లోని 4 ఎకరాల 28 కుంటల శిఖం భూమి కూడా కబ్జా అయింది. 5లో మూడెకరాలు ఖబర్‌స్థాన్ కోసమని రికార్డుల్లో ఉంటే అక్కడ పక్కాఇళ్లున్నాయి. ఎస్పీ కార్యాలయం సమీపంలోని 489లో అన్నీ ప్రైవేటు భవంతులు వెలిశాయి. 217లో ఉండాల్సిన 41.25 ఎకరాల ప్రభుత్వ భూమిలో 10 ఎకరాల్లో ఉల్లంఘనలు జరగ్గా 15 ఎకరాలు కబ్జాకు గురయింది. 35, 38, 39, 40 సర్వే నెంబర్లలోని గుంటి మల్లేశ్వరి దేవస్థానంలో 3 ఎకరాలు కబ్జా అయింది.

ఈర్లపూడి:
సర్వే నెంబర్ 554లోని 300 ఎకరాల అసైన్ భూమిని 43 మంది కొనుక్కున్నారు. 73లోని మూకుడికుంట చెరువులో 19 ఎకరాలు కబ్జాకు గురయింది.

వేపకుంట్ల:
సర్వే నెంబర్ 196,197లోని 50 ఎకరాల చెరువు భూముల్లో 20 ఎకరాలను కబ్జా చేశారు. 26లోని ఇనాం భూమిని ఓఆర్‌సీలు లేకుండానే 41 మంది కొనుగోలు చేశారు.

చింతగుర్తి:
సర్వే నెంబర్ 56లో 28 ఎకరాల 30 కుంటల చెరువు శిఖం భూమి ఉంది. ఇందులో 10.28 ఎకరాలు అసైన్ చేశారు. ఈ శిఖం భూమిని ఎలా అసైన్ చేశారు, ఎవరు చేశారనేది తేలాల్సి ఉంది. 266లో ఉన్న 941 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఇందులో సీలింగ్, పట్టా, అసైన్ భూములున్నాయి. దీనిని రీసర్వే చేయనున్నారు.

రేగుల చెలక:
సర్వే నెంబర్ 85లో ఉన్న 25 ఎకరాల్లో మూడు గ్రానైట్ కంపెనీలకు భూమిని లీజుకిచ్చారు. ఈ భూమిలో గ్రానైట్ కంపెనీలు బ్లాస్టింగ్‌లు చేస్తుండడంతో వ్యవసాయం కోసం అసైన్ చేసిన భూముల్లో వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. 57,58,60 సర్వే నెంబర్లలో బల్వత్‌ఇనాం భూములను ఓఆర్‌సీ లేకుండా వ్యవసాయం నుంచి వ్యవసాయేతరానికి బదలాయించారు. 9లో ఉన్న 1.15 కుంటల శిఖం భూమిని 14 మందికి ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. 145లో ఎకరం భూమి కబ్జాకు గురయింది.

ఖానాపురం:
37 సర్వే నెంబర్‌లోని 153 ఎకరాల భూమిలో 86 ఎకరాల 29 కుంటల భూమిని మూడువేల మంది బీపీఎల్ కుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించారు. ఇందులో కేవలం 80 ఇళ్లు మాత్రమే కట్టి ఉన్నాయి. మిగిలిన 67 ఎకరాల భూమిని రెండు మినరల్స్‌కు 20 ఏళ్ల లీజుకిచ్చారు. 94లో ఉన్న ఎకరం భూమి రికార్డుల్లో శ్మశానవాటిక అని ఉండగా, అది ఖాళీగానే ఉంది. 321లో 45 ఎకరాల 39 కుంటల్లో 10 ఎకరాలు టీఎన్జీవోలకు కేటాయించగా, అందులో 90శాతం ఖాళీగానే ఉన్నాయి. అదే సర్వేనెంబర్‌లో 15.39 ఎకరాలను ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు కబ్జా చేసి నివసిస్తున్నారు. 94లోన్న 15 కుంటల ఊరచెరువు స్లూయిజ్ కూడా కబ్జాకు గురయింది. మూడెకరాలు ఒయాసిస్ రిక్రియేషన్ క్లబ్‌కు కేటాయించినా క్లబ్ పనిచేయడం లేదు. 234లో ఉన్న 129 ఎకరాల 4 కుంటల లకారం చెరువు శిఖం భూమిపై డీటైల్డ్ సర్వే చేయనున్నారు.

వి.వి.పాలెం:
సర్వే నెంబర్ 101లో ఉన్న 150 ఎకరాలకు గాను 111 ఎకరాలు అసైన్ చేశారు. అందులో 34 ఎకరాల్లో ఉల్లంఘనలుండగా, 37 ఎకరాలు కబ్జా అయింది. 158లో ఉన్న ఎకరం సీలింగ్ భూమిని కబ్జా చేశారు. 66లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి చెందిన 24 గుంటల భూమి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేశారు. అదే గ్రామంలోని 9 ఎకరాల 23 కుంటలు కబ్జాకు గురయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement